రూపాయి సరైన విలువ 58-60
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకానికి 58-60 అనేది సరైన విలువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ‘కొనుగోలు శక్తి ఆధారంగా రూపాయికి ఒక అంతర్గత విలువ ఉంటుంది. వాస్తవ కరెన్సీ మారకం రేటు(ఆర్‌ఈఈఆర్) ప్రకారం చూస్తే ఈ అంతర్గత విలువ ప్రస్తుతం 58-60గా ఉండాలి’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. రూపాయి విలువ ఇటీవలే కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయి(68.86)... ప్రస్తుతం కాస్త కోలుకున్న(63 స్థాయికి) సంగతి తెలిసిందే. పలు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీలతో మారకం విలువల ఆధారంగా నిర్ధారించే కరెన్సీ రేటును ఆర్‌ఈఈఆర్‌గా వ్యవహరిస్తారు.
రూపాయి భారీ పతనానికి చికిత్సలో భాగంగా అటు ఆర్‌బీఐ, ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా దేశంలో బల్క్ డీజిల్‌కు డిమాండ్ తగ్గుముఖం పడుతోందని, దీనివల్ల ప్రభుత్వానికి ప్రస్తుత( 2013-14) ఆర్థిక సంవత్సరంలో బిలియన్ డాలర్ల(సుమారు రూ. 6,300 కోట్లు) వరకూ ఆదా అయ్యేందుకు దోహదం చేస్తుందని మాయారామ్ చెప్పారు. పెట్రో ధరలపై సబ్సిడీల భారం తగ్గించుకోవడానికి భారీగా(బల్క్) డీజిల్ వినియోగదారులకు మార్కెట్ రేటుకే విక్రయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫెడ్ ప్యాకేజీల ఉపసంహరణపై భయాలొద్దు...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ భయాలను ప్రస్తావిస్తూ.. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద తగినన్ని అస్త్రాలు ఉన్నాయని మాయారామ్ పేర్కొన్నారు. రూపాయి విలువ మరింత పడిపోతుందన్న భయాలు అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం 270 బిలియన్ డాలర్ల విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని... ఇదే తరుణంలో ఈ ఏడాది మరో 40 బిలియన్ డాలర్ల నిధులు దేశంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మొత్తం 36 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని మాయారామ్ అంచనా వేశారు.