న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దులనుంచి ఎవ్వరూ భారత్ లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించింది.
అంతర్జాతీయ సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించే మార్గాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు దేశాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్తోం, మేఘాలయ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఆయామార్గాలనుంచి ఎవ్వరూ దేశంలోకి చొరబడకుండా చూడాలని అధికారులకు, భద్రతా బలగాలకు సూచించింది. ఢాకా దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ బంగ్లాదేశ్ దౌత్య అధికారులతోనూ, సెక్యూరిటీ ఏజెన్సీలతోనూ చర్చిస్తున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
అయితే అక్కడి భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు సైనికులు 11 గంటలపాటు శ్రమించారు. భద్రతా దళాలు, ఉగ్రమూకలకు మధ్య జరిగిన పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. ఘటనలో మొత్తం 20 దాకా చనిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సెన్సేషన్లు సృష్టించడం టెర్రరిజం అంతానికి సహకరించదని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియా ఇతోధికంగా సహకరించాలని ప్రభుత్వం మీడియాకు సూచించింది. బంగ్లాదేశ్ ను స్నేహపూర్వక దేశంగా ఇప్పటికే గుర్తించామని, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది సైతం టెర్రరిజాన్ని అణచివేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలిపింది.
భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
Published Sat, Jul 2 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement