Oil supply
-
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
-
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: వంట నూనెలకు కొరత నెలకొన్న నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖలు రాశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడినందున ఆవ నూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సన్‌ఫ్లవర్ మాదిరిగా ఉండే ఆవాల నూనె కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5 శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారినందున వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 60 శాతం విదేశాల నుంచే.. 2021–22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరిగిందని, 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 95 శాతం పామాయిల్ ఇండోనేషియా, మలేషియాల నుంచి దిగుమతి అవుతుండగా ఉక్రెయిన్, రష్యా నుంచి 92 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి జరుగుతోందని తెలిపారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడిందన్నారు. ఫలితంగా సన్‌ఫ్లవర్‌తో పాటు ఇతర వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయన్నారు. విస్తృత తనిఖీలు.. టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వినియోగిస్తుండగా పామాయిల్‌ను 28% మంది, వేరుశనగ నూనెను 4.3% మంది వాడుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా, కృత్రిమ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్, పౌరసరఫరా, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కొరత లేకుండా వంటనూనెల సరఫరా, రోజువారీ ధరలు సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకే నూనెలను విక్రయిస్తున్నామన్నారు. చదవండి: మడకశిరకు వైఎస్ జగన్ మరో వరం -
ఆయిల్‌కు అడ్వాన్స్ ఇస్తానని మోసం
కొత్తపేట : ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకుని, ఆస్పత్రి వాహనాలకు ఆయిల్ సరఫరా చేయాలంటూ ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ వద్ద నుంచి రూ.40 వేలు కాజేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఈవని రామచంద్రా పెట్రోలియం ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ (హెచ్‌పీ పెట్రోల్ బంక్) వద్దకు శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. మేనేజర్ వీవీఎస్ఎన్ బంగార్రావును కలిసి తాను స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆస్పత్రి వాహనానికి రెగ్యులర్‌గా డీజిల్, ఇంజన్ ఆయిల్ పోయాలని, సొమ్ము ఒకేసారి ఇస్తామని చెప్పాడు. బంక్‌లో అరువు ఇవ్వమని బంగార్రావు చెప్పడంతో, ఆస్పత్రికి వస్తే అడ్వాన్స్ ఇస్తానని అతడు నమ్మించాడు. బంక్ యజమాని ఈవని సూర్యనారాయణ మూర్తి అనుమతితో బంగార్రావు అతడితో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఎమర్జెన్సీ విభాగం వద్ద కూర్చోమని చెప్పి అతడు లోపలికి వెళ్లాడు. ఓ కాగితం తెచ్చి.. రూ.60 వేలు ఇస్తున్నట్టు రాసివ్వమన్నాడు. అనంతరం 25 నిమిషాల్లో తేరుకుని చూసుకునేసరికి చేతిలో కాగితం ఉంది. ప్యాంట్ జేబులో పెట్టిన కలెక్షన్ సొమ్ము రూ.40 వేలు అదృశ్యమయ్యాయి. దీంతో ఆస్పత్రి డాక్టర్లను, సిబ్బందిని ఆరా తీయగా, తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. కాగితం ఇచ్చిన సమయంలో ముఖంపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బంగార్రావు తెలిపాడు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఎస్సై ఎ.బాలాజీ దర్యాప్తు చేస్తున్నారు. -
చమురు రిఫైనరీపై మిలిటెంట్ల దాడి
* బలగాలపై మెషిన్గన్లతో కాల్పులు * ఉత్తర ఇరాక్‌కు నిలిచిపోనున్న చమురు సరఫరా బాగ్దాద్: ఇరాక్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే ఉత్తర ఇరాక్‌లోని పలు పట్టణాలను ఆక్రమించుకున్న సున్నీ మిలిటెంట్లు బుధవారం దేశంలోకెల్లా అతిపెద్దదైన బైజీ చమురు రిఫైనరీపై దాడికి తెగబడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లోని సలాహిద్దీన్ ప్రావిన్సులో ఉన్న ఈ రిఫైనరీని కాపలాకాస్తున్న బలగాలపై తెల్లవారుజామున మెషిన్గన్లు, మోర్టార్ దాడులతో విరుచుకుపడ్డారు. రిఫైనరీ ఉన్న 75 శాతం ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నారు. ఈ దాడిలో రిఫైనరీ ఆవరణలోని పలు చమురు ఉత్పత్తుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. రిఫైనరీని మంగళవారమే మూసేసి ఉద్యోగులను అక్కడి నుంచి ఖాళీ చేయించడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. రిఫైనరీ మిలిటెంట్లపరం కావడంతో ఉత్తర ఇరాక్‌కు చమురు సరఫరా నిలిచిపోనుంది. అయితే కీలక చమురు క్షేత్రాలు ఎక్కువగా బస్రా సహా ఇతర దక్షిణాది ప్రాంతాల్లో ఉండటంతో ప్రస్తుతానికి అవన్నీ క్షేమంగానే ఉన్నాయి. ప్రతిరోజూ 25 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసే ఇరాక్‌లో నెలకొన్న తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మిలిటెంట్లను నిలువరించడంలో విఫలమైన కీలక భద్రతా కమాండర్లపై ఇరాక్ ప్రధాని నూరీ అల్ మాలికీ వేటు వేశారు. అలాగే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో తనకు మద్దతివ్వాలని రాజకీయ ప్రత్యర్థులను కలిసి కోరారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. తమ దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోసిన దేశాలకు కూడా చివరకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ద్రోన్ దాడులకు ఒబామా యోచన ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై ద్రోన్లతో దాడులకు పాల్పడే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యోచిస్తున్నట్లు ‘వైట్‌హౌస్’ వర్గాలు పేర్కొన్నాయి. మిలిటెంట్లను ఎదుర్కోవడంలో ఇరాక్ సేనలు వెనకబడినందునే ఈ దాడుల యోచన చేస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం 275 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. -
ఇరాక్‌పై ఆందోళన అక్కర్లేదు
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం న్యూఢిల్లీ: ఇరాక్ సంక్షోభం వల్ల భారత్‌కి చమురు సరఫరా సమస్యలేమీ తలెత్తబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరాకు ఢోకా లేకుండా భారత్ తగు చర్యలు తీసుకుంటోందని శనివారం కమోడిటీ మార్కెట్లపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాయారాం తెలిపారు. మరోవైపు, దేశీయంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలపై మరీ ఆందోళన చెందనక్కర్లేదని మాయారాం చెప్పారు. ఒకవేళ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినా కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయన్నారు.