నా జోలికొస్తే.. ఇరాన్‌ సర్వ నాశనమవుతుంది: ట్రంప్‌ | Nothing will be left: Prez Trump Warn Iran In His Style | Sakshi
Sakshi News home page

నా జోలికొస్తే.. ఇరాన్‌ సర్వ నాశనమవుతుంది: ట్రంప్‌ వార్నింగ్‌

Published Wed, Feb 5 2025 9:03 AM | Last Updated on Wed, Feb 5 2025 9:19 AM

Nothing will be left: Prez Trump Warn Iran In His Style

వాషింగ్టన్‌: అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇరాన్‌ ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని యోచిస్తు‍న్నట్లు ప్రకటించారాయన. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఆయన సంతకం కూడా చేశారు. అదే సమయంలో..  ఇరాన్‌ గనుక తనను చంపాలని చూస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన హెచ్చరించారు.

గతంలో.. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)  గరిష్టంగా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే.. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇరాన్‌ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో..  ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో భేటీకి ముందు ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తన తొలి హయాంలో టెహ్రాన్‌పై వాషింగ్టన్‌ అమలుచేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.

టెహ్రాన్‌ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి.. ‘‘ఇరాన్‌(Iran) అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌తో డీల్‌కు నేను సానుకూలంగానే ఉన్నా. కానీ న్యూక్లియర్‌ ఒప్పందానికి మాత్రం కాదు. ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమే. అయితే, అణ్వాయుధాన్ని అందుకోవడంలో టెహ్రాన్‌ చాలా దగ్గరగా ఉంది. దాన్ని అడ్డుకోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు..

.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, నాకు అంతగా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా నేను సంతకం చేసే సమయంలోనే అన్ని విభాగాల నుంచి ఆ విజ్ఞప్తులు వచ్చాయి. ప్రత్యేకించి.. అణ్వాయుధాల విషయంలో. తప్పనిసరిగా ఆ ఆదేశాలపై నేను సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్‌కు విషయంలో అది మరింత కఠినంగా ఉండబోతోంది​‍​‍’’ అని అన్నారాయన.  

ఇక ఇరాన్‌ తనను హత్య చేయడానికి కుట్ర పన్నితే.. అ దేశం పూర్తిగా నాశనమవుతుంది. ఏమీ మిగలదు అని ట్రంప్‌ హెచ్చరించారు. ‘‘నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే..! నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చా’’ అని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. ట్రంప్‌ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఇరాన్‌ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 2020లో అప్పటి ఇరాన్‌ మేజర్‌ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టేందుకు ఆదేశాలిచ్చారు.  ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులు చేయగా..  అందులోనే సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్‌.. ట్రంప్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. కిందటి ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ఇరాన్‌ పాత్ర ఉన్నట్లు అమెరికా న్యాయవిభాగం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇరాన్‌ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement