terror
-
ఆగని తోడేళ్ల దాడులు.. మేకను నోట కరచుకుని..
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. నాన్పరా తహసీల్ పరిధిలో ఒక ఇంటి బయట కట్టిన మేకను తోడేళ్లు చంపుకుతిన్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దానిలో తోడేళ్లు మేకను తమ నోట కరచుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాంస భక్షక తోడేళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఇప్పటి వరకు చాలా తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, తోడేళ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా బహ్రాయిచ్‌లోని బీజేపీ శాసనమండలి సభ్యుడు పద్మాసేన్ చౌదరి ఫామ్‌హౌస్‌లో నాలుగు తోడేళ్ల గుంపు కనిపించింది. వీటిలో ఒక కుంటి తోడేలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెతుకుతున్న తోడేలు ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తోడేళ్ల గుంపు స్థానికులను మరింతగా భయపెడుతోంది.ఆరు తోడేళ్ళ గుంపు మనుషులపై దాడి చేస్తున్నదని గుర్తించిన అటవీశాఖ అధికారులు అతికష్టం మీద ఐదు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా ఒక తోడేలు మిగిలివుందని చెబుతున్నారు. కాగా ఆ తోడేళ్ల గుంపు నరమాంస భక్షకులుగా మారడానికి కారణమేమిటన్నది పరిశోధించాల్సిన అంశమని అటవీ అధికారి తెలిపారు. తాజాగా తోడేళ్లు కనిపించిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ.. -
Bahraich: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 11 ఏళ్ల బాలికపై..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో బాధిత బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ దాడి అనంతరం స్థానికుల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. బహ్రయిచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ అటవీశాఖ ఐదు తోడేళ్లను పట్టుకుంది. ‘ఆల్ఫా’ అనే తోడేలు కోసం వెదుకులాట సాగిస్తోంది. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని అన్నారు. అంతకుముందు ఆగస్టు 29న అటవీ శాఖ బృందం నాలుగో తోడేలును పట్టుకుంది. గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
తోడేలులా ప్రవర్తిస్తున్న యువకుడు
ముజఫర్‌నగర్: యూపీలోని బహ్రయిచ్ తోడేళ్ల దాడులతో వణికిపోతోంది. తాజాగా ముజఫర్ నగర్లోనూ ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ దాడులకు పాల్పడుతున్నది ఏ తోడేలో, కుక్కనో కాదు.. ఒక యువకుడు. వినడానికి విస్తుపోయేలా ఉన్నా ఇది నిజం.వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ యువకుడు నరమాంస భక్షకునిగా మారి, పలువురిని కరుస్తునాడు. అతను సృష్టిస్తున్న భీభత్సానికి స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఆ యువకుడు ఓ మహిళతో పాటు ఓ బాలికను గట్టిగా కరిచాడు. అతని దాడి నుంచి బాధిత మహిళను బాలికను ఆ దారినపోతున్నవారు అతికష్టం మీద కాపాడారు.ఆ యువకుడు కుక్కల వెంట పరిగెడుతూ, వాటిని భయపెట్టడంతో పాటు దారినపోయినవారిని కొరుకుతూ గాయపరుస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. -
Jammu: రాజౌరిలో ఉగ్రకుట్ర భగ్నం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసేందుకు తాజాగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ పోస్ట్ రాజౌరిలోని గుండా ఖవాస్ ప్రాంతంలో ఉంది.జమ్ము ప్రాంతంలో గత కొన్ని నెలలుగా తీవ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో చొరబాటు ఘటనలు కూడా పెరిగాయి. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా సంస్థలు ముమ్మరంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తాజాగా అత్యున్నత స్థాయి సంయుక్త భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చేవారిని అంతమొందించేందుకు అన్ని ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్నారు. చొరబాట్లను నిరోధించేందుకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సిన్హా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
‘‘నీళ్లు ఇవ్వలేదని కాల్పులు జరిపారు’’
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా, హీరానగర్ పరిధిలోని సైదా సోహల్ గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓంకార్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతను ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. కథువాలోని జీఎంసీలో చికిత్స పొందుతున్న ఓంకార్ పోలీసులతో మాట్లాడుతూ తమ ఇంటి బయట అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో తామంతా తలుపులు వేసుకుని, లోపలికి వెళ్లే ప్రయత్నిం చేస్తుండగా కాల్పులు జరిగాయన్నాడు. ఇంతలో ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి తమ ఇంటిలోని ఒక మహిళను నీరు అడిగారని, ఆమె నిరాకరించడంలో కాల్పులు జరిపారని ఓంకార్ తెలిపాడు. వెంటనే తాము ఇంటిలోని మూలల్లో దాక్కున్నామన్నారు. సమపంలోని ఇళ్లలోని వారు కూడా ఇంటి తలుపులు వేసుకున్నారన్నారు.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుదాడి ప్రారంభించి, ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం అతని సహచర ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు భుజాలపై బ్యాగులు ధరించారు. వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ దరిమిలా సైదా సోహల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనకర వాతావరణం నెలకొంది. -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి.. ప్రిన్సిపాల్ క్షమాపణ
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్ధినులను బుర్ఖా వేసుకోకూడదని వారించిన ప్రిన్సిపాల్ కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ ప్రినిసిపాల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన వలన ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం క్షమించమని కోరారు. ఉవ్వెత్తున నిరసన జ్వాల.. విశ్వభారతి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు చెప్పిన వివరాల ప్రకారం సదరు ప్రిన్సిపాల్ మేడమ్ కొంతమంది విద్యార్థినులను మాత్రం స్కూల్లో బుర్ఖా ధరించవద్దని చెప్పేవారట. అది మా ఆచారమని దయచేసి అనుమతించమని పదే పదే వేడుకుంటూనే ఉన్నాము. కానీ ఆమె ఇతర విద్యార్థినులకు అనుమతినిచ్చి మాకు మాత్రమే అనుమతినిచ్చేవారు కాదు. అంతగా కావాలంటే మమ్మల్ని పోయి మదర్సాలో చేరమని చెప్పారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మేము నిరసన చేపట్టామని తెలిపారు. బెదిరింపులు.. విద్యార్థినుల నిరసన వీడియోలు బాగా వైరల్ అయిన తర్వాత ఉగ్రవాదుల నుండి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. దీంతో అదేరోజు సాయంత్రం ప్రిన్సిపాల్ విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇది కూడా చదవండి: కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం! -
హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరోకరు అరెస్ట్
-
భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు
భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. (చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం) -
‘ఉగ్ర’ దేశాలపై ఆర్థిక ఆంక్షలు: అమిత్ షా
న్యూఢిల్లీ: ఉగ్రవాద మూకలకు స్వర్గధామాలుగా మారిపోయిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిందేనని కేంద్రం హోంశాఖ మత్రి అమిత్ షా అన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆయన శనివారం ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ సరిహద్దులుండవు. దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయి. వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి’’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ‘‘టెర్రరిజం రాజకీయ అంశం కాదు. పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటర్–టెర్రర్, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బలోపేతం చేసుకోవాలి’’ అని అమిత్ షా తెలిపారు. -
హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం
-
బాబోయ్ ఎలుగుబంటి.. భయపెట్టేసింది
జఫర్‌గఢ్/న్యూశాయంపేట: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో శుక్రవారం ఎలుగుబంటి కనిపించింది. గ్రామంలో అకుల నర్సయ్య ఇంటి వద్ద ఉన్న చిం త చెట్టు పైకి ఎక్కి అరుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమా చారం ఇచ్చారు. రెస్క్యూ టీం సభ్యులు దూరం నుంచి మత్తు ఇంజక్షన్ వదలగా.. ఎలుగు బంటి చెట్టుపైనే స్పృహ తప్పింది. వెంటనే వల సాయంతో కిందకు దించి.. వాహనంలో హన్మకొండలోని జూ పార్కుకు తరలించారు. చదవండి: ధరల మంట.. బతుకు తంటా! -
పాక్ పన్నాగం: బయటపడ్డ రహస్య సొరంగం
సాక్షి, న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్తాన్ కుయుక్తి మరోసారి బయటపడింది. కతువా జిల్లాలోని పన్సార్ వద్ద ఒక సీక్రెట్ సొరంగాన్ని బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. బీఎస్ఎప్ ఔట్‌పోస్ట్ సమీపంలో బోర్డర్ పోస్ట్ వద్ద 30 అడుగుల లోతైన రహస్య టన్నెల్‌ను గుర్తించామని బీఎస్ఎఫ్ అధికారులు శనివారం ప్రకటించారు. పాకిస్తాన్ మిలిటరీ, దాని ఉగ్రవాదుల సొరంగాలను గుర్తించడం చాలా ముఖ్యమనీ అక్రమ చొరబాట్లకు ఉగ్రవాదులు ఈ సొరంగాలను ఉపయోగిస్తారని, తీవ్రవాద నిరోధక అధికారి ఢిల్లీలో చెప్పారు. గత పదిరోజుల్లో రెండు భారీ సొరంగాలను బీఎస్ఎఫ్ గుర్తించిన కావడం గమనార్హం. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు జమ్ము కశ్మీర్లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఉపయోగించిన 150 మీటర్ల పొడవైన భారీ రహస్య సొరంగాన్ని వినియోగించిందని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాదిగా బీఎస్ఎఫ్ పలు సొరంగాలను పసిగట్టి ధ్వంసం చేస్తూ, పాక్ కుయుక్తులను నిర్వీర్యం చేస్తున్నామన్నారు. దీని ద్వారా గత ఎనిమిదేళ్ల నుంచి భారత్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తోందని అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖను దాటడం చాలా కష్టమైనప్పుడు, పాక్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ఎంచుకుంటారని తెలిపారు.2012 నుంచి పాకిస్తాన్ భారత శిబిరాలపై కాల్పులకు తెగ బడుతోందని, ఈ ప్రాంతానికి సమీపంలోనే కొత్త బంకర్‌ను గుర్తించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పూంచ్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారంపై బీఎస్ఎఫ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉగ్రవాద దాక్కున్న స్థావరంతోపాటు కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని గుర్తించింది. ముఖ్యంగా ఏకే-47 రైఫిల్, మూడు చైనా తయారు చేసిన పిస్టల్స్, అండర్ బారెల్ గ్రెనేడ్ లాండర్‌తో ఒక రేడియో సెట్‌ను స్వాధీనం చేసుకుంది. -
‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’
జెనీవా/న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్ మీడియాలో దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 45వ సమావేశాల్లో భారత్ పేర్కొంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత మిషన్ కార్యదర్శి పవన్ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. ఉగ్రవాదం సామాజికార్థిక అభివృద్ధికి పెనుముప్పుగా పరిణమించిందని అన్నారు. ఉగ్రవాదం స్వేచ్ఛాయుత ఆలోచనకు, భావప్రకటనపై దాడిగా పవన్ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తన సొంత ప్రజలతో పాటు అది భారత్ నుంచి ఆక్రమించిన ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విమర్శ్ ఆర్యన్ యూఎన్హెచ్ఆర్సీ వేదికగా బదులిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్ అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని, మానవ హక్కుల తీర్మానాలను తుంగలో తొక్కిందని అన్నారు. చదవండి : భారత ఆర్మీకి భయపడి ఏడ్చిన చైనా జవాన్లు! -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత
-
ఆమె పేరు చెబితే కార్యదర్శులకు హడల్
సాక్షి, నూజివీడు : అధికారులు అవినీతికి దూరంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెప్తున్నా, అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. నూజివీడు నియోజకవర్గంలోని ఓ మండలంలో అధికారి పేరు చెబితే పంచాయతీ కార్యదర్శులు హడలెత్తుతున్నారు. ప్రతి విషయంలోనూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో వారంతా సెలవుపై వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తన ఇంట్లో పూజలు నుంచి మనవరాలి పుట్టినరోజు వరకు, వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఏ పండుగ వచ్చినా ఒత్తిడి చేసీ మరీ సెక్రటరీల నుంచి వేలకువేలు గుంజుతున్నట్లు తెలిసింది. దసరా పర్వదినానికి చీర కొనిపెట్టమని కార్యదర్శులను ఒత్తిడి చేయడంతో రూ.5వేలు సమరి్పంచుకున్నట్లు సమాచారం. వినాయకచవితికి పూజా కార్యక్రమాలకు, దీపావళికి బాణసంచా కూడా కార్యదర్శులే కొని ఇచ్చినట్లు సమాచారం. ఆమె తనకు కావాల్సిన గృహోపకరణాలను సైతం కార్యదర్శులను పీడించి మరీ వారితో కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రూ.30వేలతో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. అందులో రూ.20వేలు ఆమె చెల్లించగా, మిగిలిన రూ.10వేలు ఓ కార్యదర్శి పేరుతో షోరూమ్‌లో అప్పురాయించారు. చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో ఆ కార్యదర్శి రూ.10వేలు షోరూమ్‌లో చెల్లించినట్లు సమాచారం. ఆ అధికారి మనమరాలి జన్మదిన వేడుకలకు కార్యదర్శుల జేబులు ఖాళీ అయ్యాయి. పంచాయతీలలో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించి బిల్లులు పెడితే వాటిపై సంతకాలు చేయడానికి చేయి తడపాల్సిందే. వాళ్లూ, వీళ్లు అనే తేడా లేకుండా నిత్యం డబ్బులు గుంచే ఆలోచనలో ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే మండలంలోని మరో అధికారి కూడా పంచాయతీ కార్యదర్శుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోని టేబుల్‌పైన ఒక పంచాయతీ కార్యదర్శి తన బ్యాగ్‌ను ఉంచి పక్కకు వెళ్తే ఆ బ్యాగులోని రూ.2వేలను ఆ అధికారి తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి తీరుపై ప్రజాప్రతినిధులలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
రాత్రి ఉగ్రవాదం.. పొద్దున క్రికెట్ ఇక కుదరదు!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్ భారత్‌కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని విడనాడేవరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో గురువారం జీ4 (భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విదేశంగ మంత్రుల కౌన్సిల్ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉంది. కానీ బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఒక దేశం పొరుగు దేశానికి వ్యతిరేకంగా పెద్దస్థాయిలో ఉగ్రవాద పరిశ్రమను తెరువడం ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు. పాకిస్థాన్‌తో చర్చలు జరపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, టెర్రరిస్తాన్‌తో మళ్లీ చర్చలు జరపాలనుకోవడమే సమస్య. పొరుగు దేశంతో చర్చించాలని ప్రతి దేశం కోరుకుంటుంది. కానీ ఉగ్రవాదం ఒక విధానంగా ఉన్న దేశంతో చర్చలు ఎలా జరపాలి?’అని పేర్కొన్నారు. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ.. క్రికెట్, ఉగ్రవాదం కలిసి సాగబోదని, ఉదయం క్రికెట్ ఆడి.. రాత్రి ఉగ్రవాద దాడులు చేస్తామంటే ఎంతమాత్రం కుదరబోదని జైశంకర్ తేల్చిచెప్పారు. ‘భారత్ ప్రజాస్వామిక దేశం. ఉగ్రవాదం, క్రికెట్ కలిసి సాగడాన్ని ప్రజలు ఎంతమాత్రం ఆమోదించబోరు. ఉగ్ర దాడుల తెల్లారి టీ బ్రేక్ తీసుకొని.. ఆ మరునాడు క్రికెట్ ఆడలేము’ అని ఆయన అన్నారు. రాత్రి ఉగ్రవాదం, పొద్దున్న క్రికెట్ అన్న విధానం ఇక నడవబోదని స్పష్టం చేశారు. -
9/11
-
ఆయన జీవితమే అందుకు నిదర్శనం
హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు. ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లిపోవడమంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు. అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే... రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం– గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి. లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం – అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే. హనుమ జీవితం ఒకసారి గమనించండి. ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు. అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు. నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు. అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాల నుంచి... -
యూఎన్‌లో పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన భారత్
-
పాకిస్తాన్‌పై అమెరికా అసహనం
వాషింగ్టన్ : ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ పూర్తిగా సహకారం అందించడం లేదంటూ అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచుతున్న హక్కానీ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్ ఎటువంటి సైనిక చర్య చేపట్టడం లేదని ట్రంప్ ఆడ్మినిస్ట్రేషన్ అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తాజాగా తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లు ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అందులో భాగంగానే ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ గృహనిర్భంధం నుంచి విడుదల చేసిందని అమెరికా పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా హక్కానీ నెట్వర్క్ ఉగ్రకార్యక్రమాలు నిర్వహిస్తోందని.. అయినా పాకిస్తాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ట్రంప్ న్యూ సౌత్ ఏషియా స్ట్రాటజీలో పాకిస్తాన్ భాగమైనా అందుకు అనుగుణంగా ఆ దేశం చర్యలు తీసుకునే అవకాశలు లేవని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. -
‘పాకిస్తాన్‌ను నమ్మలేం’
వాషింగ్టన్ : ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్తాన్ నిబద్ధతపై అమెరికా మరోసారి సందేహాలు వెలిబుచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో పాకిస్తాన్ నిబద్ధతపై కాంగ్రెస్ ఉప సంఘాలు రెండూ అనుమానాలు వ్యక్తం చేశాయి. అంతేకాక పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిందనే అనుమానాలను కాంగ్రెస్ సభ్యుడు టెడ్ యాహో సబ్ కమిటీలు ముందు వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ రక్షణ కేంద్రంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అమెరికా సెనెట్‌లోని హౌస్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ, ఆసియా, పసిఫిక్ అండ్ మిడిల ఈస్ట్ కమిటిలతో ట్రంప్ నవంబర్ 8న సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లపైనే చర్చ జరగనుంది. అంతేకాక పాకిస్తాన్‌పై అనుసరించాల్సిన వ్యూహంపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ట్రంప్ న్యూ పాలసీకి పాకిస్తాన్ సహకరించేది అనుమానమేనని ఆసియా, పసిఫిక్ సబ్ కమిటీ ఛైర్మన్ యాహో తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ న్యూ పాలసీ విషయంలో పాకిస్తాన్ వైఖరిపై సందేహాలతో.. ఆ దేశానికి ఇప్పటివరకూ ఇస్తున్న 1.1 బిలియన్ డాలర్ల నిధిని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసింది. -
పాకిస్తాన్‌కు అమెరికా మళ్లీ వార్నింగ్
వాషింగ్టన్ : భారత్‌లో దాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని పాకిస్తాన్‌ను అమెరికా కోరినట్టు వైట్‌హౌస్ సీనియర్ అధికారి తెలిపారు. ఇరు దేశాలు తమ మధ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. ఓ వైపు దాడులు జరుగుతుంటే చర్చలు జరపలేమన్న భారత్ వాదన అర్థవంతమైనదన్నారు. ముంబయి, పఠాన్‌కోట్ సహా భారత్‌లో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారిపై చర్యలు చేపట్టాలని తాము పాక్‌ను కోరామని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ పూర్తిగా అణిచివేయాలని అన్నారు. భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారా ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలన్న ట్రంప్ పాలసీపై మీడియా వివరణ కోరగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
ఉగ్ర, తీవ్రవాదాలే పెను సవాల్
* పరస్పర సహకారంతోనే వీటిని ఎదుర్కోగలం: మోదీ * సింగపూర్ భాగస్వామ్యానికి రక్షణ, భద్రత సహకారమే మూలం * సింగపూర్ ప్రధానితో భేటీ.. ఇరు దేశాల మధ్య మూడు ఒప్పందాలు న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, పెరుగుతున్న తీవ్రవాదం భారత్, సింగపూర్‌లకు పెను సవాళ్లుగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో మోదీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణపై విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ, భద్రతాపరమైన సహకారం మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. ఉగ్రవాదులు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతి, మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని అన్నారు. సైబర్ సెక్యూరిటీతో పాటు ఎటువంటి ఉపద్రవాల నుంచైనా బయటపడేందుకు ఈ రోజు ఇరు దేశాలు పరస్పర సహకారానికి అంగీకరించాయని తెలిపారు. లీ ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఖండించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా మూడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో వాణిజ్యానికి ఊతమిచ్చే మేధో హక్కుల ఒప్పందం కూడా ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు ద్వైపాక్షిక సంబంధాలకు మూలమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ సాధిస్తోందని, ఈ ప్రయాణంలో సింగపూర్‌ను కీలక భాగస్వామిగా భావిస్తోందని చెప్పారు. కాగా, సింగపూర్‌లో కార్పొరేట్ రూపీ బాండ్లను విడుదల చేయడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి అవసరాలకు కావాల్సిన నిధులను సమీకరించుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. సింగపూర్-భారత్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకుగానూ ఇరు దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖల భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు లీ చెప్పారు. రెండు ఎంవోయూల గురించి ప్రధాని మోదీ వివరిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాజస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఉదయ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టూరిజమ్ ట్రైనింగ్ ఏర్పాటును స్వాగతించారు. లక్నోలో దసరా న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దసరా వేడుకలను లక్నోలో జరుపుకోనున్నారు. అయిష్భాగ్ రామ్‌లీలాలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలన్న ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని లక్నో మేయర్, ఉత్సవాల నిర్వాహకుడు దినేశ్‌శర్మ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఈ వేడుకల్లో మోదీ హారతి కార్యక్రమంలో పాల్గొంటారని, రావణ దహనాన్ని బాణం వేసి లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. సాధారణంగా దసరా వేడుకలను ప్రధాని ఢిల్లీలోనే జరుపుకుంటారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ లక్నోలో జరిగే వేడుకల్లో పాలుపంచుకునేందుకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు. -
కశ్మీర్లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్
-
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్‌ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. -
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దులనుంచి ఎవ్వరూ భారత్ లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించే మార్గాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు దేశాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్తోం, మేఘాలయ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఆయామార్గాలనుంచి ఎవ్వరూ దేశంలోకి చొరబడకుండా చూడాలని అధికారులకు, భద్రతా బలగాలకు సూచించింది. ఢాకా దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ బంగ్లాదేశ్ దౌత్య అధికారులతోనూ, సెక్యూరిటీ ఏజెన్సీలతోనూ చర్చిస్తున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అక్కడి భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు సైనికులు 11 గంటలపాటు శ్రమించారు. భద్రతా దళాలు, ఉగ్రమూకలకు మధ్య జరిగిన పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. ఘటనలో మొత్తం 20 దాకా చనిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సెన్సేషన్లు సృష్టించడం టెర్రరిజం అంతానికి సహకరించదని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియా ఇతోధికంగా సహకరించాలని ప్రభుత్వం మీడియాకు సూచించింది. బంగ్లాదేశ్ ను స్నేహపూర్వక దేశంగా ఇప్పటికే గుర్తించామని, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది సైతం టెర్రరిజాన్ని అణచివేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలిపింది. -
చిత్తూరు కోర్టులో పేలుడు వెనుక ఉగ్రవాస్తం!
-ఉగ్రవాద నీడలపై పోలీసుల చూపు - వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌తో సంబంధం - ఏడాది క్రితం ఎన్కౌంటర్.. అదే తేదీన కోర్టులో పేలుడు - తమిళనాడు జైళ్లకు పలు లేఖలు - ప్రధాన నిందితుడు ‘సిద్దికి’పై అనుమానాలు - రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు చిత్తూరు (అర్బన్): చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో లాగే కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పేలుడుకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమికంగా నిర్దారించుకున్న పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. 2015 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ చిత్తూరు కోర్టులో పేలుడు సృష్టించినట్లు నిర్దారణకు వచ్చారు. ఏడాది తరువాత 2016 ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టులో బాంబు పేలడమే ఇందుకు నిదర్శనం. ఇది తమ పనేననంటూ ‘బేస్ మూవ్మెంట్’ పేరిట చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనరుకు లేఖ రావడం, దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పుత్తూరులో ఆల్-ఉమా తీవ్రవాదులను పట్టుకున్నారు. ఈ పేలుడు వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సిద్దికి అనే వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఎవరీ సిద్దికి.. ముస్లింల అణిచివేతను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన సిద్దికి అనే వ్యక్తి ఆల్-ఉమా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. అప్పట్లో తమిళనాడు పోలీసులు ఇతన్ని అరెస్టు చేసినా తప్పించుకున్నాడు. దాని తరువాత 1998లో ఎల్కే అద్వానీ లక్ష్యంగా కోయంబత్తూరులో పేలుడు జరగడం, 58 మంది మృతి చెందడంతో సిద్దికి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అనంతరం ఇతను కనుమగైపోయాడు. ఎక్కడున్నాడు ? ఏమయ్యాడనే వివరాలు లేవు. కానీ పోలీసు రికార్డుల్లో మాత్రం సిద్దికి పరారీలో ఉన్నట్లు నమోదయ్యింది. 2013 అక్టోబర్‌లో పుత్తూరులో జరిగిన ఆపరేషన్‌లో ఆల్-ఉమాకు సంబంధించిన బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్, ఫక్రుద్దీన్లను అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన బీజేపీ, శివసేన కార్యకర్తల హత్య కేసుల్లో సైతం వీళ్లు నిందితులు. చెన్నై నుంచి వీళ్లను చిత్తూరు జిల్లాలోని కోర్టుల్లో వాయిదాలకు హాజరు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో జరిగిన పేలుళ్లు ఆల్-ఉమా, బేస్ మూవ్మెంట్ సంస్థల పనేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సిద్దికి హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జైళ్లకు లేఖలు.. కోయంబత్తూరు పేలుళ్లు, బీజేపీ నేతల హత్యల్లో నిందితులుగా ఉన్న వీరు ప్రస్తుతం తమిళనాడులోకి పలు జైళ్లల్లో ఉన్నారు. వీళ్లకు మద్దతుగా గత ఆర్నెళ్లుగా ఆయా జైళ్లశాఖలకు ఇంగ్లీషులో టైప్ చేసిన లేఖలు పోస్టుల ద్వారా వస్తున్నాయి. ముస్లింలపై నిర్బంధం, అణిచివేతకు ప్రతీకారం తప్పదని ఆ లేఖల సారాంశం. చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది కూడా తామేనంటూ, మరికొన్ని దాడులు చేస్తామంటూ వాణిజ్య పన్నులశాఖకు లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు జైళ్లకు వచ్చిన లేఖలను పరిశీలించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఏటీఎఫ్ తదితర సంస్థలు రాష్ట్ర హోంశాఖ నుంచి చిత్తూరు ఘటన వివరాలు సేకరిస్తున్నాయని తెలిసింది. -
అధీన రేఖవద్ద హైఅలర్ట్, తీవ్రవాదులకోసం జల్లెడ!
జమ్మూః శ్రీనగర్ సిటీలో సోమవారం ఉదయం జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ తీవ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ ప్రకటించడంతో వారికోసం సైన్యం జల్లెడ పడుతోంది. జడిబల్ పోలీసు స్టేషన్ పై ఉదయం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో సైన్యం అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. మెహబూబా ముఫ్తి సారధ్యంలోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేర్పాటువాద గెరిల్లా దాడి జరిగింది. పాకిస్తాన్ మద్దతుతో అక్కడే శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. భారీగా సాయుధ తీవ్రవాదులు జడిబల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏఎస్ఐ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు దాడిలో అక్కడికక్కడే మరణించగా.. మరో పోలీసు తీవ్రంగా గాయపడి, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇటువంటి ఉగ్రదాడులపై ఆర్మీ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు దృష్టి సారించాయని టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని జీవోసీ అధికారి సతీష్ దువా తెలిపారు. ఇటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు. -
పాకిస్తాన్ కు సహకరిస్తానన్న అమెరికా..!
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు జరిగే పోరాటంలో పాకిస్తాన్ కు సహకరిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. లాహోర్ నగరంలోని గుల్షన్-ఇ-ఇగ్బాల్ పార్క్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. వాషింగ్టన్ లో ఓ విలేకరుల సమావేశంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ రేడియో వెల్లడించింది. లాహోర్ ఉగ్రదాడి నేపథ్యంలో సోమవారం అమెరికా వెళ్లాల్సిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వాషింగ్టన్ అణు సదస్సులో పాకిస్తాన్ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లాల్సివుంది. ఇంతలో ఆత్మాహుతి దాడి జరగడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటన రద్దుకు గల కారణాన్ని తాము అర్థం చేసుకోగలమని కిర్బీ తెలిపారు. పాకిస్తాన్ ప్రజలకు అండగా అమెరికా నిలుస్తుందని సమావేశంలో వెల్లడించారు. సుమారు 72 మందిని పొట్టన పెట్టుకుని, 250 మంది గాయపడటానికి కారణమైన పాకిస్తానీ తాలిబన్ గ్రూప్, జమాత్ ఉల్ అరార్ ఈ దాడికి బాధ్యత వహించాలని కిర్బీ అన్నారు. ఆదివారం సాయంత్రం క్రైస్తవులు ఈస్టర్ జరుపుకొనే సమయంలో ఈ దాడులు ఉద్దేశ్య పూర్వకంగా జరిపినట్లు ఉన్నాయని ఏషియన్ న్యూస్ సర్వీస్ తెలిపింది. -
మాపై గుడ్డిగా దాడి చేశారు!
బ్రస్సెల్స్: తాము భయపడినట్టే జరిగిందని, తమపై గుడ్డిగా దాడి చేశారని బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మైఖేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఇది చీకటి గడియ అని, ఈ సమయంలో సంయమనంతో, ఐక్యతతో ఉండాల్సిన అవసరముందని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. పిరికిపందల్లా తమపై దాడికి దిగారని ఉగ్రవాదులను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రస్తుతం ఆర్మీ పూర్తిస్తాయిలో రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నదని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో మంగళవారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 21మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 55 మంది గాయపడ్డారు. బ్రసెల్స్ లోని విమానాశ్రయంతోపాటు ఓ మెట్రో స్టేషన్ వద్ద కూడా పేలుళ్లు జరిగాయి. పారిస్ నరమేధం నిందితుడిని బెల్జియంలో ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో జరిగిన ఈ ఉగ్రవాద దాడితో బ్రసెల్స్ చిగురుటాకులా వణికిపోయింది. బెల్జియం దిగ్భ్రాంతపోయింది. ఈ నేపథ్యంలో పేలుళ్లలో చనిపోయినవారి కుటుంబాలకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ సంతాపం తెలిపారు. ఈ పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు, పెద్దసంఖ్యలో ప్రజలు క్షతగాత్రులైనట్టు తెలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. -
పవర్ఫుల్... ‘టైర్రర్’
చిత్రం: టై, తారాగణం: శ్రీకాంత్, నికిత, కోట, నాజర్, శ్రీ, మాటలు: లక్ష్మీ భూపాల్, సంగీతం: సాయికార్తీక్, కెమేరా: శ్యామ్‌ప్రసాద్, ఎడిటర్: బసవ పైడిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, నిర్మాత: షేక్ మస్తాన్ , కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సతీశ్ కాసెట్టి, రిలీజ్: ఫిబ్రవరి 26 దేశం బాగుండాలంటే ముందు వ్యవస్థ బాగుండాలి. ఒక్కరి పనితీరు సరిగ్గా లేకపోయినా అందరికీ నష్టమే అని చూపించడానికి చేసిన ప్రయత్నమే ‘టై’. పోలీసు శాఖ ఎలాంటి ఒత్తిళ్లకూ గురి కాకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే సమాజంలో విద్రోహశక్తులను అంతం చేయొచ్చనే అంశానికి సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి, దర్శకుడు సతీశ్ కాసెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ చేసిన చిత్రాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ‘టై’ ఆ జాబితాలో చేరుతుందా? సతీశ్ కాసెట్టి చెప్పిన కథ నచ్చి, చేశానంటున్న శ్రీకాంత్ నమ్మకం నిజమవుతుందా? తెలియాలంటే ఈ సినిమా కథలోకి వెళ్లాల్సిందే. పోలీస్ శాఖలో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు పొందిన సీఐ విజయ్ (శ్రీకాంత్). పై అధికారులకు నమ్మిన బంటు. ప్రజలకు హీరోలాంటివాడు. విజయ్ తండ్రి సుధాకర్ (నాజర్)కి స్నేహితుడైన డేవిడ్ (విజయ్‌చందర్) కొడుకు హత్యకు గురవుతాడు. అతని హత్యకి విజయ్, డీజీపీ రాథోడ్ల నిర్లక్ష్యమే కారణమని డిపార్ట్మెంట్ విచారణ మొదలుపెడుతుంది. స్నేహితుడి కొడుకు మరణానికి తన కొడుకే కారణమని సుధాకర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు కొడుకును ఇంట్లోంచి గెంటేస్తాడు. వేరే దారి లేక, కష్టపడి ఎమ్మెల్యే రవి (‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ)కి రూ. 40 లక్షలు ఇచ్చి క్లీన్ చిట్ తెచ్చుకుంటాడు విజయ్. కానీ, తండ్రి మాత్రం ఇంట్లోకి రానివ్వడు. కట్ చేస్తే... నగరంలో ప్రవేశించిన టైస్టులు బాంబ్ బ్లాస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారని విజయ్‌కి తెలుస్తుంది. ఈ విషయం ముందే తెలిసినప్పటికీ హోం మినిస్టర్ సుదర్శన్‌రావు (కోట శ్రీనివాసరావు), డీజీపీ తమ స్వలాభం కోసం సెలైంట్ అయిపోతారు. ఈ కుట్రను ఆపుదామనుకున్న విజయ్‌ని కిడ్నాప్ చేస్తారు. పై అధికారులకు తలొగ్గి, తెలియక ఒకసారి చేసిన పొరపాటు మళ్లీ జరగకూడదని దేశాన్నీ, ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో విజయ్ పోరాటం మొదలుపెడతాడు. కార్యనిర్వహణలో భాగంగా అతనెలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటాడు? పై అధికారులకు ఎలాంటి సవాల్ విసురుతాడు? అనేది తెరపై చూస్తేనే రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమా మొత్తం శ్రీకాంత్ భుజాలపైనే నడుస్తుంది. విజయ్ పాత్రలో నటన పరంగా ఆయన విజృంభించారనే చెప్పాలి. ‘థర్టీ’ ఇయర్స్ పృథ్వీ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కాస్త నవ్వించి, సెపరేట్ కామెడీ ట్రాక్ లేని లోటుని భర్తీ చేశారు. సీనియర్ నటుడు కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ గుర్తుండిపోయే పాత్ర చేశాడు. సీఎం పాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం విశేషం. ప్రస్తుతం ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్లు ఉంటేనే ‘సేఫ్’ అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, దమ్మున్న కథ అయితే రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేయొచ్చనే నమ్మకంతో దర్శక-నిర్మాతలు ఈ సినిమా తీశారు. పోలీసు-టైస్ట్‌ల కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ, ట్రీట్మెంట్ కొత్తగా ఉండాలి. ఈ సినిమా విషయంలో ఆ జాగ్రత్త తీసు కున్నారు. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్. పోలీసులు పడే మానసిక వేదన, ఎదుర్కొనే ఒత్తిళ్లు వాస్తవికతకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్, ద్వంద్వార్థాలు లేకపోయినా మంచి కథతో సినిమా తీస్తే, ప్రేక్షకుల మనసులను గెల్చుకోవచ్చనడానికి ‘టై’ లాంటి చిత్రాలు ఓ నిదర్శనం. ఇది దర్శక-నిర్మాతలు నిజాయతీగా ప్రయత్నమనే చెప్పాలి. -
క్లీన్‌గా... నీట్‌గా...!
‘‘శ్రీకాంత్‌గారు, నేను ఎప్పుడు కలిసినా సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఇటీవల ఆయన ఎక్కువగా నాతో మాట్లాడింది ‘టెర్రర్’ చిత్రం గురించే. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టెర్రర్’ ప్రచారచిత్రాన్ని ఆయన హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పట్లో సినిమా తీయడం పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని విడుదల చేయడం చాలా కష్టమైన విషయం. మస్తాన్గారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ నెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. దర్శ కుడు క్లీన్‌గా, నీట్‌గా తీశారు. సాయికార్తీక్ మంచి పాటలు, రీ-రికార్డింగ్ ఇచ్చాడు’’ అని శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి. -
మార్చి 4న ఐదు సినిమాలు
గతంలో ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు రూట్ మార్చారు. ఒకేరోజు నాలుగైదు సినిమాలతో బరిలో దిగుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన పరవాలేదని భావిస్తున్నారు. అయితే ఈ పోటి కారణంగా మంచి సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడుతున్నాయి. మార్చి 4న మరో సారి ఇలాంటి భారీ పోటికి రంగం సిద్ధమవుతోంది. సమ్మర్ సీజన్లో స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీ అవుతుండటంతో చిన్న సినిమా నిర్మాతలు ముందుగానే తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి స్టార్ హీరోల దాడి మొదలవుతుండటంతో ఈ లోపు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అందుకే మార్చి 4న తెలుగు వెండితెర మీద చిన్న సినిమా పండుగ జరగనుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ క్షణం, మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శౌర్య. అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన కళ్యాణవైభోగమే, శ్రీకాంత్ హీరోగా యాక్షన్ జానర్లో తెరకెక్కిన టెర్రర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమా శివగంగ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఇన్ని సినిమాలు ఒకే సారి బరిలో దిగుతాయా లేక ఎవరైన వెనక్కు తగ్గుతారా చూడాలి. -
ఐరోపా బడ్జెట్‌కు టెర్రర్ ముప్పు
పారిస్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఐరోపా దేశాలు తమ ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకునేందుకు 2010 సంవత్సరం నుంచి పొదుపు చర్యలు పాటిస్తున్న విశయం తెల్సిందే. ముఖ్యంగా రక్షణ శాఖకు కేటాయిస్తున్న బడ్జెట్‌ను భారీగా తగ్తిస్తూ వచ్చాయి. రక్షణ శాఖ కేటాయింపులు మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో రెండు శాతానికి మించి ఉండకూడదంటూ ఐరోపా కూటమి సూచించిన మార్గదర్శకాలను సభ్య దేశాలు తూచాతప్పక పాటిస్తున్నాయి కూడా. ఇందులో భాగంగా ఫ్రాన్స్ సహా అన్ని ఐరోపా దేశాలు యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లను భారీగా కుదించుకోవడమే కాకుండా సిబ్బంది నియామకాల్లో కూడా భారీగా కోత విధించాయి. గత నవంబర్ నెలలో పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడి 130 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడంతో హఠాత్తుగా సీన్ మారిపోయింది. ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులను సమూలంగా నిర్మించేందుకు ఫ్రాన్స్ నాయకత్వాన ఐరోపా దేశాలు దాడులు తీవ్రతరం చేయాలని ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో మళ్లీ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లు హఠాత్తుగా పెరిగిపోయాయి. సైన్యానికి చెందిన అన్ని విభాగాల్లో సిబ్బందిని రెట్టింపు చేస్తున్నాయి. దీంతో పొదుపు చర్యల మాట అప్రస్తుతంగా మారిపోయాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకుల సందడి తప్పించి భద్రతా సిబ్బంది హడావిడిగా పెద్దగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు పదివేల మంది సైనిక సిబ్బంది రక్షణ కవచాలు ధరించి, అత్యాధునిక మిషన్ గన్లు చేబూని ఈఫిల్ టవర్‌తోపాటు నగరంలోని అన్ని చారిత్రిక కట్టడాలు, ప్రభుత్వ భవనాలు, పర్యాటక స్థలాలు, మాల్స్ వద్ద గస్తీ తిరుగుతున్నాయి. ఫ్రాన్స్ దాదాపు తన పొదుపు చర్యలను మరచిపోయింది. టెర్రరిజం నుంచి తమకు శాశ్వత ముప్పు పొంచి ఉందని, టెర్రరిస్ట్ లను వేటాడడం, వారి నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడం, వారి ప్రచారాన్ని తిప్పికొట్టడం తమ ప్రథమ ప్రాధ్యానత అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే ఇటీవలనే ప్రకటించారు. సైనిక సంపత్తికి అదనపు బడ్జెట్ కేటాయింపులు జరపుకునేందుకు తమకు ఐరోపా కూటమి నుంచి మినహాయింపు కూడా ఉన్నట్టు ఆయన చెప్పుకున్నారు. ఈ విషయాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడ్ జంకర్ కూడా ధ్రువీకరించారు. ఫ్రాన్స్ బాటలోనే బ్రిటన్, జర్మనీ దేశాలతోపాటు ఇరుగుపొరుగు దేశాలు కూడా ప్రయాణిస్తున్నాయి. దేశ భద్రత కోసం ఫ్రాన్స్ రోజుకు పది లక్షల యూరోలు ఖర్చు చేస్తుండగా, బ్రిటన్ ఇటీవలనే రక్షణ ఖర్చుల కోసం లక్షా ఎనభైవేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్ చేపట్టిన పొదుపు చర్యల కారణంగా ఐరోపా దేశాల ఆర్థిక బడ్జెట్లో రక్షణ కేటాయింపులు దాదాపు 13 శాతం తగ్గాయి. ఇప్పుడు ఐసిస్ టెర్రరిస్ట్ ల ముప్పు కారణంగా కేటాయింపులు 20 శాతానికి పైగా పెరిగాయి. హఠాత్తుగా తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరగడంతో యుద్ధ విమానాలు, ఆయుధాల తయారీదారులు తెగ సంబరపడి పోతున్నారు. ఇప్పటికే రెండు ఆర్థిక సంక్షోభాలకు గురైన గ్రీస్ దేశం పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వలసదారుల సంక్షోభం నుంచి ఎలా భయటపడాలో తెలియక తలపట్టుకు కూర్చున్న గ్రీస్ ఇప్పుడు దేశ భద్రతాచర్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే మరో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్
-
వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పలు మెట్రో నగరాల్లో దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో దాడులు జరిపి 14 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఐదుగురు ఐఎస్ ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేశారనే సమాచారం అందిన నేపథ్యంలో దేశ రాజధానిలో తనిఖీలు ముమ్మరం చేశారు. -
ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం
-
పఠాన్‌కోట్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం..
-
ఢిల్లీలో జైషే ఉగ్రవాదులు!
-
భారత్-పాక్‌ల మధ్య మైత్రి తమ ఉనికికే ప్రమాదం
-
పఠాన్‌కోట్‌లో ఆపరేషన్ కొనసాగుతూనే..!
పఠాన్‌కోట్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం గ్రనేడ్ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. -
మరికొద్ది రోజుల్లో విధ్వంసం.. ఆలోపే అరెస్టు
సిడ్నీ: ప్రభుత్వ భవనాన్ని టార్గెట్ చేసుకుని భారీ దాడికి ప్రణాళికలు రచించిన కేసులో ఓ పదిహేనేళ్ల కుర్రాడిని, 20 ఏళ్ల యువకుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడిని హత్య చేయాలనుకున్న ఘటనకు సంబంధించి పదిహేనుమందిని అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు విచారణ చేసినప్పుడు తాజా కుట్రకు సంబంధించిన వివరాలు తెలిశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం తాజాగా రైడింగ్ లు నిర్వహించి ఆ 15 ఏళ్ల బాలుడిని, 20 ఏళ్ల వ్యక్తిని ఇంట్లో ఉండగానే అరెస్టు చేశారు. అనంతరం వాళ్ల నివాసాలను జప్తు చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ మైఖెల్ పెలాన్ మాట్లాడుతూ తాజా అరెస్టులు ప్రభుత్వ కార్యాలయంపైనే దాడి చేసేందుకు రచించిన భారీ కుట్రకు సంబంధించినవని అన్నారు. అంతకుముందే ముగ్గురుని అరెస్టు చేశామని వారికి కొత్తగా అరెస్టు చేసినవారికి సంబంధాలు ఉండిఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. డిసెంబర్లోనే ఈ కుట్ర అమలు చేయాలని వారు ప్లాన్ చేశారని, ఈలోగా తమ నిఘా వర్గాలు చాలా వేగంగా స్పందించి భగ్నం చేసి వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై తాము చాలా సీరియస్ గా ఉన్నామని, ఉగ్రవాద కుట్రలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. -
కాలిఫోర్నియాలో దాడి మా మద్దతుదారుల పనే
-
'కాలిఫోర్నియాలో దాడి మావాళ్ల పనే'
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ కాల్పులతో మారణహోమం సృష్టించిన ఇద్దరు దంపతులు తమ మద్దతుదారులేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో మరణించిన ఆ ఇద్దరిని అమరవీరులుగా గుర్తించాల్సిందిగా కోరుతూ తాము భగవంతునికి ప్రార్థనలు జరుపుతామని ఐఎస్ఐఎస్ గ్రూపు రేడియో అల్-బయన్ రేడియో తెలిపింది. బుధవారం తెల్లవారుజామున సయెద్ రిజ్వాన్ ఫరుక్, తష్ఫీన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినోలో ఓ హాలీడే పార్టీపై కాల్పులు జరిపి 14మందిని హతమార్చారు. ఈ ఘటనలో 21మంది గాయపడ్డారు. ఈ ఘటనకు తమదే బాధ్యతని, సిరియాలోని తమ ప్రాబల్య ప్రాంతాలపై దాడులు చేస్తుండటంతో ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్టు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద హస్తముందని అమెరికా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. -
ఐఎస్ఐఎస్పై ప్రపంచయుద్ధం!
న్యూయార్క్: పారిస్‌లో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపునకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఐఎస్ఐఎస్ను ఓడించేందుకు ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఒక ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అరుదైన రీతిలో అత్యంత శక్తిమంతమైన తీర్మానాన్ని తీసుకొచ్చిన ఐరాస.. ఐఎస్ఐఎస్ మరిన్ని ఉగ్రవాద ఘాతుకాలకు పాల్పడకుండా.. తన సభ్యదేశాలన్నీ రెట్టింపు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్వర్గధామాలను నేలమట్టం చేసి.. దాని తీవ్రంగా దెబ్బతీయాలని సూచించింది. ఐరాసలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ డెలాటర్ ప్రతిపాదించిన ఈ తీర్మానం.. ఐరాస భద్రతామండలిలో 24 గంటల్లోనే ఏకగ్రీవ ఆమోదం పొందడం గమనార్హం. పారిస్ నరమేధం నేపథ్యంలో ప్రపంచదేశాల నాడినీ, ఉగ్రవాద ముప్పును గమనించిన ఫ్రాన్స్ వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగింది. గతంలో ఐఎస్ఐఎస్ను, సిరియా సంక్షోభాన్ని కలిపి చూసి.. చర్యలకు ఉపక్రమించాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చినా.. రష్యా, చైనా ఇందుకు నిరాకరించాయి. సంప్రదాయబద్ధంగా వీటో అధికారం కలిగిన అగ్రరాజ్యాలు కావడంతో రష్యా, చైనాను కాదని సిరియా సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి ఐరాస వెనుకాడింది. తాజాగా పారిస్ నరమేధం, రష్యా విమానం కూల్చివేత నేపథ్యంలో ఐఎస్ఐఎస్పై పశ్చిమ దేశాల దాడులు తీవ్రతరం తరుణంలో ఐరాస ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. -
ఐఎస్ఐఎస్పై ప్రపంచయుద్ధం!
న్యూయార్క్: పారిస్‌లో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపునకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఐఎస్ఐఎస్ను ఓడించేందుకు ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఒక ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అరుదైన రీతిలో అత్యంత శక్తిమంతమైన తీర్మానాన్ని తీసుకొచ్చిన ఐరాస.. ఐఎస్ఐఎస్ మరిన్ని ఉగ్రవాద ఘాతుకాలకు పాల్పడకుండా.. తన సభ్యదేశాలన్నీ రెట్టింపు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్వర్గధామాలను నేలమట్టం చేసి.. దాని తీవ్రంగా దెబ్బతీయాలని సూచించింది. ఐరాసలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ డెలాటర్ ప్రతిపాదించిన ఈ తీర్మానం.. ఐరాస భద్రతామండలిలో 24 గంటల్లోనే ఏకగ్రీవ ఆమోదం పొందడం గమనార్హం. పారిస్ నరమేధం నేపథ్యంలో ప్రపంచదేశాల నాడినీ, ఉగ్రవాద ముప్పును గమనించిన ఫ్రాన్స్ వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగింది. గతంలో ఐఎస్ఐఎస్ను, సిరియా సంక్షోభాన్ని కలిపి చూసి.. చర్యలకు ఉపక్రమించాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చినా.. రష్యా, చైనా ఇందుకు నిరాకరించాయి. సంప్రదాయబద్ధంగా వీటో అధికారం కలిగిన అగ్రరాజ్యాలు కావడంతో రష్యా, చైనాను కాదని సిరియా సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి ఐరాస వెనుకాడింది. తాజాగా పారిస్ నరమేధం, రష్యా విమానం కూల్చివేత నేపథ్యంలో ఐఎస్ఐఎస్పై పశ్చిమ దేశాల దాడులు తీవ్రతరం తరుణంలో ఐరాస ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. -
భారత్‌లో ఉగ్రచర్యలకు భారీ విరాళాలు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్ఎం) భారీ ఎత్తున విరాళాలు సేకరింస్తోంది. గత ఎనిమిదేళ్లలో పాక్‌లోని వివిధ వర్గాల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపు రూన. 80 కోట్లకుపైగా వసూలు చేసిందని భారత దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. 'భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ఎం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గత ఎనిమిదేళ్లలో ఆ సంస్థ రూ. 80 కోట్లు వసూలు చేసింది' అని వారు అంతర్జాతీయ సంస్థ అయినా పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు. 'భారత్‌కు ఈ నిధులు చేరగానే వీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిబ్బుల్ ఉగ్రవాదుల కుటుంబసభ్యులకు అందజేస్తారు' అని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. విదేశాల్లో కూడా నిధులు సేకరించి.. తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని వెల్లడించింది. పారిస్ దాడుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ సభ్య దేశాలు ఉగ్రవాద గ్రూపులకు నిధులు ఎలా అందుతున్నాయి. వాటిని ఆపేది ఎలా అనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో పారిస్ తరహాలో గతంలో జరిగిన ముంబై దాడులను ప్రస్తావించిన భారత్.. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరును సభ్య దేశాల దృష్టికి తీసుకొచ్చింది. పాకిస్థాన్ తన భూభాగంలో ఉగ్రవాదుల యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నదని, తన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కన్నుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయని భారత్ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు వద్ద హిబ్బుల్ జరిపిన పేలుళ్లలో 17 మంది మరణించగా, 76 మంది గాయపడ్డారు. -
పారిస్‌లో భీకర కాల్పులు
-
8 మంది ఉగ్రవాదుల హతం
-
8 మంది ఉగ్రవాదుల హతం
పారిస్: ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 8 మందిని మట్టుపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడి తర్వాత హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిలో ముగ్గురు బాంబులతో కూడిన బెల్టులను ధరించి ఉన్నట్టు సమాచారం. వీరిని బటాక్లాన్ వేదిక వద్దే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు దేశ సరిహద్దులను మూసివేశాయి. మరిన్ని దాడులు జరగకుండా గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎలాంటి దయలేకుండా అణచివేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. జీ20 సదస్సుకు హాజరు కావల్సి ఉండగా పర్యటనను రద్దు చేసుకున్నారు. దాడుల అనంతరం ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ దాడితో జీ20 సదస్సు రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ఉగ్రవాదంపై భారత్ ఓపికతో ఉండదు
న్యూఢిల్లీ: ఉగ్రవాదం విషయంలోనూ, దాన్ని ప్రేరేపించే సంస్థల విషయంలోనూ భారత ప్రభుత్వం ఏమాత్రం సహనంగా వ్యవహరించదని, తక్షణ చర్యలు తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర కేబినెట్‌తో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం దాట వేశారు. మయన్మార్ సరిహద్దులో ఉగ్రవాద చర్యలను సమర్థంగా ఎదుర్కొన్న సందర్భంగా ప్రధానికి ఈ సమావేశంలో అభినందనలు తెలిపారా అని ప్రశ్నించగా అదేం లేదని చెప్పారు. అసలు ఆ విషయాన్ని సమావేశంలో చర్చించనే లేదన్నారు. ప్రత్యేకంగా ప్రధాని అభినందనలు చెప్పేదేముందని, ముందునుంచే తాము చెప్తున్నామని, ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారత్ ఇక సహనంతో ఆలోచించదని, తక్షణమే స్పందిస్తుందని ఆరోజు చెప్పామని, ఇప్పుడు అలాగే చేశామని తెలిపారు. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ప్రత్యేక దళాలు తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాతే భారత్ ఆర్మీ సైనిక దళాలు ప్రతికార దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయితే, గడ్కరీ మాత్రం ఆర్మీకి చెందిన అధికారిక ప్రతినిధి తీసుకోవాల్సిన చర్యపై పూర్తి నివేదిక ఇచ్చారని, దాని ప్రకారమే సైన్యం ఆపరేషన్ పూర్తి చేసిందని తెలిపారు. -
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పనామా: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ప్రాంతీయ అంశాల నేపథ్యంలో తనకు క్యూబా నాయకుడు రవుల్ క్యాస్ట్రోకు మధ్య జరిగిన సమావేశం సఫలీకృతం అయిందని చెప్పారు. అర్థమంతమైన చర్చలు తమ మధ్య జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ, క్యూబాను ఒక సమస్యగా తాము భావించడం లేదని తెలిపారు. ఇరు దేశాలమధ్య ప్రస్తుతం ఎలాంటి వైరుధ్యం లేదని, ప్రచ్ఛన్న యుద్ధం ఇక ముగిసినట్లేనని తెలిపారు. క్యూబాకు ఇచ్చే హోదాపై ఇప్పటికే తాము సమీక్ష నిర్వహించామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే జాబితానుంచి దానిని తొలగించే అంశంపై పరిశీలనలు పూర్తయ్యాయని అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని చెప్పారు. ఆయా శాఖల నుంచి అనుమతి రాగానే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే దేశాల జాబితాలో 1982లో చేర్చారు. -
వాళ్లాపితే దక్షిణాసియా ప్రశాంతం: రాజ్‌నాథ్
జైపూర్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ సహాయసహకారాలు అందించకుంటే దక్షిణాసియా మొత్తం ప్రశాంతంగా ఉంటుందని, అభివృద్ధిలో దూసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద చర్యలు నిరోధించే అంశంపై గురువారం జైపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం చెడు ఉగ్రవాదం అని రెండు విధాలుగా ఉండదని, ఈవిషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలు నిరోధించడంలో కొంత విఫలమవుతున్నామని, దేశ సమైక్యతకు ఇదొక అడ్డంకిగా మారిందని తెలిపారు. ముస్లింలు సాధారణంగా స్వాభిమానంగలవారని.. అలాంటివారు తీవ్రవాదాన్ని బోధించేవారి చేతుల్లోకి వెళ్లకూడదని సూచించారు. ఉగ్రవాదం అనేది ఈ ప్రకృతికి ఒక ఏలియన్లాంటిదని చెప్పారు. ఐఎస్ఐ, పాకిస్థాన్ ఆర్మీ పలు ఉగ్రవాద సంస్థలకు తమ మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తుందనే విషయం చెప్పడంలో తానేమాత్రం శంకించబోనని స్పష్టం చేశారు. ఈ విషయాలు గుర్తుంచుకొని పాక్ ఉగ్రవాదులకు సహాయ చర్యలు నిలిపివేయాలని కోరారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో మలుపు
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ముగ్గురి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బాంబులు పేల్చేందుకు కావలసిన పేలుడు పదార్థాలను సమకూర్చిన ముగ్గురిని సోమవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో ఈ ముగ్గురికీ సంబంధం ఉందని పోలీసు ల విచారణలో తేలింది. ఇక్కడ బాంబులు పేల్చేందు కు కావాల్సిన పేలుడు సామగ్రిని ఈ ముగ్గురే సమకూర్చినట్లు కూడా గుర్తించారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతిచెందగా 131 మంది గాయపడిన సంగతి తెలి సిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదుగురు నిందితులను గుర్తించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హాది అలియాస్ తబ్రేజ్ అలియాస్ దానియాల్ అలియాస్ ఆసద్ (28), కర్ణాటకకు చెందిన మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప అలియాస్ యాసిన్ భక్తల్ అలియాస్ షుక్రూ(30)లను ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక కర్ణాటకకు చెందిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ అలియాస్ ఇస్మాయిల్ షాబంద్రీ(38), పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అలియాస్ జావిద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నాబీల్ అహ్మద్(25), బిహార్‌కు చెందిన మహ్మద్ తహసీన్ అక్తర్ హసన్ అలియాస్ మోను(25) పరారీలో ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బెంగళూరులో అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను విచారించేందుకు హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఎన్ఐఏ బృందం.. పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఖలిస్తాన్ టెర్రరిస్టు అరెస్టు
న్యూఢిల్లీ : ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన టెర్రరిస్టును శుక్రవారం పంజాబ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడిని హర్మిందర్ మింటూగా గుర్తించారు. థాయిలాండ్ అధికారులు ఆ దేశం నుంచి మింటూను బహిష్కరించారని పోలీసులు తెలిపారు. అతడిని ఆ దేశరాజధాని బ్యాంకాంగ్‌లో అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. అత డి సమాచారం సేకరించిన తర్వాత దేశబహిష్కారం చేసినట్లు చెప్పారు. మింటూకు పంజాబ్‌లో పలు ఉగ్రవాద కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో పలు ఉగ్రదాడులకు మింటూ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. -
ఇప్పడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం!!
అది కృష్ణా జిల్లా గొట్టిముక్కల గ్రామం. ఇప్పుడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ పదిమంది నోళ్లలో నాలుకలా మెలుగుతూ పనే దైవంగా భావించే ఆ గ్రామ ఉప సర్పంచి ఎ.కృష్ణారావు దారుణహత్యకు గురికావడం ఆ ఊరు మొత్తాన్ని మూగనోము పట్టేలా చేసింది. అదివారం రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కృష్ణారావు ఇంట్లోకి కొంతమంది దుండగులు కృష్ణారావు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆయనను బయటకు లాక్కొచ్చి, పొడిచి పొడిచి చంపేశారు. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని అంతకుముందే కృష్ణారావు పోలీసులకు పదే పదే విజ్ఞప్తులు చేసినా వాళ్లు పెడచెవిన పెట్టారు. ఇక దాడి జరుగుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు చంపొద్దు.. వదిలేయాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆ దుండగులు ఏమాత్రం కనికరించలేదు. ఇంత దారుణ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. హత్యకు పాల్పడినట్లు చెబుతున్న నిందితులు తమంతట తాము లొంగిపోయేవరకు పోలీసులు నిష్క్రియాపరత్వంతో వ్యవహరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పక్షపాతం స్పష్టంగా తెలుస్తోందని, వాళ్లు కావాలనే ఊరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఎలాగైనా వాళ్లను అణగదొక్కాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దారుణమైన హత్యారాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బత్తాయి తోటలు, బొప్పాయి తోటలు.. అన్నింటినీ విచ్చలవిడిగా నరికేశారు. ప్రధానంగా టీడీపీ ఓటమి పాలైన ప్రాంతాల్లోనే ఈ తరహా దాడులు ఎక్కువగా జరిగాయి. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ప్రతిదాన్నీ సొంతం చేసుకోడానికి టీడీపీ సామ దాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రదర్శించింది. గొట్టిముక్కలలో కూడా కృష్ణారావు హత్య తర్వాత సీతయ్య, సెల్వరాజ్ అనే మరో ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇప్పుడక్కడ అంతా భయమే రాజ్యమేలుతోంది. దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డలో.. టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారు! అతడు చేసిన పాపమల్లా.. టీడీపీ గూండాల ఆదేశాలు కాదని తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడమే. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం మౌన ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నారు. పాలకపక్షం ఊదుతున్న బూరాలకు బుట్టలోని పాముల్లా ఆడుతున్నారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు పేట్రేగిపోతున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఉగ్రవాదుల కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు నడుం బిగించింది. నగర శివారు ప్రాంతమైన గోరేగావ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 94 ఎకరాల స్థలంలో ‘ప్రత్యేక కమాండో శిక్షణ కేంద్రం’ నెలకొల్పనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదన హోం శాఖ రూపొందిం చింది. మంజూరు కోసం త్వరలో కేబినెట్ ఎదుట ప్రవేశపెట్టనుంది. మొన్నటివరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు కేవలం ముంబై, పుణే వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర నలుమూలలు, పల్లెలు, కుగ్రామాల్లో సైతం ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాయి. వీటిని దీటుగా అడ్డుకోవాలంటే చురుకుగా పనిచేసే యువకులను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫోర్స్-వన్ కమాండో లు విధినిర్వాహణలో ఉన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి పోర్స్-వన్‌లోకి పంపిస్తున్నారు. కాని విస్తరించిన ఉగ్రవాదుల కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కమాండోల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ప్రత్యేకంగా కమాండోల శిక్షణ కేంద్రం నెలకొల్పాలని హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ కమాండర్లను ఎంపిక చేసే ప్రక్రియను హోం శాఖ చేపట్టింది. ఈ శిక్షణ కేంద్రంలో సైన్యం, వాయు, నేవీ ఇలా త్రిదళాలతోపాటు నేషనల్ సెక్యురిటీ గార్డు (ఎన్ఎస్జీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఏ) నిపుణులు మార్గదర్శనం చేస్తారు. ఇదివరకు పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లతోపాటు కొత్తగా భర్తీ అయిన కమాండోలకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలాఉండగా ఉగ్రవాద సంస్థలు తమ దాడుల పంథాను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. వారి ఆలోచనా సరళిని ప్రస్తుతం విధినిర్వహణలో ఉన్న కమాండోలకు వాటిని ఎదుర్కోవడం కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కమాండోలకు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. 2008 నవంబరు 26న ఉగ్రవాదులు నగరంపై దాడులు జరిపినప్పుడు వాటిని ఎదుర్కునేందుకు ముంబై పోలీసులు ఎన్ఎస్జీ సాయం తీసుకోవల్సి వచ్చింది. వారితో రెండు రోజులపాటు పోరాడి 10 మంది ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ మినహా మిగతా తొమ్మిది మందిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఉగ్రవాదులు అత్యధునిక ఆయుధాలు వినియోగించారు. ఊహించనిరీతిలో లేదా ప్రకృతి వైపరీత్యాలు ఇలా ఆకస్మాత్తుగా జరిగే ఎలాంటి విపత్తులైన సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అవసరమైన శిక్షణను కమాండోలకు ఈ కేంద్రంలో ఇవ్వనున్నారు. -
దేశంలో మరోసారి పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర