న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మయారామ్ వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5 శాతం పైనే నమోదవుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అధిక వ్యవసాయ దిగుబడి, పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి పెంపొందడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు.
వివిధ అంశాలపై ఏమన్నారంటే...
వ్యవ‘సాయం’... పరి‘శ్రమ’...
రెండవ క్వార్టర్‌లో వృద్ధి మెరుగుపడుతుంది. సాగు విస్తీర్ణం పెరగడం, ప్రణాళికా వ్యయం వేగవంతం, భారీ ప్రాజెక్టులకు పెట్టుబడుల వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఐ) ఆమోదం వంటి అంశాలు వృద్ధి మెరుగుపడడంలో దోహదపడే అంశాలు. ఇక వృద్ధికి అవసరమైన తదుపరి అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటుంది. గడచిన ఆర్థిక సంవత్సరం వృద్ధి 5 శాతం, 2013-14లో ఏప్రిల్-జూన్ మధ్య 4.4 శాతం నమోదయినప్పటికీ, తదుపరి త్రైమాసికాల్లో ఇది తప్పనిసరిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
వడ్డీరేట్లపై ఇలా...: ఇది పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోని అంశం. అక్టోబర్ 29న జరిగే ఆర్‌బీఐ రెండవ త్రైమాసిక సమీక్ష సందర్భంగా గవర్నర్ రఘురామ్ రాజన్ వడ్డీరేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తారని భావిస్తున్నాం.
క్యాడ్‌కు ‘పసిడి అభయం’: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్-మూలధన పెట్టుబడులు దేశంలోకి వచ్చే-దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 70 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.7%) వద్ద కట్టడి చేయగలమన్న విశ్వాసం ఉంది. తొలి క్వార్టర్‌లో ఇది 4.9%గా నమోదయినప్పటికీ, బంగారం దిగుమతులు తగ్గడం వల్ల ఇకపై క్యాడ్ పరిమాణం తగ్గుతుందని విశ్వసిస్తున్నాం. మొదటి క్వార్టర్‌లో బంగారం దిగుమతులు 335 టన్నులయితే, రెండవ క్వార్టర్‌లో సెప్టెంబర్ 25 వరకూ ఈ పరిమాణం 58 టన్నులే.
ఇక ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులు..
Published Wed, Oct 2 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement