KG Balakrishnan
-
‘మతం మెలికను రద్దు చేయాలి’
ఢిల్లీ: మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్యాంగ ఫలాలను దళితులకు దూరం చేసిన 1950లో ఇచ్చిన షెడ్యూల్డు కులాల రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చెయ్యాలని కోరుతూ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబూరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి మేధావుల బృందం ఎంక్వైరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ను కలిసింది. ‘‘ డెబ్బై నాలుగు సంవత్సరాల గణతంత్ర దేశ చరిత్రలో దళితుల మెడకు బిగించిన మతం మెలికను ఎత్తి వేయడానికి తగిన సిఫారసు చెయ్యాలని కోరాం. ఈ ఉత్తర్వు వలన దళితులు మతపరంగా విభజించబడ్డారు. ఏ మతంలోని దళితులకైనా కులపరంగా వివక్ష ఉంది. ఆ వివక్ష రూపాలను , వివక్ష జరుగుతున్న తీరును తెలిచెప్పాం. ఈ ఉత్తర్వు వలన క్రైస్తవ దళితులు షెడ్యూల్డు కులాలకు కల్పించే ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారు. అంతే కాకుండా విద్య ఉద్యోగాలలో కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మతం, సంస్కృతి సంప్రదాయాలు ఆయా భౌగోళిక పరిస్థితుల ఆధారంగ వుంటాయి. సాంస్కృతిక విషయాలను గుర్తించాలి. అదే కోణంలో భారత దేశంలో క్రీస్తు పూర్వమే నెలకొన్న హిందూ మతాన్ని అందులోని కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ..ఎక్కడో ఇజ్రాయేలులో పుట్టిన క్రైస్తవ మతం లో కులం లేదు కాబట్టి భారత దేశంలో క్రైస్తవంలోకి చేరే దళితులకు కుల వివక్ష వుండదనే సూత్రీకరణల ఆధారంగా క్రైస్తవం తీసుకునే దళితులను షెడ్యూల్డు కులాల వారిగా గుర్తించనని చెప్పడం అర్థం లేనిలేదు. ఇజ్రాయెల్, ఇతర క్రైస్తవ దేశాలలో రంగు, జాతి వివక్ష అక్కడ ఉంది. ఆ దేశాలలో హిందూ మతం పుట్టలేదు. కాబట్టి అక్కడ కుల వివక్ష లేదు. భారత దేశంలో హిందూ మతం వుండడం వలన భారత దేశ మంతటా కుల వివక్ష విస్తరించింది. భారత్‌తో అన్ని మతాలలో కులం వుంటుందని అక్కడ అన్ని మతాలలో జాతి , రంగులను బట్టి వివక్ష వుంటుంది. భారత దేశంలో వుండే అన్ని రకాల మతాలలో కులం వుంటుందని భారతీయులు అధికంగా వలసపోతున్న అభివృద్ధిచెందిన దేశాలలో కుల వివక్ష ఆరంభమయ్యింది’ అని జస్టిస్ బాలకృష్ణన్ అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ బాబు రావు వివరణ ఇచ్చారు.‘‘ నాటి రాష్ట్రపతి ఉత్తర్వు నేటికీ దళితుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును , ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించే హక్కును దళితులు మాత్రమే కోల్పోతున్నారు. తద్వారా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పులుగుజ్జు సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘మాదిగ, మాల, పరయ, పులయ వంటి కులాల పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందనే ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రుజువు చేసింది’’ అని బ్రదర్ జోస్ డేనియల్ చెప్పారు. ‘‘పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఏ మతం వారికైనా కులం తప్పకుండా రికార్డు చేయాలని అటువంటప్పుడు దళితులు ఏ మతంలో వుంటే ఏముంది’’ అని తెలంగాణ హైకోర్టు లాయరు చాట్ల సుధీర్ అన్నారు. సామాజిక, ఆర్థిక , రాజకీయ రంగాల్లో దళితులు రాణించాలంటే అడ్డంకిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని విన్నవించారు. అనేక రకాల అభిప్రాయాలు విన్న తరువాత నవంబరు మాసంలో ఆంధ్ర తెలంగాణకు రాష్ట్రాలు పర్యటిస్తానని తమ వాదనలు క్షేత్ర స్థాయి పర్యటనలో తెలియజేయాలని జస్టిస్ బాలకృష్ణన్ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతినిధి బృందంలో ఫా. అంతోనిరాజ్ సీబీసీఐ సెక్రటరీ, బిషప్ వీరాజీ ఇజ్రాయెల్, గోనె సాల్మన్ రాజ్ , సిస్టర్ అనేయ ఫెర్నాండెజ్, తదితరులు పాల్గొన్నారు. -
మత మార్పిడి చేసుకున్న వారికి ఎస్సీ హోదాపై కేంద్రం అధ్యయనం
న్యూఢిల్లీ: వేరే మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇందుకోసం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాల్లోకి కాకుండా వేరే మతాల్లోకి మారిన వారికీ ఎస్సీ హోదా ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని ఈ కమిషన్ తేల్చనుంది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలు సుష్మా యాదవ్‌లతో ఈ త్రిసభ్య కమిషన్‌ను కొలువుతీరుస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. రాజ్యాంగంలోకి 341 ఆర్టికల్ ప్రకారం గతంలో పలు సందర్భాల్లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను, ప్రస్తుత పరిస్థితులను కమిషన్ పరిశీలించనుంది. వేరే మతం వారికి ఎస్సీ హోదా ఇస్తే ఇప్పటికే ఎస్సీ హోదా లబ్ధిపొందుతున్న వారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వివక్ష, పేదరికం వంటి అంశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలనూ కూలంకషంగా కమిషన్ అధ్యయనం చేయనుంది. -
ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ అవార్డ్ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కేజీ బాలక్రిష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్ ఆఫ్ ఛేంజ్ నేషనల్ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు. -
అట్రాసిటీ చట్ట రక్షణ బాధ్యత కేంద్రానిదే
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నుంచి ఆ చట్టాన్ని రక్షించే బాధ్యత పార్లమెంటుకుందని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు. ఈ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అదే కోర్టులో రివ్యూ పిటిషన్ ఉందన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు ఆదివారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో జరిగిన దళిత, గిరిజన మేధావుల సభలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజనుల భవిçష్యత్తు ఈ చట్టం పరిరక్షణలోనే ఉందన్నారు. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని కొందరు వాదిస్తున్నారని, అయితే అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఆ«ధిపత్యవర్గాలవాడిగానో, రాజకీయ ప్రాబల్యం గలవాడిగానో ఉండటం వల్ల, ఫిర్యాదుదారుడు పేదవాడు, పలుకుబడి లేనివాడు కావడం వల్ల కేసుల్లో చాలావరకు రాజీ కుదుర్చుతున్నారని అన్నారు. నమోదైన కేసుల్లో అతితక్కువ శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు దేశవ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం గళం వివిపిస్తున్నారని అన్నారు. అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ కో ఆర్డినేటర్ జేబీ రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. అగ్రకులాల ప్రయోజనాల కోసం చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు ఈ నెల 27న వరంగల్‌లో 30 లక్షల మంది దళిత, గిరిజనులతో సింహగర్జన పేరుతో నిర్వహించే భారీ బహిరంగసభ ద్వారా కేంద్రానికి తమ శక్తిని చాటుతామన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎన్.రామారావు, ఐఆర్టీఎస్ రిటైర్డ్ అధికారి భరత్‌భూషణ్, ఐఎఎస్ అధికారి ఎ.మురళి, ప్రొఫెసర్లు గాలి వినోద్‌కుమార్, ముత్తయ్య, లంబా డా హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్యనాయక్, మాలమహానాడు నేత చెన్నయ్య, తుడుందెబ్బ నేత ఉపేందర్, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు వలిగి ప్రభాకర్, రచయిత్రి గోగు శ్యామల, జీవన్‌లాల్, డాక్టర్ బి.బాబురావు, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు మౌలికంగా తప్పు’
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పు ‘మౌలికంగా తప్పని’ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ పేర్కొన్నారు. కోర్టు తీర్పులు ప్రజల్లో హింసకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పు నిబంధనల్ని నిర్వీర్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సుప్రీంకోర్టు నిర్ణయం ప్రజల మధ్య హింసను ప్రేరేపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అధిక శాతం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాల్ని కోర్టు వెలువరించాల్సి ఉంది. అంతేకానీ సమాజంలో హింసను పురికొల్పకూడదు’ అని అన్నారు. -
సామాన్యుడి హక్కులకు భరోసా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని సామాన్యుల హక్కులకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సూచించారు. మెరుగైన మానవతా విలువలకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని వివిధ కేసుల బహిరంగ విచారణ నిమిత్తం ఎన్హెచ్ఆర్సీ బుధవారం నుంచి మూడురోజుల పాటు హైదరాబాద్‌లో విడిది చేయనుంది. మొదటిరోజు విచారణ ప్రారంభం సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు సంబంధించి తమకు లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా 98 వేల పైచిలుకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదుల విచారణలో సంబంధిత అధికారులకు, ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసే అధికారం తమకు లేదన్నారు. అయితే, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపడం ద్వారా అధికారులు, ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టేలా కమిషన్ కృషి చేస్తుందని జస్టిస్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. అన్యాయాలను ఎదిరించేందుకు గొంతులేనివారికి గొంతుకగా తమ కమిషన్ పనిచేస్తుందని ఎన్హెచ్ఆర్సీ రిజిస్ట్రార్ (లా) ఏకే గార్గ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు జస్టిస్ సి.జోసెఫ్, జస్టిస్ మురుగేశన్, ఎస్.సి.సిన్హాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహిలు పాల్గొన్నారు. తొలిరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 61 ఫిర్యాదులను కమిషన్ సభ్యులు విచారించారు. విచారణ కమిటీలే లేవా! పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను విచారించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంపై జస్టిస్ మురుగేశన్ విస్మయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన ఫిర్యాదును జస్టిస్ మురుగేశన్ విచారించారు. ఈ సందర్భంగా ఏ జిల్లాలోనూ సదరు కమిటీలు లేవని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. వెంటనే అన్ని జిల్లాల్లో విచారణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. మరో కేసు విచారణ సందర్భంగా దళితులపై దాడులు జరిగినప్పుడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడమే కాకుండా.. ఈ చట్టం కింద బాధితులకు పరిహారం అందేలా చూడాలని జస్టిస్ మురుగేశన్ సూచించారు. -
జస్టిస్ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఒక అఫిడవిట్‌ను హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆరోపణల ఆధారంగా జస్టిస్ బాలకృష్ణన్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించలేమని స్పష్టం చేసింది. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు ఆయన ఆస్తులు, బంధువుల ఆస్తులు అపరిమితంగా పెరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జస్టిస్ బాలకృష్ణన్‌ను ఎన్హెచ్ఆర్సీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ‘కామన్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యానికి స్పందనగా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల డెరైక్టరేట్లు జరిపిన దర్యాప్తులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని తెలిపింది. అంతేకాక, జస్టిస్ బాలకృష్ణన్ పదవిలో ఉన్నపుడు దుష్ర్పవర్తన కలిగిలేరని, అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు తేలలేదని, ఏదేని కేసులకు సంబంధించి డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు దొరకలేదని వివరించింది. కాబట్టి కేవలం ఆరోపణల ఆధారంగా బాలకృష్ణన్‌ను ఎన్హెచ్ఆర్సీ పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది.