Arvind Mayaram
-
వక్ఫ్‌బోర్డు విభజనకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. విభజనకు వెంటనే పూనుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రంలోని ముగ్గురు అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందంలో కేంద్ర మంత్రిత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మాయరావ్, సంయుక్త కార్యదర్శి రాకేశ్ మోహన్, కార్యదర్శి పీకే శర్మలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లోని 10వ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డును చేర్చారు. షెడ్యూలు-10లోకి వచ్చే ప్రభుత్వ సంస్థలను కేంద్రం విభజించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఏడు మాసాలు గడిచినా కేంద్రం నుంచి వక్ఫ్‌బోర్డు విభజనకు కసరత్తు ప్రారంభం కాలేదు. దీంతో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వారంక్రితం ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లాను కలిసి వక్ఫ్‌బోర్డు విభజనను త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు 18న కేంద్రం బృందాన్ని హైదరాబాద్‌కు పంపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అందులో భాగాంగానే కేంద్ర బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బుధవారం సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులు, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, డెరైక్టర్లు,వక్ఫ్‌బోర్డు ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు తదితరులతో సమావేశమై వక్ఫ్‌బోర్డు విభజన పై చర్చలు జరుపనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 42 శాతం నిష్పత్తి చొప్పున విభ జన జరగాల్సి ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 43 లక్షలు, సీమాంధ్రలో 39 లక్షల మంది ఉన్నారు. మొదటి సర్వే కమిషన్ ప్రకారం తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు 33, 929, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 4,600 ఆస్తులు మాత్రమే నమోదై ఉన్నాయి. దీంతో వక్ఫ్‌బోర్డు విభజన 52:48 ప్రకారం జరగాల్సి ఉంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చల అనంతరం కేంద్రానికి నివేదిక అందజేయనుంది. నెలాఖరులోగా బోర్డు విభజనపై నోటిఫికేషన్ విడుదలైతే వచ్చే నెల మొదటి వారంలో విభజన జరిగి కొత్త బోర్డులు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి. -
రెండు వారాల్లో ఐఏఎస్ అధికారికి రెండు బదిలీలు
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై మరోసారి బదిలీ వేటు పడింది. రెండు వారాల్లో ఆయనను కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు బదిలీ చేసింది. తొలుత ఆర్థిక శాఖ నుంచి పర్యాటక శాఖకు కార్యదర్శిగా ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా మైనారిటీ వ్యవహారాల శాఖకు పంపింది. ఇది పర్యాటక శాఖ కంటే మరింత తక్కువ స్థాయి పోస్టు అని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 1979 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై ఎందుకు ఇన్నిసార్లు బదిలీవేటు పడుతోందన్నది మాత్రం ప్రస్తుతానికి అర్థం కాని వ్యవహారంలాగే ఉంది. అయితే.. ఆర్థికశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే తొలుత ఈ బదిలీల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ నిర్వచనాలకు కేంద్రం ఓకే
10% మించిన పెట్టుబడులన్నీ ఇక ఎఫ్‌డీఐలే న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నిటినీ ఇక ఎఫ్‌డీఐగా పరిగణించనున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్దీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఓ కంపెనీలో 10 శాతం కంటే తక్కువగా ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు గానీ, తొలి కొనుగోలు చేసిన ఏడాదిలోగా వాటాను 10 శాతానికిపైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువగా ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా దాన్ని ఎఫ్‌డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. -
10 శాతం మించిన ...
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టతనిచ్చేలా ప్రభుత్వ కమిటీ కీలక సూచనలను చేసింది. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి ఉన్న విదేశీ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా పరిగణించాలని... అదేవిధంగా ప్రవాసీయుల పెట్టుబడులను(రాబడులను విదేశాలకు తరలించని ప్రాతిపదికన) దేశీ ఇన్వెస్ట్మెంట్గా వ్యవహరించాలని సిఫార్సు చేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), ఎఫ్‌డీఐల విషయంలో గందరగోళం లేకుండా వాటి నిర్వచనాలను హేతుబద్దీకరించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ సిఫార్సులు చేసింది. కాగా, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులన్నింటినీ ఎఫ్డీఐగానే పరిగణించాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 10 శాతం లోపు చేసే పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా అనుమతించొచ్చని, అయితే తొలి పెట్టుబడి నుంచి ఏడాది వ్యవధిలోగా తమ వాటాను 10 శాతం లేదా అంతకుపైగా పెంచుకోవాలన్న షరతు విధించాలని అభిప్రాయపడింది. కాగా, ఈ ఎఫ్డీఐలన్నీ ఆయా రంగాల్లోని పరిమితులకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసింది. -
ఇరాక్‌పై ఆందోళన అక్కర్లేదు
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం న్యూఢిల్లీ: ఇరాక్ సంక్షోభం వల్ల భారత్‌కి చమురు సరఫరా సమస్యలేమీ తలెత్తబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరాకు ఢోకా లేకుండా భారత్ తగు చర్యలు తీసుకుంటోందని శనివారం కమోడిటీ మార్కెట్లపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాయారాం తెలిపారు. మరోవైపు, దేశీయంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలపై మరీ ఆందోళన చెందనక్కర్లేదని మాయారాం చెప్పారు. ఒకవేళ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినా కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయన్నారు. -
ధరలు దిగొస్తాయ్: మాయారామ్
న్యూఢిల్లీ: వచ్చే కొద్దినెలల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ పేర్కొన్నారు. అయితే, నిత్యావసరాల ధరలకు దీర్ఘకాలంలో కళ్లెంవేయాలంటే డిమాండ్-సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిం చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ద్రవ్యోల్బణం ఇబ్బందికరంగా మారింది. అయితే, సమీప భవిష్యత్తులో ఇది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మరింత తగ్గించాలంటే మాత్రం ఉత్పత్తి పెంపు, కూరగాయలు ఇతరత్రా సరుకుల రవాణాను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాల్సిందే’ అని మాయారామ్ పేర్కొన్నారు. నవంబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్టానికి(7.52%), రిటైల్ ద్రవ్యోల్బణం రేటు రెండంకెల స్థాయిలోనే కొనసాగుతూ 9 నెలల గరిష్ట స్థాయికి(9.52%) ఎగబాకిన సంగతి తెలిసిందే. క్యాడ్ 50 బిలియన్ డాలర్లలోపే: బంగారం దిగుమతులు భారీగా దిగిరావడం, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) 50 బిలియన్ డాలర్లలోపే ఉండొచ్చని మాయారామ్ అంచనావేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం- 88.2 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లడం విదితమే. -
సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలే మిగిలి ఉండటంతో... కేంద్రం త్వరపడుతోంది. ఈ నెల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), ఇంజినీర్స్ ఇండియాల్లో వాటా విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో బీహెచ్ఈఎల్(భెల్), మార్చిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లు క్యూలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంమీద ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం లక్ష్యించిన రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్మెంట్కు దరిదాపుల్లోకి రాగలమని భావిస్తున్నట్లు మాయారామ్ ధీమా వ్యక్తం చేశారు. చిత్రమేంటంటే లక్ష్యం 40వేల కోట్లయితే ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే సమీకరించింది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ చేసిన కంపెనీల్లో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎంఎంటీసీలున్నాయి. దిగ్గజాల వరుస... తాజా రోడ్‌మ్యాప్ ప్రకారం ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియా, హెచ్ఏఎల్లో 10 శాతం చొప్పున వాటా విక్రయించే అవకాశముంది. దీన్లో ఐఓసీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా ద్వారా రూ.500 కోట్లు రావచ్చు. హెచ్ఏఎల్ ద్వారా రూ.3,000 కోట్లు సమకూరే అవకాశముంది. భెల్‌లో 5 శాతం వాటా విక్రయంతో రూ.2,000 కోట్లు ఖజానాకు జమ కావచ్చు. కోల్ ఇండియా, ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్) వంటి దిగ్గజ సంస్థల ఇష్యూలు కూడా చాన్నాళ్లుగా జాప్యమవుతూ వస్తున్నాయి. కాగా, ఐఓసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం చర్చించనుంది. ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ఈజీఓఎం ఈ వాటా (19.16 కోట్ల షేర్ల)విక్రయంపై చర్చిస్తుందని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు. ఐఓసీలో కేంద్ర ప్రభుత్వానికి 78.92 శాతం వాటా ఉంది. కొన్ని పీఎస్‌యూల్లో షేర్లను సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ యంత్రాంగం ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో దీన్ని ఏర్పాటు చేయొచ్చని అంచనా. ప్రతిపాదిత ఈపీఎఫ్‌లో ఇప్పటికే లిస్టయిన సీపీఎస్ఈల షేర్లు(2-3%)ఉంటాయి. పసిడిపై నియంత్రణలు కొనసాగుతాయ్... బంగారం దిగుమతులపై ప్రభుత్వ నియంత్రణలను ఇప్పుడప్పుడే తొలగించే అవకాశాల్లేవని మాయారామ్ చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మెరుగుపడుతున్నప్పటికీ.. కనీసం మార్చి చివరివరకూ ఈ నియంత్రణలు కొనసాగవచ్చన్నారు. క్యాడ్ రికార్డు స్థాయికి చేరడం, రూపాయి పతనం కావటంతో పుత్తడిపై దిగుమతి సంకాన్ని అంచెలంచెలుగా కేంద్రం 10%కి పెంచడం తెలిసిందే. దీంతో మే నెలలో 162 టన్నుల స్థాయి నుంచి నవంబర్‌లో 19.3 టన్నులకు పడిపోయాయి. క్యాడ్ కూడా జూలై క్వార్టర్లో 4.8% నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 1.2%కి దిగొచ్చింది. నియంత్రణల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందా అన్న ప్రశ్నకు.. అలాంటి వాదనలకు తగిన ఆధారాల్లేవని మాయారామ్ తేల్చిచెప్పారు. -
వృద్ధి కోసం మరిన్ని చర్యలు: మాయారామ్
న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి అరవింద్ మాయారామ్ చెప్పారు. ఇక్కడ సోమవారం జరిగిన సీయూటీఎస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన పేర్కొంటూ, అయితే అటుతర్వాత వృద్ధి ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని అన్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలంటే.. మార్కెట్లలో అన్ని వర్గాలు సమానస్థాయిలో పోటీపడే పరిస్థితి కల్పించాల్సి ఉంటుందని, దీనికి మరిన్ని చర్య లు తీసుకోవల్సి ఉంటుందని చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యరక్షణ, రైల్వేలు వంటి రంగాలు ఇబ్బందుల నుంచి గట్టెక్కాల్సి ఉందన్నారు. పది, ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన గుత్తాధిపత్య నియంత్రణ సంస్థలు ప్రస్తుతం దేశీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయని కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) చైర్మన్ అశోక్ చావ్లా తెలిపారు. ఎఫ్ఐఐలతో మాయారాం భేటీ .. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)తో కూడా మాయారాం భేటీ అయ్యారు. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు క ల్పించేందుకు సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ విషయంలో ఆందోళనలు అక్కర్లేదని ఆయన.. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలయన్స్ బెర్న్‌స్టెయిన్, జీఎల్‌జీ పార్ట్నర్స్, డేవిడ్సన్ కెంపెనర్ వంటి ఎఫ్ఐఐల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు -
త్వరలో రూపాయి స్థిరపడుతుంది: మాయారామ్
న్యూఢిల్లీ: విదేశీ మారకంలో రూపాయి విలువ ఒకటిరెండు రోజుల్లో స్థిరపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి మాయారామ్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల డిపాజిట్లు పుంజుకునే అవకాశాలు, ఎగుమతిదారుల నుంచి లభించే విదేశీ మారకద్రవ్యం వల్ల రూపాయి బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. డాలర్ల కొనుగోళ్లకు చమురు కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ (ఆగస్టులో ప్రారంభించిన) స్పెషల్ విండో మార్గాన్నే కాకుండా- ఓపెన్ మార్కెట్ వైపునకు మళ్లడం తాజా రూపాయి బలహీనతకు కారణమని ఆయన విశ్లేషించారు. ఆగస్టు 28న రికార్డు కనిష్ట స్థాయి 68.85ని తాకిన రూపాయి అటు తర్వాత 10 శాతం వరకూ రికవరీ సాధించింది. అయితే బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ ఒక్కరోజే 77 పైసలు దిగజారి నెలరోజుల కనిష్ట స్థాయి 62.39 వద్ద స్థిరపడ్డం తిరిగి ఆందోళన సృష్టించింది. గురువారం కూడా రూపాయి దాదాపు ఇదే స్థాయిలో 62.41 స్థాయిలో ముగిసింది. ఒక దశలో రూపాయి గురువారం ఐదు వారాల కనిష్ట స్థాయి 62.73ని చూసింది. అయితే అటు తర్వాత కోలుకుంది. -
పండుగల వేళ.. చౌక రుణాల మేళా..!
న్యూఢిల్లీ: ఒకవైపు అధిక వడ్డీరేట్ల కారణంగా రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్న వారికీ, మరోవైపు డిమాండ్ లేక కుదేలవుతున్న పరిశ్రమకూ ఊరట కలిగించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ (టీవీలు, ఫ్రిజ్‌లు మొదలైనవి) వంటి వాటి కొనుగోళ్లకు బ్యాంకులు మరికాస్త చౌకగా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు బడ్జెట్లో పేర్కొన్న దానికంటే అదనంగా పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయించింది. అయితే, ఈ పరిమాణం ఎంత మేర ఉంటుందన్నది వెల్లడి కాలేదు. ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా (రూ.14,000 కోట్లు) ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా కాస్త తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇది తోడ్పడగలదు’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగలదని వివరించింది. వినియోగదారులకు.. ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాలకు ఈ నిర్ణయం ఊరట కలిగించగలదని, అలాగే కంపెనీల సామర్థ్య విస్తరణకు, ఉపాధికి, ఉత్పత్తి పెరుగుదలకు కూడా తోడ్పడగలదని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రుణాల వృద్ధిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్దిష్ట రంగాలకు చౌక వడ్డీలపై రుణాలివ్వాల్సిన అవసరంపై చర్చించేందుకు త్వరలోనే పీఎస్‌యూ బ్యాంకుల అధినేతలతో సమావేశమవుతానని చిదంబరం చెప్పారు. బ్యాంకుల సామర్థ్యాన్నిబట్టి తక్కువ వడ్డీ రుణాలివ్వడం ఆధారపడి ఉంటుందన్నారు. ఏయే రంగాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలిస్తే డిమాండ్ మెరుగుపడగలదన్నది బ్యాంకులు నిర్ణయిస్తాయని చిదంబరం చెప్పారు. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి తయారీ ఉత్పత్తులకు డిమాండ్‌ను కన్సూమర్ డ్యూరబుల్స్ విభాగం ప్రతిబింబిస్తుంది. మరోవైపు గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో 6.8 శాతం వృద్ధి చెందిన ద్విచక్ర వాహనాల రంగం ఈసారి 0.72 శాతం మాత్రమే వృద్ధి చెందింది. పరిశ్రమకు సానుకూలం.. పండుగల సీజన్లో చౌక రుణాల పరిణామాన్ని స్వాగతిస్తున్నట్లు వాహన తయారీ సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ద్విచక్ర వాహనాల మార్కెట్ కోలుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోజనాన్ని కార్లు, ఇతర వాణిజ్య వాహనాలకు కూడా వర్తింపచేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేదని కిర్లోస్కర్ చెప్పారు. నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం ..రాయ్‌పూర్‌లో నేడు (శుక్రవారం) ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంకులకు మరిన్ని పెట్టుబడులు సమకూర్చాలన్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కీలక ఆర్థిక పరిణామాలను చర్చించేందుకు ఆర్బీఐ బోర్డు ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమావేశమవుతుంటుంది. తాజాగా ఆర్థిక వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతానికి తగ్గడం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు అధిక స్థాయిలో 4.9 శాతంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జరగబోయే ఆర్బీఐ బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఒక వైపున వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలంటుండగా.. గత నెల జరిగిన త్రైమాసిక మధ్యంతర పరపతి సమీక్షలో కూడా ఆర్బీఐ.. ద్రవ్యోల్బణ కట్టడికే ప్రాధాన్యమిస్తూ పాలసీ రేట్లను పావు శాతం పెంచిన సంగతి తెలిసిందే. రెండో త్రైమాసిక పాలసీ సమీక్ష ఈ నెల 29న జరగనుంది. -
ఇక ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం పైనే నమోదవుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అధిక వ్యవసాయ దిగుబడి, పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి పెంపొందడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. వివిధ అంశాలపై ఏమన్నారంటే... వ్యవ‘సాయం’... పరి‘శ్రమ’... రెండవ క్వార్టర్లో వృద్ధి మెరుగుపడుతుంది. సాగు విస్తీర్ణం పెరగడం, ప్రణాళికా వ్యయం వేగవంతం, భారీ ప్రాజెక్టులకు పెట్టుబడుల వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఐ) ఆమోదం వంటి అంశాలు వృద్ధి మెరుగుపడడంలో దోహదపడే అంశాలు. ఇక వృద్ధికి అవసరమైన తదుపరి అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటుంది. గడచిన ఆర్థిక సంవత్సరం వృద్ధి 5 శాతం, 2013-14లో ఏప్రిల్-జూన్ మధ్య 4.4 శాతం నమోదయినప్పటికీ, తదుపరి త్రైమాసికాల్లో ఇది తప్పనిసరిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. వడ్డీరేట్లపై ఇలా...: ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిధిలోని అంశం. అక్టోబర్ 29న జరిగే ఆర్బీఐ రెండవ త్రైమాసిక సమీక్ష సందర్భంగా గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీరేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తారని భావిస్తున్నాం. క్యాడ్‌కు ‘పసిడి అభయం’: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్-మూలధన పెట్టుబడులు దేశంలోకి వచ్చే-దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 70 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.7%) వద్ద కట్టడి చేయగలమన్న విశ్వాసం ఉంది. తొలి క్వార్టర్లో ఇది 4.9%గా నమోదయినప్పటికీ, బంగారం దిగుమతులు తగ్గడం వల్ల ఇకపై క్యాడ్ పరిమాణం తగ్గుతుందని విశ్వసిస్తున్నాం. మొదటి క్వార్టర్లో బంగారం దిగుమతులు 335 టన్నులయితే, రెండవ క్వార్టర్లో సెప్టెంబర్ 25 వరకూ ఈ పరిమాణం 58 టన్నులే. -
రూపాయి సరైన విలువ 58-60
న్యూఢిల్లీ: డాలరుతో రూపాయి మారకానికి 58-60 అనేది సరైన విలువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ‘కొనుగోలు శక్తి ఆధారంగా రూపాయికి ఒక అంతర్గత విలువ ఉంటుంది. వాస్తవ కరెన్సీ మారకం రేటు(ఆర్ఈఈఆర్) ప్రకారం చూస్తే ఈ అంతర్గత విలువ ప్రస్తుతం 58-60గా ఉండాలి’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సోమవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. రూపాయి విలువ ఇటీవలే కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయి(68.86)... ప్రస్తుతం కాస్త కోలుకున్న(63 స్థాయికి) సంగతి తెలిసిందే. పలు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీలతో మారకం విలువల ఆధారంగా నిర్ధారించే కరెన్సీ రేటును ఆర్ఈఈఆర్గా వ్యవహరిస్తారు. రూపాయి భారీ పతనానికి చికిత్సలో భాగంగా అటు ఆర్బీఐ, ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా దేశంలో బల్క్ డీజిల్‌కు డిమాండ్ తగ్గుముఖం పడుతోందని, దీనివల్ల ప్రభుత్వానికి ప్రస్తుత( 2013-14) ఆర్థిక సంవత్సరంలో బిలియన్ డాలర్ల(సుమారు రూ. 6,300 కోట్లు) వరకూ ఆదా అయ్యేందుకు దోహదం చేస్తుందని మాయారామ్ చెప్పారు. పెట్రో ధరలపై సబ్సిడీల భారం తగ్గించుకోవడానికి భారీగా(బల్క్) డీజిల్ వినియోగదారులకు మార్కెట్ రేటుకే విక్రయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫెడ్ ప్యాకేజీల ఉపసంహరణపై భయాలొద్దు... అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరణ భయాలను ప్రస్తావిస్తూ.. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద తగినన్ని అస్త్రాలు ఉన్నాయని మాయారామ్ పేర్కొన్నారు. రూపాయి విలువ మరింత పడిపోతుందన్న భయాలు అక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం 270 బిలియన్ డాలర్ల విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయని... ఇదే తరుణంలో ఈ ఏడాది మరో 40 బిలియన్ డాలర్ల నిధులు దేశంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మొత్తం 36 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని మాయారామ్ అంచనా వేశారు. -
నియంత్రణలపై భయాలొద్దు
న్యూఢిల్లీ: రూపాయి పతనం కట్టడి కోసం పెట్టుబడులపై పరిమితులు విధించనున్నారన్న ఆందోళనల వల్ల శుక్రవారం స్టాక్‌మార్కెట్లు, దేశీ కరెన్సీ భారీగా పతనం కావడంతో ఆర్థిక శాఖ, ఆర్బీఐ అర్జంటుగా రంగంలోకి దిగాయి. ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశాయి. పెట్టుబడులపై నియంత్రణ విధించే పాత విధానాలకు మళ్లే యోచనేదీ లేదని స్పష్టం చేశాయి. ‘పెట్టుబడులపై పరిమితులు విధిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ద్వారా కావొచ్చు..మరొకటి కావొచ్చు వ్యాపారపరమైన నిధులను విదేశాలకు తీసుకెళ్లడంపై ఎలాంటి పరిమితి విధించే ప్రసక్తే లేదు’ అని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం స్పష్టం చేశారు. డివిడెండ్లు, లాభాలు, రాయల్టీలు మొదలైన వాటితో పాటు సాధారణ వ్యాపార లావాదేవీలకు సంబంధించి నిధుల తరలింపును నియంత్రించే యోచనేదీ లేదని చెప్పారు. దేశీ స్టాక్ మార్కెట్లు సెంటిమెంట్లపైనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని, ప్రస్తుత పరిస్థితులన్నీ ప్రభుత్వానికి తెలుసని మాయారాం చెప్పారు. అవసరమైన సమయాల్లో రూపాయి స్థిరంగా ఉండే పరిస్థితులను కల్పించే ఉద్దేశంతోనే చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రూపాయి భారీ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మాయారాం వివరించారు. అలాగని, నిర్ణీతస్థాయి దగ్గర రూపాయిని నిలువరించాలన్న ఆలోచనేదీ లేదని చెప్పారు. ప్రస్తుతం, భారత్ తరహాలోనే ప్రపంచమార్కెట్లన్నీ కూడా ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. రూపాయి ప్రభావం ఈక్విటీ మార్కెట్లపైనా.. అలాగే ఈక్విటీ మార్కెట్ల ప్రభావం రూపాయిపైనా పడుతోందన్నారు. ఇదొక విష వలయం లాంటిదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్బీఐ తమ అస్త్రాలన్నీ వాడేయకుండా.. వృద్ధిని దెబ్బతీయని విధంగా చిన్నపాటి చర్యలు మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నాయని అధికారి పేర్కొన్నారు. కావాలంటే లిక్విడిటీని పూర్తిగా కట్టడి చేసి రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చని, కానీ దీనివల్ల వృద్ధి దెబ్బతింటుందన్నారు. ఎఫ్ఐఐలపై ఆంక్షలు లేవు.. మరోవైపు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిధులపై భారత్ ఏనాడూ ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వర్గాలు తెలిపాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం ఫెమా కింద ఇది చట్టవిరుద్ధం అవుతుందని పేర్కొన్నాయి. విదేశీ మారకం తరలిపోకుండా చూసేందుకు బుధవారం ప్రకటించిన చర్యలను .. మళ్లీ పాత విధానాలకు మళ్లడంగా భావించనక్కర్లేదని వివరించాయి. నిధులు విదేశాలకు తరలిపోకుండా చూడటమనేది..ప్రభుత్వం పెట్టుబడుల రాకను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే చూడాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పెరుగుతున్న మొండి బకాయిలతో కార్పొరేట్లు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా.. వాటి ఆస్తులు, అప్పులను మదింపు చేసేందుకే తాజా చర్యలను ఉద్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు గత నెల నుంచి ఆర్బీఐ, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ మారకం నిల్వలు కరిగిపోకుండా చూసేందుకు ఆర్బీఐ ఈ నెల 14న కొన్ని కఠిన చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశీ కంపెనీలు విదేశాల్లో చేసే పెట్టుబడులపైనా, భారతీయులు విదేశాల్లోని వారికి చేసే రెమిటెన్సులపైనా పరిమితులు విధించింది. దిగుమతులపై మరిన్ని నియంత్రణలేమీ ఉండవు.. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు నిత్యావసరంకాని ఇతర దిగుమతులపై మరిన్ని సుంకాల పెంపు చర్యలేమీ ఉండబోవని మాయారాం చెప్పారు. పసిడి, వెండి, ప్లాటినం వంటి నిత్యావసరం కాని వస్తువులపై సుంకాలను పెంచడం సరిపోతుందని తెలిపారు. దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఈ మూడింటిపైనా దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ఈ వారంలోనే 10 శాతం మేర పెంచింది.