
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది.

అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు.

భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది.

అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.

కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార.

ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.

లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం

ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది. అంతేకాదు.. ఈ లెగ్‌స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది.