ఢిల్లీ: మతం మెలికను దళితుల మెడకు చుట్టి రాజ్యాంగ ఫలాలను దళితులకు దూరం చేసిన 1950లో ఇచ్చిన షెడ్యూల్డు కులాల రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చెయ్యాలని కోరుతూ విశ్రాంత అదనపు డీజీపీ డాక్టర్ కూచిపూడి బాబూరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి మేధావుల బృందం ఎంక్వైరీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌ను కలిసింది.
‘‘ డెబ్బై నాలుగు సంవత్సరాల గణతంత్ర దేశ చరిత్రలో దళితుల మెడకు బిగించిన మతం మెలికను ఎత్తి వేయడానికి తగిన సిఫారసు చెయ్యాలని కోరాం. ఈ ఉత్తర్వు వలన దళితులు మతపరంగా విభజించబడ్డారు. ఏ మతంలోని దళితులకైనా కులపరంగా వివక్ష ఉంది. ఆ వివక్ష రూపాలను , వివక్ష జరుగుతున్న తీరును తెలిచెప్పాం. ఈ ఉత్తర్వు వలన క్రైస్తవ దళితులు షెడ్యూల్డు కులాలకు కల్పించే ప్రభుత్వ పథకాలను పొందలేక పోతున్నారు. అంతే కాకుండా విద్య ఉద్యోగాలలో కొనసాగుతున్న వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. మతం, సంస్కృతి సంప్రదాయాలు ఆయా భౌగోళిక పరిస్థితుల ఆధారంగ వుంటాయి. సాంస్కృతిక విషయాలను గుర్తించాలి. అదే కోణంలో భారత దేశంలో క్రీస్తు పూర్వమే నెలకొన్న హిందూ మతాన్ని అందులోని కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
..ఎక్కడో ఇజ్రాయేలులో పుట్టిన క్రైస్తవ మతం లో కులం లేదు కాబట్టి భారత దేశంలో క్రైస్తవంలోకి చేరే దళితులకు కుల వివక్ష వుండదనే సూత్రీకరణల ఆధారంగా క్రైస్తవం తీసుకునే దళితులను షెడ్యూల్డు కులాల వారిగా గుర్తించనని చెప్పడం అర్థం లేనిలేదు. ఇజ్రాయెల్, ఇతర క్రైస్తవ దేశాలలో రంగు, జాతి వివక్ష అక్కడ ఉంది. ఆ దేశాలలో హిందూ మతం పుట్టలేదు. కాబట్టి అక్కడ కుల వివక్ష లేదు. భారత దేశంలో హిందూ మతం వుండడం వలన భారత దేశ మంతటా కుల వివక్ష విస్తరించింది. భారత్‌తో అన్ని మతాలలో కులం వుంటుందని అక్కడ అన్ని మతాలలో జాతి , రంగులను బట్టి వివక్ష వుంటుంది. భారత దేశంలో వుండే అన్ని రకాల మతాలలో కులం వుంటుందని భారతీయులు అధికంగా వలసపోతున్న అభివృద్ధిచెందిన దేశాలలో కుల వివక్ష ఆరంభమయ్యింది’ అని జస్టిస్ బాలకృష్ణన్ అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ బాబు రావు వివరణ ఇచ్చారు.
‘‘ నాటి రాష్ట్రపతి ఉత్తర్వు నేటికీ దళితుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును , ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించే హక్కును దళితులు మాత్రమే కోల్పోతున్నారు. తద్వారా దళితుల ఆత్మ గౌరవం దెబ్బతింటుంది’’ అని సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పులుగుజ్జు సురేష్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.
‘‘మాదిగ, మాల, పరయ, పులయ వంటి కులాల పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉందనే ఈ విషయాన్ని 2007వ సంవత్సరంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రుజువు చేసింది’’ అని బ్రదర్ జోస్ డేనియల్ చెప్పారు.
‘‘పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఏ మతం వారికైనా కులం తప్పకుండా రికార్డు చేయాలని అటువంటప్పుడు దళితులు ఏ మతంలో వుంటే ఏముంది’’ అని తెలంగాణ హైకోర్టు లాయరు చాట్ల సుధీర్ అన్నారు.
సామాజిక, ఆర్థిక , రాజకీయ రంగాల్లో దళితులు రాణించాలంటే అడ్డంకిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయడం తప్ప మరొక మార్గం లేదని విన్నవించారు. అనేక రకాల అభిప్రాయాలు విన్న తరువాత నవంబరు మాసంలో ఆంధ్ర తెలంగాణకు రాష్ట్రాలు పర్యటిస్తానని తమ వాదనలు క్షేత్ర స్థాయి పర్యటనలో తెలియజేయాలని జస్టిస్ బాలకృష్ణన్ ప్రతినిధి బృందానికి తెలియజేశారు. ప్రతినిధి బృందంలో ఫా. అంతోనిరాజ్ సీబీసీఐ సెక్రటరీ, బిషప్ వీరాజీ ఇజ్రాయెల్, గోనె సాల్మన్ రాజ్ , సిస్టర్ అనేయ ఫెర్నాండెజ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment