ఉగ్రవాదంపై భారత్ ఓపికతో ఉండదు
న్యూఢిల్లీ: ఉగ్రవాదం విషయంలోనూ, దాన్ని ప్రేరేపించే సంస్థల విషయంలోనూ భారత ప్రభుత్వం ఏమాత్రం సహనంగా వ్యవహరించదని, తక్షణ చర్యలు తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర కేబినెట్తో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం దాట వేశారు. మయన్మార్ సరిహద్దులో ఉగ్రవాద చర్యలను సమర్థంగా ఎదుర్కొన్న సందర్భంగా ప్రధానికి ఈ సమావేశంలో అభినందనలు తెలిపారా అని ప్రశ్నించగా అదేం లేదని చెప్పారు.
అసలు ఆ విషయాన్ని సమావేశంలో చర్చించనే లేదన్నారు. ప్రత్యేకంగా ప్రధాని అభినందనలు చెప్పేదేముందని, ముందునుంచే తాము చెప్తున్నామని, ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారత్ ఇక సహనంతో ఆలోచించదని, తక్షణమే స్పందిస్తుందని ఆరోజు చెప్పామని, ఇప్పుడు అలాగే చేశామని తెలిపారు. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ప్రత్యేక దళాలు తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాతే భారత్ ఆర్మీ సైనిక దళాలు ప్రతికార దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయితే, గడ్కరీ మాత్రం ఆర్మీకి చెందిన అధికారిక ప్రతినిధి తీసుకోవాల్సిన చర్యపై పూర్తి నివేదిక ఇచ్చారని, దాని ప్రకారమే సైన్యం ఆపరేషన్ పూర్తి చేసిందని తెలిపారు.