త్రివిధ దళాల సమీకృత అధునాతన యుద్ధ కమాండ్లు
ఆయుధ కొనుగోళ్లు సరళతరం
రక్షణ శాఖ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు.
త్రివిధ దళాల సంయుక్త కమాండ్
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్‌లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది.
9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...
→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.
→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.
→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం
→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం
→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్‌సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట
→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.
→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.
→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.
→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట.
Comments
Please login to add a commentAdd a comment