Economic Affairs Secretary
-
డిపాజిట్‌పై బీమా పెంపు!
ముంబై: బ్యాంకు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఒక బ్యాంక్ పరిధిలో ఒక కస్టమర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల డిపాజిట్‌పై బీమా సదుపాయం అమలవుతోంది. దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజ్ వెల్లడించారు. ఇటీవలే ముంబైలో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్‌లో స్కామ్ వెలుగు చూడడం తెలిసిందే. ఈ తరహా స్కామ్‌లు, ఆర్థిక సంక్షోభాలతో బ్యాంక్ కుప్పకూలితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేస్తుంటుంది. ఇందుకుగాను బ్యాంక్‌లు డీఐసీజీసీకి ఏటా ప్రీమియం చెల్లిస్తుంటాయి. ‘‘డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పుడు దీన్ని నోటిఫై చేస్తాం’’అని నాగరాజు వెల్లడించారు. 2020లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్‌లో సంక్షోభం తలెత్తిన తర్వాత.. డిపాజిట్‌పై ఇన్సూరెన్స్‌ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం గమనార్హం. దీని ఫలితంగా న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్ దారుల్లో 90 శాతం మందికి తమ డిపాజిట్ మొత్తం వెనక్కి రానుంది. -
ఫారెక్స్ నిల్వలు పుష్కలం పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయంటూ నెలకొన్న ఆందోళనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తోసిపుచ్చారు. దీన్ని ‘మరీ ఎక్కువగా‘ చేసి చూపుతున్నారని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయని సేఠ్ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం తగ్గడం, వాణిజ్య లోటు అధికంగా ఉండటం వల్ల మారక నిల్వలు తగ్గాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఆయన చెప్పారు. వరుసగా ఏడో వారం ఫారెక్స్ నిల్వలు తగ్గిన నేపథ్యంలో సేథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే 2.23 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81ని కూడా దాటేసి ఆల్‌టైం కనిష్టానికి పడింది. మరోవైపు, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, అంతర్జాతీయంగా డాలరు బలపడుతుండటమే రూపాయి క్షీణతకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
తెలుగు ఐఏఎస్ రవి కోటకు కీలక పదవి
న్యూఢిల్లీ: తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోటకు కీలక పదవి దక్కింది. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా ఆయన నియమితులయ్యారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకనమిక్ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి కోట.. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట.. 1993 బ్యాచ్ అసోం క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గత రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ గురువారం.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చదవండి: వడ్డీ రద్దుపై కేంద్రం వివరణ కోరిన సుప్రీం -
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్ బజాజ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గురువారం పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్ బజాజ్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. -
ఇక నగదు మార్పిడి రూ.2వేలు మాత్రమే
-
మళ్లీ వెయ్యి నోట్లు వచ్చేస్తాయి!
ప్రస్తుతం ప్రభుత్వం రద్దుచేసిన వెయ్యి రూపాయల నోట్లు త్వరలోనే మళ్లీ మార్కెట్లలోకి వస్తాయి. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతోపాటు ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ కొత్త విషయం వెల్లడించారు. దాంతోపాటు, ఇప్పటికే చలామణిలో ఉన్న అన్ని నోట్లూ మళ్లీ కొత్త డిజైన్లతో వస్తాయని కూడా తెలిపారు. ఇప్పుడు చలామణిలో ఉన్న 100, 50, 20, 10, 5, 2, 1 నోట్లు అన్నీ కూడా యథాతథంగా చెల్లుబాటు అవుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నోట్లన్నింటినీ కూడా కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో త్వరలోనే మళ్లీ విడుదల చేస్తామన్నారు. కొత్త కొలతలు, డిజైన్లతో వెయ్యి రూపాయల నోట్లను కూడా కొన్ని నెలల్లో మళ్లీ విడుదల చేస్తామని శక్తికాంత దాస్ వివరించారు. గత కొన్ని నెలలుగా కొత్త నోట్ల ముద్రణ వ్యవహారం కొనసాగుతూనే ఉందని, రిజర్వు బ్యాంకులో ఉన్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే కొత్త నోట్ల డిజైన్ విషయం తెలుసని ఆయన చెప్పారు. -
మళ్లీ వెయ్యి నోట్లు వచ్చేస్తాయి!
-
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా రాజీవ్ మహర్షి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అర్వింద్ మాయారామ్ స్థానంలో వచ్చిన రాజీవ్ 1978 బ్యాచ్ ఐఏఎస్ రాజస్థాన్ కేడర్ ఆఫీసర్, అర్వింద్ మాయారామ్, రాజీవ్ మహర్షి ఇద్దరూ బ్యాచ్మేట్లు కావడం విశేషం. సంస్కరణలకు అనుకూలవాది అని పేరుబడ్డ రాజీవ్ మహర్షి రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు కార్మిక చట్టాలకు సవరణల విషయంలో చురుకుగా వ్యవహరించారు. అర్వింద్ మాయారామ్ను మొదటగా పర్యాటక శాఖకు, ఆ తర్వాత మైనారిటీ వ్యవహారాల శాఖకు బదిలీ చేశారు. ఆర్థిక శాఖలో మొత్తం ఐదుగురు కార్యదర్శులుం టారు. వారు.. ఆర్థిక వ్యవహారాలు, వ్యయ, రెవెన్యూ, డిజిన్వెస్ట్‌మెంట్, ఆర్థిక సేవలు. వీరందరిలోకి సీనియర్ అధికారి ఆర్థిక కార్యదర్శిగా(ప్రస్తుతం రాజీవ్) వ్యవహరిస్తారు. ప్రస్తుతం వ్యయ కార్యదర్శిగా రతన్ పి. విఠల్, ఆర్థిక సేవల కార్యదర్శిగా గుర్దయాళ్ సింగ్ సంధు, రెవెన్యూ కార్యదర్శిగా శక్తికాంత దాస్, డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శిగా ఆరాధన జోహ్రిలు వ్యవహరిస్తున్నారు. -
రెండు కేటగిరీలుగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల విధానాలను పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్న ప్రభుత్వం వీటిని రెండు కేటగిరీలుగా విభజించాలని చూస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)గా వర్గీకరించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆటోమాటిక్ అనుమతికి సంబంధించి ఎఫ్‌పీఐలకు 24%, ఎఫ్‌డీఐలకు 49% పరిమితిని అమలు చేయనుంది. ఈ ప్రతిపాదనలు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఎఫ్పీఐలలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49%కు పెంచే ప్రతిపాదనకు సైతం మాయారామ్ కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 10% వరకే : ఎఫ్‌పీఐ కింద లిస్టెడ్ కంపెనీలలో వ్యక్తిగత పెట్టుబడి పరిమితిని 10% వరకూ అనుమతించనున్నారు. అర్హతగల విదేశీ ఇన్వెస్టర్లు(క్యూఎఫ్ఐలు), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ కేటగిరిలోకి వస్తారు. 10% పరిమితికి మించిన వ్యక్తిగత పెట్టుబడిని ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు. ఇక అన్‌లిస్టెడ్ కంపెనీలలో ఎఫ్‌పీఐలను ఎఫ్డీఐలుగా పరిగణిస్తారు. ఇక ప్రవాసాంధ్రుల పెట్టుబడులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తారు. ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐల మధ్య సందిగ్ధతను తొలగించేందుకు ప్రభుత్వం మాయారామ్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరుకల్లా కమిటీ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని నిర్వచించేందుకు అంతర్జాతీయ విధానాలను పరిశీలించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు కూడా. -
త్వరలో రూపాయి స్థిరపడుతుంది: మాయారామ్
న్యూఢిల్లీ: విదేశీ మారకంలో రూపాయి విలువ ఒకటిరెండు రోజుల్లో స్థిరపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల డిపాజిట్లు పుంజుకునే అవకాశాలు, ఎగుమతిదారుల నుంచి లభించే విదేశీ మారకద్రవ్యం వల్ల రూపాయి బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. డాలర్ల కొనుగోళ్లకు చమురు కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ (ఆగస్టులో ప్రారంభించిన) స్పెషల్ విండో మార్గాన్నే కాకుండా- ఓపెన్ మార్కెట్ వైపునకు మళ్లడం తాజా రూపాయి బలహీనతకు కారణమని ఆయన విశ్లేషించారు. ఆగస్టు 28న రికార్డు కనిష్ట స్థాయి 68.85ని తాకిన రూపాయి అటు తర్వాత 10 శాతం వరకూ రికవరీ సాధించింది. అయితే బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ ఒక్కరోజే 77 పైసలు దిగజారి నెలరోజుల కనిష్ట స్థాయి 62.39 వద్ద స్థిరపడ్డం తిరిగి ఆందోళన సృష్టించింది. గురువారం కూడా రూపాయి దాదాపు ఇదే స్థాయిలో 62.41 స్థాయిలో ముగిసింది. ఒక దశలో రూపాయి గురువారం ఐదు వారాల కనిష్ట స్థాయి 62.73ని చూసింది. అయితే అటు తర్వాత కోలుకుంది. -
రాజన్‌తో చిదంబరం భేటీ
న్యూఢిల్లీ: రూపాయి రికార్డు స్థాయి పతనం, స్టాక్ మార్కెట్లు కుదేలవడం... ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం మూడో రోజు కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న రఘురామ్ రాజన్‌తో పాటు వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల భారత విభాగపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు(ఈడీ)లతో కూడా ఆయన సమావేశాలు జరిపారు. ముకేష్ ప్రసాద్(వరల్డ్ బ్యాంక్ ఈడీ). రాకేష్ మోహన్(అంతర్జాతీయ ద్రవ్య సంస్థ-ఐఎంఎఫ్), ఉమేష్ కుమార్(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్)లతో ఆయన సమావేశం జరిపారు. ఈ సమావేశాల కారణంగా భారత్ నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించనున్నదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.