10 శాతం మించిన ...
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టతనిచ్చేలా ప్రభుత్వ కమిటీ కీలక సూచనలను చేసింది. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి ఉన్న విదేశీ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా పరిగణించాలని... అదేవిధంగా ప్రవాసీయుల పెట్టుబడులను(రాబడులను విదేశాలకు తరలించని ప్రాతిపదికన) దేశీ ఇన్వెస్ట్‌మెంట్‌గా వ్యవహరించాలని సిఫార్సు చేసింది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ), ఎఫ్‌డీఐల విషయంలో గందరగోళం లేకుండా వాటి నిర్వచనాలను హేతుబద్దీకరించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ సిఫార్సులు చేసింది. కాగా, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులన్నింటినీ ఎఫ్‌డీఐగానే పరిగణించాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
10 శాతం లోపు చేసే పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా అనుమతించొచ్చని, అయితే తొలి పెట్టుబడి నుంచి ఏడాది వ్యవధిలోగా తమ వాటాను 10 శాతం లేదా అంతకుపైగా పెంచుకోవాలన్న షరతు విధించాలని అభిప్రాయపడింది. కాగా, ఈ ఎఫ్‌డీఐలన్నీ ఆయా రంగాల్లోని పరిమితులకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసింది.