జస్టిస్ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌కు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఒక అఫిడవిట్‌ను హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆరోపణల ఆధారంగా జస్టిస్ బాలకృష్ణన్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించలేమని స్పష్టం చేసింది. ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నపుడు ఆయన ఆస్తులు, బంధువుల ఆస్తులు అపరిమితంగా పెరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
జస్టిస్ బాలకృష్ణన్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ‘కామన్ కాజ్’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యానికి స్పందనగా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల డెరైక్టరేట్‌లు జరిపిన దర్యాప్తులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని తెలిపింది. అంతేకాక, జస్టిస్ బాలకృష్ణన్ పదవిలో ఉన్నపుడు దుష్ర్పవర్తన కలిగిలేరని, అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు తేలలేదని, ఏదేని కేసులకు సంబంధించి డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు దొరకలేదని వివరించింది. కాబట్టి కేవలం ఆరోపణల ఆధారంగా బాలకృష్ణన్‌ను ఎన్‌హెచ్‌ఆర్‌సీ పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది.