శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్షించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ అధికారుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. అలాగే రాజౌరీ జిల్లాలో సైనికుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులను పరమర్శించారు.
కాగా డిసెంబర్ 21న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సైనికులు ప్రతిదాడి చేయగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి.
ఉగ్రదాడిపై దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి వెళ్లింది. సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ములో పర్యటించారు. పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
దీనికి ముందు పౌరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీకి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత పౌరులను బాధపెట్టే ఏ పొరపాట" ఆర్మీ చేయలేదని అన్నారు. ‘మీరు దేశ రక్షకులు. అయితే దేశ భద్రతతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ పౌరులను బాధపెట్టే తప్పులు మీరు చేయకూడదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment