ఇరాక్‌పై ఆందోళన అక్కర్లేదు
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం
న్యూఢిల్లీ: ఇరాక్ సంక్షోభం వల్ల భారత్‌కి చమురు సరఫరా సమస్యలేమీ తలెత్తబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరాకు ఢోకా లేకుండా భారత్ తగు చర్యలు తీసుకుంటోందని శనివారం కమోడిటీ మార్కెట్లపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాయారాం తెలిపారు. మరోవైపు, దేశీయంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలపై మరీ ఆందోళన చెందనక్కర్లేదని మాయారాం చెప్పారు. ఒకవేళ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినా కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయన్నారు.