న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారా పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలు అధిగమించగలవని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా తీర్చిదిద్దిన ఈ పేమెంట్ సిస్టమ్ అత్యంత సురక్షితమైనదిగా ఉంటోందనడానికి దీని ద్వారా భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతుండటమే నిదర్శనమని ఆయన తెలిపారు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సింగపూర్‌కు చెందిన పేనౌ, యూపీఐ మధ్య సీమాంతర కనెక్టివిటీని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు. మోదీ, సింగపూర్ ప్రధాని లీ హిసియన్ లూంగ్ సమక్షంలో యూపీఐ–పేనౌ లింకేజీని ఉపయోగించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ (ఎంఏఎస్) ఎండీ రవి మీనన్ లాంఛనంగా లావాదేవీ జరిపారు.
‘భారత్, సింగపూర్ మధ్య మైత్రిని, ఫిన్‌టెక్ .. నవకల్పనల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి సంబంధించి నేడు చాలా ప్రత్యేకమైన రోజు‘ అని మోదీ ట్వీట్ చేశారు. 2018లో మోదీ సింగపూర్‌లో పర్యటించినప్పుడు పేనౌ, యూపీఐని అనుసంధానించే ఆలోచనకు బీజం పడిందని లీ తెలిపారు. ‘అప్పటి నుంచి ఇరు దేశాల బ్యాంకులు ఈ దిశగా కృషి చేశాయి. మొత్తానికి ఇది సాకారం కావడం సంతోషదాయకం‘ అని ఆయన పేర్కొన్నారు.
ఏటా 1 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు..
భారత్, సింగపూర్ మధ్య ఏటా 1 బిలియన్ డాలర్ల పైగా సీమాంతర రిటైల్ చెల్లింపులు, రెమిటెన్సుల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చౌకగా సీమాంతర లావాదేవీలు జరిపేందుకు యూపీఐ–పేనౌ అనుసంధానం తోడ్పడగలదని మోదీ చెప్పారు. వ్యక్తుల మధ్య సీమాంతర చెల్లింపులు జరిపేందుకు భారత్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తొలి దేశం సింగపూర్ అని ఆయన తెలిపారు.
2022లో యూపీఐ ద్వారా రూ. 126 లక్షల కోట్లకు పైగా విలువ చేసే 7,400 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇది దాదాపు 2 లక్షల కోట్ల సింగపూర్ డాలర్ల విలువకు సరిసమానమని ప్రధాని వివరించారు. ‘ఈ నేపథ్యంలో చాలా మంది నిపుణులు త్వరలోనే భారత్‌లో డిజిటల్ వాలెట్ లావాదేవీలు.. నగదు లావాదేవీలను అధిగమిస్తాయని అంచనా వేస్తున్నారు‘ అని ఆయన పేర్కొన్నారు.
లావాదేవీలు ఇలా...
ఆర్‌బీఐ, ఎంఏఎస్, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్‌ఐపీఎల్), బ్యాంకింగ్ కంప్యూటర్ సరీ్వసెస్ (బీసీఎస్), ఇతరత్రా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు కలిసి యూపీఐ–పేనౌ లింకేజీని తీర్చిదిద్దాయి. దీనితో ఇరు దేశాల ప్రజలు తమ తమ మొబైల్ యాప్‌ల ద్వారా సురక్షితంగా సీమాంతర నిధుల బదలాయింపు లావాదేవీలు చేయవచ్చు.
తమ బ్యాంక్ ఖాతాలు లేదా ఈ–వాలెట్లలో డబ్బును యూపీఐ ఐడీ, మొబైల్ నంబరు లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ) ద్వారా పంపించవచ్చని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. తొలి దశలో భారతీయ యూజర్లు రోజుకు రూ. 60,000 వరకూ (1,000 సింగపూర్ డాలర్లు) పంపించవచ్చు. లావాదేవీ చేసేటప్పుడే రెండు కరెన్సీల్లోనూ విలువను సిస్టమ్ చూపిస్తుంది. ఎస్‌బీఐ, ఐఓబీ, ఇండియన్ బ్యాంక్, ఐసీఐసీఐ ఇన్‌వార్డ్, అవుట్‌వార్డ్ రెమిటెన్సుల సేవలను.. యాక్సిస్, డీబీఎస్ ఇండియా కేవలం ఇన్‌వార్డ్ రెమిటెన్సుల సేవలను అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment