జమ్మూః శ్రీనగర్ సిటీలో సోమవారం ఉదయం జరిగిన ఉగ్రదాడి తమ పనేనంటూ తీవ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిదీన్ ప్రకటించడంతో వారికోసం సైన్యం జల్లెడ పడుతోంది. జడిబల్ పోలీసు స్టేషన్ పై ఉదయం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందడంతో సైన్యం అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది.
మెహబూబా ముఫ్తి సారధ్యంలోని పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వేర్పాటువాద గెరిల్లా దాడి జరిగింది.
పాకిస్తాన్ మద్దతుతో అక్కడే శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.
భారీగా సాయుధ తీవ్రవాదులు జడిబల్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఏఎస్ఐ అహ్మద్, కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ లు దాడిలో అక్కడికక్కడే మరణించగా.. మరో పోలీసు తీవ్రంగా గాయపడి, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఇటువంటి ఉగ్రదాడులపై ఆర్మీ, పోలీసులు, ఇతర ఏజెన్సీలు దృష్టి సారించాయని టెర్రరిస్టులను ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టేది లేదని జీవోసీ అధికారి సతీష్ దువా తెలిపారు. ఇటువంటి దాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు.
అధీన రేఖవద్ద హైఅలర్ట్, తీవ్రవాదులకోసం జల్లెడ!
Published Mon, May 23 2016 4:19 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM
Advertisement
Advertisement