ఉగ్ర, తీవ్రవాదాలే పెను సవాల్
* పరస్పర సహకారంతోనే వీటిని ఎదుర్కోగలం: మోదీ
* సింగపూర్ భాగస్వామ్యానికి రక్షణ, భద్రత సహకారమే మూలం
* సింగపూర్ ప్రధానితో భేటీ.. ఇరు దేశాల మధ్య మూడు ఒప్పందాలు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, పెరుగుతున్న తీవ్రవాదం భారత్, సింగపూర్‌లకు పెను సవాళ్లుగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో మోదీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణపై విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ, భద్రతాపరమైన సహకారం మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. ఉగ్రవాదులు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతి, మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని అన్నారు.
సైబర్ సెక్యూరిటీతో పాటు ఎటువంటి ఉపద్రవాల నుంచైనా బయటపడేందుకు ఈ రోజు ఇరు దేశాలు పరస్పర సహకారానికి అంగీకరించాయని తెలిపారు. లీ ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఖండించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా మూడు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో వాణిజ్యానికి ఊతమిచ్చే మేధో హక్కుల ఒప్పందం కూడా ఉంది. వాణిజ్యం, పెట్టుబడులు ద్వైపాక్షిక సంబంధాలకు మూలమని మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుతం బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ సాధిస్తోందని, ఈ ప్రయాణంలో సింగపూర్‌ను కీలక భాగస్వామిగా భావిస్తోందని చెప్పారు. కాగా, సింగపూర్‌లో కార్పొరేట్ రూపీ బాండ్లను విడుదల చేయడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి అవసరాలకు కావాల్సిన నిధులను సమీకరించుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. సింగపూర్-భారత్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకుగానూ ఇరు దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖల భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు లీ చెప్పారు.
రెండు ఎంవోయూల గురించి ప్రధాని మోదీ వివరిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాజస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఉదయ్‌పూర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టూరిజమ్ ట్రైనింగ్ ఏర్పాటును స్వాగతించారు.
లక్నోలో దసరా
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దసరా వేడుకలను లక్నోలో జరుపుకోనున్నారు. అయిష్‌భాగ్ రామ్‌లీలాలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలన్న ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని లక్నో మేయర్, ఉత్సవాల నిర్వాహకుడు దినేశ్‌శర్మ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఈ వేడుకల్లో మోదీ హారతి కార్యక్రమంలో పాల్గొంటారని, రావణ దహనాన్ని బాణం వేసి లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. సాధారణంగా దసరా వేడుకలను ప్రధాని ఢిల్లీలోనే జరుపుకుంటారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ లక్నోలో జరిగే వేడుకల్లో పాలుపంచుకునేందుకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు.