
ప్రస్తుతం రూ.5 లక్షలకే బీమా
ప్రభుత్వ పరిశీలనలో మరింత పెంచాలన్న ప్రతిపాదన
ముంబై: బ్యాంకు డిపాజిట్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌పై బీమా సదుపాయం అమలవుతోంది. దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజ్ వెల్లడించారు. ఇటీవలే ముంబైలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో స్కామ్ వెలుగు చూడడం తెలిసిందే.
ఈ తరహా స్కామ్‌లు, ఆర్థిక సంక్షోభాలతో బ్యాంక్ కుప్పకూలితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేస్తుంటుంది. ఇందుకుగాను బ్యాంక్‌లు డీఐసీజీసీకి ఏటా ప్రీమియం చెల్లిస్తుంటాయి. ‘‘డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పుడు దీన్ని నోటిఫై చేస్తాం’’అని నాగరాజు వెల్లడించారు. 2020లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాత.. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్‌ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం గమనార్హం. దీని ఫలితంగా న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్ దారుల్లో 90 శాతం మందికి తమ డిపాజిట్ మొత్తం వెనక్కి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment