మరికొద్ది రోజుల్లో విధ్వంసం.. ఆలోపే అరెస్టు
సిడ్నీ: ప్రభుత్వ భవనాన్ని టార్గెట్ చేసుకుని భారీ దాడికి ప్రణాళికలు రచించిన కేసులో ఓ పదిహేనేళ్ల కుర్రాడిని, 20 ఏళ్ల యువకుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడిని హత్య చేయాలనుకున్న ఘటనకు సంబంధించి పదిహేనుమందిని అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు విచారణ చేసినప్పుడు తాజా కుట్రకు సంబంధించిన వివరాలు తెలిశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం తాజాగా రైడింగ్ లు నిర్వహించి ఆ 15 ఏళ్ల బాలుడిని, 20 ఏళ్ల వ్యక్తిని ఇంట్లో ఉండగానే అరెస్టు చేశారు. అనంతరం వాళ్ల నివాసాలను జప్తు చేశారు.
ఈ అరెస్టులకు సంబంధించి ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ మైఖెల్ పెలాన్ మాట్లాడుతూ తాజా అరెస్టులు ప్రభుత్వ కార్యాలయంపైనే దాడి చేసేందుకు రచించిన భారీ కుట్రకు సంబంధించినవని అన్నారు. అంతకుముందే ముగ్గురుని అరెస్టు చేశామని వారికి కొత్తగా అరెస్టు చేసినవారికి సంబంధాలు ఉండిఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. డిసెంబర్లోనే ఈ కుట్ర అమలు చేయాలని వారు ప్లాన్ చేశారని, ఈలోగా తమ నిఘా వర్గాలు చాలా వేగంగా స్పందించి భగ్నం చేసి వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై తాము చాలా సీరియస్ గా ఉన్నామని, ఉగ్రవాద కుట్రలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.