మార్చి 4న ఐదు సినిమాలు
గతంలో ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు రూట్ మార్చారు. ఒకేరోజు నాలుగైదు సినిమాలతో బరిలో దిగుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన పరవాలేదని భావిస్తున్నారు. అయితే ఈ పోటి కారణంగా మంచి సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడుతున్నాయి. మార్చి 4న మరో సారి ఇలాంటి భారీ పోటికి రంగం సిద్ధమవుతోంది.
సమ్మర్ సీజన్లో స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీ అవుతుండటంతో చిన్న సినిమా నిర్మాతలు ముందుగానే తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి స్టార్ హీరోల దాడి మొదలవుతుండటంతో ఈ లోపు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అందుకే మార్చి 4న తెలుగు వెండితెర మీద చిన్న సినిమా పండుగ జరగనుంది.
అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ క్షణం, మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శౌర్య. అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన కళ్యాణవైభోగమే, శ్రీకాంత్ హీరోగా యాక్షన్ జానర్లో తెరకెక్కిన టెర్రర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమా శివగంగ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఇన్ని సినిమాలు ఒకే సారి బరిలో దిగుతాయా లేక ఎవరైన వెనక్కు తగ్గుతారా చూడాలి.