భారత్‌లో ఉగ్రచర్యలకు భారీ విరాళాలు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (హెచ్‌ఎం) భారీ ఎత్తున విరాళాలు సేకరింస్తోంది. గత ఎనిమిదేళ్లలో పాక్‌లోని వివిధ వర్గాల నుంచి ఆ ఉగ్రవాద గ్రూపు రూన. 80 కోట్లకుపైగా వసూలు చేసిందని భారత దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. 'భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్ఎం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గత ఎనిమిదేళ్లలో ఆ సంస్థ రూ. 80 కోట్లు వసూలు చేసింది' అని వారు అంతర్జాతీయ సంస్థ అయినా పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు.
'భారత్‌కు ఈ నిధులు చేరగానే వీటిని వివిధ మార్గాల ద్వారా మళ్లించి క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు, మరణించిన హిబ్బుల్ ఉగ్రవాదుల కుటుంబసభ్యులకు అందజేస్తారు' అని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో పేర్కొంది. విదేశాల్లో కూడా నిధులు సేకరించి.. తమ ముసుగు సంస్థలకు ఆ సొమ్మును చేరవేస్తున్నారని వెల్లడించింది. పారిస్ దాడుల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ సభ్య దేశాలు ఉగ్రవాద గ్రూపులకు నిధులు ఎలా అందుతున్నాయి. వాటిని ఆపేది ఎలా అనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో పారిస్ తరహాలో గతంలో జరిగిన ముంబై దాడులను ప్రస్తావించిన భారత్.. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరును సభ్య దేశాల దృష్టికి తీసుకొచ్చింది.
పాకిస్థాన్ తన భూభాగంలో ఉగ్రవాదుల యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నదని, తన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కన్నుసన్నల్లోనే ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయని భారత్ ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసింది. 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు వద్ద హిబ్బుల్ జరిపిన పేలుళ్లలో 17 మంది మరణించగా, 76 మంది గాయపడ్డారు.