హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నుంచి ఆ చట్టాన్ని రక్షించే బాధ్యత పార్లమెంటుకుందని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అన్నారు. ఈ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అదే కోర్టులో రివ్యూ పిటిషన్ ఉందన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించేందుకు ఆదివారం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో జరిగిన దళిత, గిరిజన మేధావుల సభలో ఆయన మాట్లాడారు.
దళిత, గిరిజనుల భవిçష్యత్తు ఈ చట్టం పరిరక్షణలోనే ఉందన్నారు. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని కొందరు వాదిస్తున్నారని, అయితే అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఆ«ధిపత్యవర్గాలవాడిగానో, రాజకీయ ప్రాబల్యం గలవాడిగానో ఉండటం వల్ల, ఫిర్యాదుదారుడు పేదవాడు, పలుకుబడి లేనివాడు కావడం వల్ల కేసుల్లో చాలావరకు రాజీ కుదుర్చుతున్నారని అన్నారు. నమోదైన కేసుల్లో అతితక్కువ శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలు దేశవ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం గళం వివిపిస్తున్నారని అన్నారు. అట్రాసిటీ చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ కో ఆర్డినేటర్ జేబీ రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. అగ్రకులాల ప్రయోజనాల కోసం చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు ఈ నెల 27న వరంగల్‌లో 30 లక్షల మంది దళిత, గిరిజనులతో సింహగర్జన పేరుతో నిర్వహించే భారీ బహిరంగసభ ద్వారా కేంద్రానికి తమ శక్తిని చాటుతామన్నారు.
కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎన్.రామారావు, ఐఆర్‌టీఎస్ రిటైర్డ్ అధికారి భరత్‌భూషణ్, ఐఎఎస్ అధికారి ఎ.మురళి, ప్రొఫెసర్లు గాలి వినోద్‌కుమార్, ముత్తయ్య, లంబా డా హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్యనాయక్, మాలమహానాడు నేత చెన్నయ్య, తుడుందెబ్బ నేత ఉపేందర్, ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకుడు వలిగి ప్రభాకర్, రచయిత్రి గోగు శ్యామల, జీవన్‌లాల్, డాక్టర్ బి.బాబురావు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment