జమ్ము కశ్మీర్‌ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి | Jammu and Kashmir Grenade attack Latest News Updates | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి.. శ్రీనగర్‌ సండేమార్కెట్‌లో గ్రనేడ్లు విసిరిన ముష్కరులు

Published Sun, Nov 3 2024 3:26 PM | Last Updated on Sun, Nov 3 2024 3:50 PM

Jammu and Kashmir Grenade attack Latest News Updates

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్‌ సండే మార్కెట్‌లోని టూరిస్ట్‌ సెంటర్‌ ఆఫీస్‌(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో  పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. 

శ్రీ నగర్‌ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్‌ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్‌ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్‌ కారణంగా టీఆర్‌సీ గ్రౌండ్‌లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్‌ కథనాలు ఇస్తున్నాయి.  

దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు  ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.  లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్‌ కమాండర్‌ ఒకరిని.. ఖన్యార్‌ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ కట్టుదిట్టం చేశాయి.  ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

జమ్ము కశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి: కశ్మీర్‌ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement