జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా, హీరానగర్ పరిధిలోని సైదా సోహల్ గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓంకార్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతను ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు.
కథువాలోని జీఎంసీలో చికిత్స పొందుతున్న ఓంకార్ పోలీసులతో మాట్లాడుతూ తమ ఇంటి బయట అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో తామంతా తలుపులు వేసుకుని, లోపలికి వెళ్లే ప్రయత్నిం చేస్తుండగా కాల్పులు జరిగాయన్నాడు. ఇంతలో ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి తమ ఇంటిలోని ఒక మహిళను నీరు అడిగారని, ఆమె నిరాకరించడంలో కాల్పులు జరిపారని ఓంకార్ తెలిపాడు. వెంటనే తాము ఇంటిలోని మూలల్లో దాక్కున్నామన్నారు. సమపంలోని ఇళ్లలోని వారు కూడా ఇంటి తలుపులు వేసుకున్నారన్నారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుదాడి ప్రారంభించి, ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం అతని సహచర ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు భుజాలపై బ్యాగులు ధరించారు. వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ దరిమిలా సైదా సోహల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనకర వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment