త్వరలో రూపాయి స్థిరపడుతుంది: మాయారామ్
న్యూఢిల్లీ: విదేశీ మారకంలో రూపాయి విలువ ఒకటిరెండు రోజుల్లో స్థిరపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల డిపాజిట్లు పుంజుకునే అవకాశాలు, ఎగుమతిదారుల నుంచి లభించే విదేశీ మారకద్రవ్యం వల్ల రూపాయి బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
డాలర్ల కొనుగోళ్లకు చమురు కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ (ఆగస్టులో ప్రారంభించిన) స్పెషల్ విండో మార్గాన్నే కాకుండా- ఓపెన్ మార్కెట్ వైపునకు మళ్లడం తాజా రూపాయి బలహీనతకు కారణమని ఆయన విశ్లేషించారు. ఆగస్టు 28న రికార్డు కనిష్ట స్థాయి 68.85ని తాకిన రూపాయి అటు తర్వాత 10 శాతం వరకూ రికవరీ సాధించింది. అయితే బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ ఒక్కరోజే 77 పైసలు దిగజారి నెలరోజుల కనిష్ట స్థాయి 62.39 వద్ద స్థిరపడ్డం తిరిగి ఆందోళన సృష్టించింది. గురువారం కూడా రూపాయి దాదాపు ఇదే స్థాయిలో 62.41 స్థాయిలో ముగిసింది. ఒక దశలో రూపాయి గురువారం ఐదు వారాల కనిష్ట స్థాయి 62.73ని చూసింది. అయితే అటు తర్వాత కోలుకుంది.