చమురు రిఫైనరీపై మిలిటెంట్ల దాడి
* బలగాలపై మెషిన్‌గన్లతో కాల్పులు
* ఉత్తర ఇరాక్‌కు నిలిచిపోనున్న చమురు సరఫరా
బాగ్దాద్: ఇరాక్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే ఉత్తర ఇరాక్‌లోని పలు పట్టణాలను ఆక్రమించుకున్న సున్నీ మిలిటెంట్లు బుధవారం దేశంలోకెల్లా అతిపెద్దదైన బైజీ చమురు రిఫైనరీపై దాడికి తెగబడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లోని సలాహిద్దీన్ ప్రావిన్సులో ఉన్న ఈ రిఫైనరీని కాపలాకాస్తున్న బలగాలపై తెల్లవారుజామున మెషిన్‌గన్లు, మోర్టార్ దాడులతో విరుచుకుపడ్డారు. రిఫైనరీ ఉన్న 75 శాతం ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నారు. ఈ దాడిలో రిఫైనరీ ఆవరణలోని పలు చమురు ఉత్పత్తుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. రిఫైనరీని మంగళవారమే మూసేసి ఉద్యోగులను అక్కడి నుంచి ఖాళీ చేయించడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. రిఫైనరీ మిలిటెంట్లపరం కావడంతో ఉత్తర ఇరాక్‌కు చమురు సరఫరా నిలిచిపోనుంది. అయితే కీలక చమురు క్షేత్రాలు ఎక్కువగా బస్రా సహా ఇతర దక్షిణాది ప్రాంతాల్లో ఉండటంతో ప్రస్తుతానికి అవన్నీ క్షేమంగానే ఉన్నాయి.
ప్రతిరోజూ 25 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసే ఇరాక్‌లో నెలకొన్న తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మిలిటెంట్లను నిలువరించడంలో విఫలమైన కీలక భద్రతా కమాండర్లపై ఇరాక్ ప్రధాని నూరీ అల్ మాలికీ వేటు వేశారు. అలాగే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో తనకు మద్దతివ్వాలని రాజకీయ ప్రత్యర్థులను కలిసి కోరారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. తమ దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోసిన దేశాలకు కూడా చివరకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
ద్రోన్ దాడులకు ఒబామా యోచన
ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై ద్రోన్‌లతో దాడులకు పాల్పడే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యోచిస్తున్నట్లు ‘వైట్‌హౌస్’ వర్గాలు పేర్కొన్నాయి. మిలిటెంట్లను ఎదుర్కోవడంలో ఇరాక్ సేనలు వెనకబడినందునే ఈ దాడుల యోచన చేస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం 275 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది.