kalyana Vaibhogame
-
బుల్లితెర శోభన్‌బాబు
బుల్లితెరపై విజె సన్నిగా అలరించిన అరుణ్ సీరియల్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ‘అందరూ సీరియల్ శోభన్‌బాబు అని కితాబులిస్తున్నారు’ అంటూ సరదాగా వివరించిన అరుణ్ సింగిల్ ట్రావెల్ జర్నీ అంటే అమితంగా ఇష్టపడతానని తన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘మాది ఖమ్మం. పీజీ చేస్తున్నప్పుడు అవకాశం వస్తే ముందు ఒక టీవీ చానెల్లో లైఫ్‌సై్టల్ రిపోర్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చాను. మూడేళ్లపాటు టీవీ యాంకర్‌గా వర్క్ చేశాను. నా యాంకరింగ్ చూసిన టీవీ సీరియల్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘కళ్యాణవైభోగం’ సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాను. మూడేళ్లుగా ఈ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ‘కళ్యాణవైభోగం’ సీరియల్లోని దృశ్యం సూర్యదేవర జయసూర్య అనే నేను ‘జీ తెలుగు’లో వచ్చే ‘కళ్యాణౖవైభోగం’ సీరియల్లో సూర్యదేవర జయసూర్యగా లీడ్ రోల్లో నటిస్తున్నాను. ఈ సీరియల్లో బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తుంటాను. బిజినెస్ ఉమన్ నిత్యను చూసి, ఇష్టపడి పెళ్లిచేసుకుంటాను. తనే నా లైఫ్ అన్నట్టుగా ఉంటాను. అయితే, అనుకోకుండా మా ఇద్దరి మధ్య బిజినెస్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో నిత్య చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిత్య స్థానంలో అదే పోలికతో ఉండే మంగను చేర్చుతారు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. ఇలా ఓ భిన్న కథాంశంతో సీరియల్ నడుస్తుంది. మా టీమ్‌లో అందరూ నన్ను సీరియల్ శోభన్‌బాబు అని పిలవడానికి కారణం కూడా అదే. మూడేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో ఉన్నందుకు గాను టీవీ అవార్డు నన్ను వరించింది. ఈ రంగానికి వచ్చినందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తుంటాను. అమ్మ కష్టంతో ఎదిగాం ఖమ్మంలో అమ్మ విలేజ్ హెల్త్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసేవారు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ సింగిల్ పేరెంట్‌గా మా ముగ్గురిని చదివించింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాం. మా ముగ్గురిలో చిన్నవాడిని కాబట్టి నేను కాస్త గారంగానే పెరిగాను. పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తుండగా రిపోర్టర్‌గా, అటు నుంచి వీడియోజాకీగా.. అవకాశాలు వచ్చాయి. దీంతో టీవీనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చేశాను. అన్నయ్యలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. నాకున్న ఇష్టం కొద్దీ ఈ ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మకు మా మీద చాలా నమ్మకం. ఏ వర్క్ అయినా స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చేయ్, ఇదే చదువుకొని జాబ్ తెచ్చుకో.. అని అనలేదు. దీంతో సృజన ఉన్న ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సీరియల్స్‌తో పాటు సినిమాలోనూ రాణించాలనుకుంటున్నాను. ప్రయాణాలతో ప్రమోదం సీరియల్ షూటింగ్, ఈవెంట్స్, షోస్ అంటూ నెలలో పాతిక రోజులు గడిచిపోతాయి. మిగతా రోజులను ట్రావెల్‌కు ఉపయోగించుకుంటాను. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. అలాగని ట్రూప్‌లుగా వెళ్లే జర్నీ అంటే ఇష్టముండదు. అమ్మవాళ్లు తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను మాత్రం బైక్‌పైన ఫ్రెండ్స్‌తో ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను. ప్రపంచ పర్యాటక స్థలాలన్నీ సందర్శించాలనేది నా కల’ అంటూ తన జీవనవిధానంతోపాటు అభిరుచులనూ షేర్ చేశారు సన్ని. – నిర్మలారెడ్డి -
'కల్యాణవైభోగం' ప్లాటినం డిస్క్ వేడుక
-
ఈ కళ్యాణం... కమనీయం
కొత్త సినిమా గురూ! పెళ్లనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధుర ఘట్టం. పైగా భారతీయ వివాహ వ్యవస్థకో విశిష్ఠత కూడా ఉంది. ఈ వ్యవస్థ గొప్పదనాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాయి. ‘సీతారామకల్యాణం’, ‘పెళ్లిపుస్తకం’, ‘మురారి’... ఇలా ఎన్నో సినిమాల్లో వివాహం అనేది జీవితంలో ఎంత అద్భుతమైన ఘట్టమో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా నందినీ రెడ్డి కూడా కళ్యాణ వైభోగాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ‘కళ్యాణ వైభోగమే’. కథేంటంటే... 23 ఏళ్ల శౌర్య (నాగశౌర్య) గేమింగ్ డిజైనర్. మిలియన్ డాలర్ కంపెనీ పెట్టి యూఎస్‌లో సెటిలైపోవాలన్నది డ్రీమ్. పెళ్లంటే నూరేళ్ల మంట అని అతని అభిప్రాయం. అందుకే అమ్మ (ఐశ్వర్య), నాన్న(రాజ్ మాదిరాజు)లు పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటాడు. అయినా ఓ రోజు తప్పక పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ దివ్య (మాళవికా నాయర్)ను చూస్తాడు. ఇద్దరికీ విడిగా మాట్లాడుకునే అవకాశం ఇస్తారు పెద్దలు. నాకీ పెళ్లి ఇష్టంలేదని ఆమె మొహం మీదే చెప్పేస్తాడు. దివ్వకు కూడా అదే అభిప్రాయం. పెళ్లికి ముందు తల్లిదండ్రుల మాట... పెళ్లయ్యాక భర్త మాట వింటూ ఉండే భార్యలా.. తన కళ్ల ముందు కనిపించే అమ్మ (రాశి)లా ఉండకూడదు, ఇంకా ఏదో సాధించాలని తన ఫీలింగ్. ఇష్టం లేని పెళ్లిని ఆపడానికి శౌర్య, దివ్య తమ పెద్దలకు ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పి, ఎలాగోలా పెళ్లి సంబంధాన్ని తప్పిస్తారు. అది తప్పిపోయినా పెద్దలు మాత్రం ఇద్దరికీ పెళ్లి సంబంధాల వేటలో ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో శౌర్య, దివ్యలు ఓ రెస్టారెంట్లో కలుస్తారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్‌తో విడిపోవచ్చని వారి ప్లాన్. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అక్కడనుంచి మొదలవుతుంది అసలు కథ. వాళ్ల ఉద్దేశం. వాళ్లు అనుకున్నట్లే విడిపోయారా? లేక కలిసే ఉన్నారా? అనేది మిగతా కథ. బలవంతంగా పెళ్లి చేసేద్దామనే ధోరణిలో ఉన్న పెద్దవాళ్లు, వాళ్లకు ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుని, అందులోంచి బయటపడటానికి ప్లాన్ వేసిన ఓ యువ జంట ఎన్ని కష్టాలు ఎదుర్కొందో నందినీ రె డ్డి ఆసక్తికరంగా చూపించారు. ఆడవాళ్లంటే ఇంటికి పరిమితం కావాలనే ఆలోచనతో ఉన్న హీరోయిన్ తండ్రి పాత్రలో తమిళ నటుడు ఆనంద్, అతని భార్యగా రాశి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓ సన్నివేశంలో ఎప్పుడూ భార్యలే భర్తలకు వడ్డించాలా అని శౌర్య పట్టుబట్టి తన మావయ్య (ఆనంద్)తో అత్తయ్య(రాశి)కు వడ్డించేలా చేస్తాడు. పెళ్లయిన ఇన్నేళ్లలో ‘ఎప్పుడూ తనను తిన్నావా’ అని అడగని భర్త అలా వడ్డించడంతో చెమర్చిన కళ్లు, తర్వాత శౌర్య ‘తినండి అత్తయ్యా’ అంటూ వడ్డిస్తుంటే రాలిన ఆనందబాష్పాలతో ‘చాలు బాబు...’ అంటూ రాశి కనబర్చిన నటన టచింగ్‌గా ఉంటుంది. తండ్రికి భయపడే అమ్మాయిగా, జీవితంపట్ల స్పష్టమైన ఆలోచన గల యువతిగా మాళవిక, లైఫ్ అంటే జాలీ రైడ్ అనుకునే శౌర్యగా నాగశౌర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించే ప్రగతి ఈ సినిమాలో ఐపాడ్ అమ్మక్కగా నవ్వులు పూయించారు. పతాక సన్నివేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తాగుబోతు రమేశ్, జీహెచ్ఎంసి వ్యాన్ డ్రైవర్‌గా ఆశిష్ విద్యార్థి నవ్వించడం కొసమెరుపు. ‘అలా మొదలైంది’ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపించినా, తనదైన టేకింగ్‌తో వాటిని ప్రేక్షకుల మనసుల్లోంచి తుడిచేసే ప్రయత్నం చేశారు దర్శకురాలు. కళ్యాణి కోడూరి స్వరపరిచిన పాటల్లో పెళ్లి పాట గుర్తుండిపోతుంది. డబుల్ మీనింగ్ కామెడీ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో హృదయానికి హత్తుకునేలా, సకుటుంబ సపరివారాన్ని ఎక్కడా ఇబ్బంది పెట్టని ఈ కల్యాణ వైభోగం నవరసభరితం. -
రిస్క్ చేస్తున్న యంగ్ హీరో
చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య, తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన ఈ చాక్లెట్ బాయ్, రూట్ మార్చి చేసిన ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. మాస్ ఇమేజ్ కోసం చేసిన యాక్షన్ సినిమా జాదూగాడు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మరోసారి రొమాంటిక్ మూవీస్ మీద దృష్టి పెట్టాడు నాగశౌర్య. ప్రస్తుతం అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న నాగశౌర్య, ఆ సినిమా తరువాత మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న నెక్ట్స్ సినిమాలో హీరోగా, విలన్‌గా డ్యూయల్ రోల్లో నటించడానికి అంగీకరించాడు. మాస్ క్యారెక్టర్‌తో మెప్పించలేకపోయిన నాగశౌర్య, నెగెటివ్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!
‘అలా మొదలైంది’తో డెరైక్టర్ నందినీరెడ్డి పరిచయం చేసిన మలయాళీ నిత్యామీనన్ తెలుగులో ఫుల్ బిజీ. ఇప్పుడు మరో మలయాళీ మాళవికతో శ్రీరంజిత్ మూవీస్ వారికి ‘కళ్యాణవైభోగమే’ తీశారు నందిని. మా మాళవికలో శోభనని చూసుకుంటూ తీశానని నందిని, మా డెరైక్టర్ లవబుల్ ఫిల్మ్ తీశారని మాళవిక అంటున్నారు. వాళ్లిద్దరితో స్పెషల్ చాట్ నందినీరెడ్డిగారూ! ‘కళ్యాణ వైభోగమే’ కథానాయిక కోసం వందలకొద్ది ఫొటోలు చూశారట. అందులో మాళవిక ఫొటోని కూడా చూసి తిరస్కరించారట? నందినీరెడ్డి: మాళవికా నాయర్ ఫొటోని చూశానా లేదా అనేది నాకు డౌటేనండీ. నాయిక పాత్ర కోసం 400 మంది అమ్మాయిల ఫొటోలు చూసింది నిజమే. ఎవరూ నచ్చలేదు. చివరికి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియో ఫంక్షన్లో మాళవిక ఎక్స్ప్రెషన్స్, ఫేస్‌లో అమాయకత్వం చూసి, ఎంచుకున్నా. మాళవికా! ఇదంతా మీరు నమ్ముతారా? మాళవిక: హాహాహా... దర్శకురాలు చెబుతున్నప్పుడు నమ్మాలి కదండీ. తనకి నేను నచ్చినా నేను ఈ సినిమా చేయకూడదనుకున్నా. ట్వల్త్ చదువు తున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వద్దనుకున్నా. కానీ నందిని కథ చెప్పాక నో చెప్పాలనిపించలేదు. నందినీగారూ! అందరూ మాళవికని చూసి నిత్యామీనన్‌లా ఉన్నారని చెబుతున్నారు? నందినీరెడ్డి: నిత్యకీ, మాళవికకీ మధ్య నాకైతే పోలికలేమీ కనిపించవు. మాళవికను చూసినప్పుడు నాకు శోభన గారు గుర్తుకొస్తారు. అయినా నిత్యలా ఉండాలనో, శోభనలా ఉందనో నేను మాళవికని ఎంపిక చేసుకోలేదండీ. ఒక యాక్టర్‌కి ముఖ్యమైనవి కళ్లు. తర్వాత నవ్వు చూస్తా. మాళవికలో ఆ రెండూ నచ్చాయి. అందుకే ఎంచుకున్నా. మాళవికగారూ! శోభనలాగా ఉన్నానని మీకెప్పుడైనా అనిపించిందా? మాళవిక: నన్నడిగితే నేనేం చెబుతానండీ(నవ్వుతూ). నేనైతే మా అమ్మానాన్నల పోలికలతో ఉంటాననుకుంటా. నందినీగారూ! ‘అలా మొదలైంది’ కీ,‘కళ్యాణ వైభోగమే’ కీ మధ్య పోలికలేమైనా? ఆ మేజిక్ మరోసారి రిపీటవుతుందా? నందినీరెడ్డి: స్టైల్ ఆఫ్ మేకింగ్ దగ్గరగానే ఉంటుంది. ‘కళ్యాణ వైభోగమే’లో అదనంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడవుతాయి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి సీన్ మన ఇంట్లో జరుగుతున్న ఫీల్ కలిగిస్తుంటుంది. మాళవికా! మీరు ‘అలా మొదలైంది’ చూశారా? మాళవిక: ‘ఎవడే సుబ్రమణ్యం’ చేస్తున్నప్పుడే నాని చూడమని తన సినిమాలన్నీ ఇచ్చాడు. ‘అలా మొదలైంది’ అందులో ఉంది. మంచి సినిమా. కానీ ఆ సినిమా చూసినప్పుడైతే నేను నందినితో కలిసి పనిచేస్తానని అనుకోలేదు. నందినీగారూ! ‘జబర్దస్త్’ లాంటి ప్లాప్ తర్వాత తదుపరి మళ్లీ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనుకున్నారు? నందినీరెడ్డి: కొన్నాళ్లపాటు మైండ్ పనిచేయలేదు. బన్నీ ఒకరోజు ఫోన్ చేశాడు. ‘ఒకసారొచ్చి కలువు’ అన్నాడు. వెళ్లాక ‘ఏం చేస్తున్నావు’ అని అడిగాడు. ‘ఆర్నెల్లుగా ఇంట్లోనే ఉన్నా’ అన్నా. అప్పుడు క్లాస్ పీకాడు. అప్పుడే ‘జబర్ దస్త్’ ప్లేస్‌లో చేయాలనుకున్న కథ ఇదని ‘కళ్యాణ వైభోగమే’ కథ చెప్పా. బాగుందని ప్రోత్సహించాడు. స్వప్నాదత్కి కథ చెప్పా. నిర్మిస్తానంది. నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ గారు శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్లో చేద్దామన్నారు. మాళవికా! మీరు ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చూశారా? మాళవిక: చూశా. సినిమా చూస్తున్నప్పుడు కథ చెప్పినప్పటికంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఎక్జైట్ అయ్యా. బోలెడంత ప్రేమ, బోలెడంత ఫన్ కనిపిస్తుంది. ఇదివరకు నా కథలన్నీ మా నాన్నగారే వినేవారు, ఆయనే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇది నేను సెలక్ట్ చేసుకున్న తొలి కథ. ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నందుకు గర్విస్తున్నా. సినిమా షూటింగ్‌లోని సందడికి సంబంధించిన విషయాలేమైనా చెబుతారా? మాళవిక: షూటింగ్ కూడా వైభోగంగానే జరిగింది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంతమంది ఒకచోట కలిసేసరికి పెద్ద ఫ్యామిలీలాగా అయిపోయాం. పెళ్లి పాట సమయంలో బాగా ఎంజాయ్ చేశాం. ట్రైలర్లో నాగశౌర్య కోడికాళ్లు చూసి సెక్సీ లెగ్స్ అంటున్నాడు. ఏంటా కథ? మాళవిక: అది మీరు సినిమాలో చూస్తేనే తెలుస్తుంది. నందిని: మా సినిమాలో హీరోయిన్ మాళవిక మాత్రమే కాదండీ. కామాక్షి కూడా ఉంది. కామాక్షి ఓ కోడి పేరు. కామాక్షి, మాళవిక, నాగశౌర్యల మధ్య సాగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నమాట. అప్పటిదాకా వెజిటేరియన్ అయిన మాళవిక, కామాక్షిని చూసి ఏం చేసిందనేది సినిమాలోనే చూడాలి. -
‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు
కథే హీరో అని నమ్ముతూ సినిమాలు తీసే కొద్దిమంది నిర్మాతల్లో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దామూ) ఒకరు. ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు- ఆ తర్వాత’తో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న ఆయన తాజా ఫిల్మ్ ‘కళ్యాణ వైభోగమే’. నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 4న రిలీజ్. దామూతో స్పెషల్ ఛాట్. పోస్టర్ నిండుగా, నటీనటులతో కళకళలాడుతోంది. ఇంత మంది క్యాస్టింగ్‌తో కూడిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ 40 రోజులు చిత్రీకరణ చేశారట? సినిమా షెడ్యూల్ నటీనటుల డేట్స్, కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మేం ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళుతుంటాం. మా హీరోయిన్ చదువు వలన 40 రోజుల షెడ్యూల్ పెట్టాల్సి వచ్చింది. నందినీరెడ్డి గత చిత్రం ప్లాప్. మళ్లీ ఆమెతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా? మా కాంబినేషన్లో ‘అలా మొదలైంది’ ఎంత పెద్ద సక్సెస్సో అందరికీ తెలుసు. మా ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నందిని ‘అలా మొదలైంది’ లాంటి సక్సెస్‌తో ఎంత నేర్చుకుందో, ఆ తర్వాత వచ్చిన ఫెయిల్యూర్తోనూ అంతే నేర్చుకుంది. ‘కళ్యాణవైభోగమే’ కథను ఆమె రాసుకున్న విధానం, నాకు చెప్పిన విధానం బాగా నచ్చాయి. కథపై తనకెంత స్పష్టత ఉందో... ఆ కథ విన్నాక నాలోనూ అంతే స్పష్టత ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా చేసేశా. మీరు మిగతా దర్శకులతోనూ కలిసి పనిచేశారు. వాళ్లతో పోలిస్తే, నందినిరెడ్డిలో మీకు కనిపించే డిఫరెన్స్? నందిని కమిట్మెంట్ ఉన్న దర్శకురాలు. నిజాయతీగా నచ్చిందే చేస్తుంది. నిర్మాతగా నేనెప్పుడైనా ‘ఇది కరెక్టు కాదేమో’ అని చెబితే ఆలోచించి దానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తుంటుంది. ఒకవేళ తాను అనుకున్నదే కరెక్టనుకుంటే నన్ను కూడా కన్విన్స్ చేస్తుంటుంది. అందు కోసమని నాతో వాదించడానికి కూడా రెడీ అవుతుంది. కళ్యాణ్ కోడూరి అంతే. అందుకే వీరిద్దరితోనూ నా ప్రయాణం సాగుతోంది. చిత్రీకరణలో మీరు టెన్షన్‌కి గురైన సందర్భం ఉందా? ‘కళ్యాణ వైభోగమే’ ప్రీ క్లైమాక్స్‌లో ఓ సీన్ చిత్రానికి ఆయువుపట్టు లాంటిది. పేపర్పైనున్న డైలాగ్ వర్షన్, ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి. మరి అవి అలాగే తెరపైకి వస్తాయో, రావో అన్న భయం ఉండేది. అందుకే ఆ సన్నివేశాలు పూర్తయ్యేవరకు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నా. మేం అనుకున్నట్టుగానే ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి. నాకున్న ఒకే ఒక్క టెన్షన్ ఆరోజే తీరిపోయింది. ఇందులోని ప్రతి సీన్ రియలిస్టిక్‌గా ఉంటుంది. మీ సంస్థ నుంచి కుటుంబ కథాచిత్రాలే వస్తుంటాయెందుకు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు నన్ను. నాకు కూడా ఇలా ఒకే జానర్‌కి పరిమితం కావాలని లేదు. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ తీయాలనుంది. తీస్తాను కూడా. అయితే కుటుంబ కథలు మాత్రం అనుకోకుండానే నా దగ్గరికి వస్తుంటాయి. సుమారు 80 కథలు విన్నాక ‘అలా మొదలైంది’ కుదిరింది. ఆ తర్వాత 50 కథలు విన్నాక ‘అంతకు ముందు-ఆ తర్వాత’ చేశా. మరో 50 కథలు విన్నాక ‘కళ్యాణ వైభోగమే’ చేశా. చిన్న సినిమాలు తీస్తే విడుదల సమయంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా? పెట్టే బడ్జెట్లో తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ... కథ విషయంలో కాదు. కథ బాగుంటే చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది. అదే కథలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా వృథానే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళామన్నదే ముఖ్యం. చాలామంది పబ్లిసిటీ విషయంలో వెనకబడుతున్నారు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరమనే ది నా భావన. మీకు డ్రీమ్ ప్రాజెక్టుల్లాంటివేమైనా ఉన్నాయా? తీసే ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. ప్రతి సినిమానూ తొలి సినిమాలాగే భావిస్తుంటా. ప్రతిసారీ కొత్తవిషయాలు నేర్చుకుంటుంటా. వాటిని తదుపరి చిత్రానికి ఉపయోగిస్తా. -
భయం లేకుండా తీశా! - నందినీరెడ్డి
పెళ్లి విషయంలో ఈ తరం ఆలోచనా విధానం ఎలా ఉంటోంది? వైవాహిక జీవితం పట్ల వారికి ఎలాంటి అభిప్రాయాలున్నాయి? అని చెప్పే సినిమా ‘కల్యాణ వైభోగమే’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీ రంజిత్ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్. దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నందినీరెడ్డి మాట్లాడుతూ- ‘‘ ‘అలా మొదలైంది’ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత వెంటనే ‘జబర్దస్త్’ లాంటి ఫెయిల్యూర్ చూశాను. అయినా ఈ చిత్రాన్ని మాత్రం ఎలాంటి భయాలూ, టెన్షన్లు లేకుండా తీశా. ప్రతి నిమిషం ఈ స్క్రిప్ట్, షూటింగ్ కోసం నేను, నా టీమ్ మెంబర్స్ ఎంతో ఇష్టపడి పనిచేశాం. మామూలుగా ఒక షెడ్యూల్ అయిపోయాక, ఏమైనా సరిగ్గా రాలేదంటే రీ-షూట్స్ చేసేవాళ్లం. కానీ వేసవిలో మాళవికకు పరీక్షలు ఉండడంతో వరుసగా 45 రోజులు షూటింగ్ చేశాం. ఈ సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్‌లో మా ఎడిటర్ జునైద్‌గారు చూసి మెచ్చుకున్నారు. అప్పుడింకా నమ్మకం పెరిగింది. అందుకే, సినిమా రిజల్ట్ గురించి బెంగ లేదు. ‘అలా మొద లైంది’ సక్సెస్‌తో నాకు సక్సెస్ మీద ప్రేమ, కోరిక రెండూ పోయాయి. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. తీవ్ర భావోద్వే గాలున్న ఓ లవ్‌స్టోరీ రాశాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దానికి సంబంధించిన పనులు మొదలుపెడతా’’ అన్నారు. -
మొదట ఈ విషయం ఎవరికీ తెలీదు!
- నిర్మాత దామోదర్ ప్రసాద్ ‘‘నా సినిమాలో కథకు తగ్గట్టే నటీనటులు ఉంటారు. మా బ్యానర్లో గతంలో వచ్చిన సినిమాలకు దీటుగా ఈ ‘కళ్యాణ వైభోగమే’ ఉంటుంది’’ అని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా ఆయన నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను హైదరాబాద్‌లో విలేఖరులతో మంగళవారం పంచుకున్నారు. ‘‘కథ అంతా విన్నాక, స్క్రిప్ట్ రెడీ అయ్యేంతవరకు నేను ఆ సినిమా గురించి మాట్లాడను. ప్రత్యేకించి ఈ సినిమా కోసం 14 నెలలు వర్క్ చేశాను. ‘అలా మొదలైంది’ తర్వాత దర్శకురాలు నందినీరెడ్డి, నేను కలసి చేస్తున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. కళ్యాణ్ కోడూరి స్వరాలందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో పెళ్లి పాట అందరికీ కనెక్ట్ అయింది. మేం సినిమా చేస్తున్నట్టు చాలా మందికి తెలీదు. కానీ సినిమా పూర్తయి, సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చాక ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఓ అందమైన ప్రేమకథ ఇది. ఈ తరానికి తగ్గట్టు పూర్తిగా వినోదాన్ని మేళవించి, ఈ కథను తెరకెక్కించాం’’ అని దామోదర్ ప్రసాద్ తెలిపారు. -
ఆ జంట కన్నులపంట
ఓ అమ్మాయి, అబ్బాయి జీవితంలో పెళ్లికి ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సకుటుంబ వినోదకథా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘అలా మొదలైంది’ వంటి చిత్రాలను మించి ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కథాకథనాలు, సంభాషణలు, ఛాయాగ్రహణం హైలైట్’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై యువతరంలో ఉన్న ఆలోచనలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. సున్నిత భావోద్వేగాలను సమపాళ్ళలో మేళవించి చిత్రం రూపొందించాం’’ అని నందినీరెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ: జీవీఎస్ రాజు, సహ-నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహనరెడ్డి. వి. -
మార్చి 4న ఐదు సినిమాలు
గతంలో ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు రూట్ మార్చారు. ఒకేరోజు నాలుగైదు సినిమాలతో బరిలో దిగుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన పరవాలేదని భావిస్తున్నారు. అయితే ఈ పోటి కారణంగా మంచి సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడుతున్నాయి. మార్చి 4న మరో సారి ఇలాంటి భారీ పోటికి రంగం సిద్ధమవుతోంది. సమ్మర్ సీజన్లో స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీ అవుతుండటంతో చిన్న సినిమా నిర్మాతలు ముందుగానే తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి స్టార్ హీరోల దాడి మొదలవుతుండటంతో ఈ లోపు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అందుకే మార్చి 4న తెలుగు వెండితెర మీద చిన్న సినిమా పండుగ జరగనుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ క్షణం, మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శౌర్య. అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన కళ్యాణవైభోగమే, శ్రీకాంత్ హీరోగా యాక్షన్ జానర్లో తెరకెక్కిన టెర్రర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమా శివగంగ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఇన్ని సినిమాలు ఒకే సారి బరిలో దిగుతాయా లేక ఎవరైన వెనక్కు తగ్గుతారా చూడాలి. -
వైభవంగా ఉంటుంది!
నందినీరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, దామోదర్ ప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో తయారైన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పేరుకి తగ్గట్టుగానే ఈ చిత్రం అన్ని విధాలుగా వైభవంగా ఉంటుందని దర్శక-నిర్మాతలు నందినీరెడ్డి, దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దామోదర్ ప్రసాద్ మాట్లాడు తూ - ‘‘యువతలో ప్రేమ, పెళ్లి బంధాలపై ఉన్న అభిప్రాయాలను అందరికీ అర్థమయ్యేలా చూపించాం. కల్యాణి కోడూరి స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. చిత్రంపై మరిన్ని అంచనాలు పెరగడానికి ఆడియో విజయం ఓ కారణమైంది. ఈ చిత్రం హక్కులను అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసు కుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్ రెడ్డి.వి. -
'కళ్యాణ వైభోగమే' ట్రాక్ ఎక్కిస్తుందా..?
ఇండస్ట్రీలో సక్సెస్ సాధించటమే కాదు ఆ సక్సెస్‌ను కొనసాగించటం కూడా చాలా ముఖ్యంగా. తొలి సినిమాతోనే సంచలనాలు నమోదు చేసిన చాలా మంది ఆ సక్సెస్‌ను కొనసాగించలేక వెనకపడిపోతున్నారు. తొలి సినిమాతో ఆకట్టుకున్న నందినీ రెడ్డి, నాగశౌర్యలు, ఆ తరువాత ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయారు. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందినీ రెడ్డి, తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత సిద్ధార్ద్ హీరో తెరకెక్కించిన జబర్థస్త్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచింది నందిని. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య, ఆ తరువాత ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయాడు. మాస్ టర్న్ తీసుకొని చేసిన జాదుగాడు కూడా వర్క్ అవుట్ కాకపోవటంతో, తనకు హిట్ ఇచ్చిన రొమాంటిక్ జానర్నే మరోసారి నమ్ముకున్నాడు. నందినీ రెడ్డి, నాగశౌర్యలు కలిసి కళ్యాణ వైభోగమే సినిమా కోసం పనిచేశారు. ఇద్దరి కెరీర్‌కు ఈ సినిమా సక్సెస్ కీలకం కావటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం ఫేం మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ నెల మూడో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.