కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే! | Director Nandini Reddy Special Interview | Sakshi
Sakshi News home page

కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!

Published Wed, Mar 2 2016 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!

కళ్యాణవైభోగమేలో కోడి కూడా హీరోయినే!

 ‘అలా మొదలైంది’తో డెరైక్టర్ నందినీరెడ్డి పరిచయం చేసిన మలయాళీ నిత్యామీనన్ తెలుగులో ఫుల్ బిజీ. ఇప్పుడు మరో మలయాళీ మాళవికతో శ్రీరంజిత్ మూవీస్ వారికి ‘కళ్యాణవైభోగమే’ తీశారు నందిని. మా మాళవికలో శోభనని చూసుకుంటూ తీశానని నందిని, మా డెరైక్టర్ లవబుల్ ఫిల్మ్ తీశారని మాళవిక అంటున్నారు. వాళ్లిద్దరితో స్పెషల్ చాట్
 
 నందినీరెడ్డిగారూ! ‘కళ్యాణ వైభోగమే’ కథానాయిక కోసం వందలకొద్ది ఫొటోలు చూశారట. అందులో మాళవిక ఫొటోని కూడా చూసి తిరస్కరించారట?
 నందినీరెడ్డి: మాళవికా నాయర్ ఫొటోని చూశానా లేదా అనేది నాకు డౌటేనండీ. నాయిక పాత్ర కోసం 400 మంది అమ్మాయిల ఫొటోలు చూసింది నిజమే. ఎవరూ నచ్చలేదు. చివరికి ‘ఎవడే సుబ్రమణ్యం’ ఆడియో ఫంక్షన్‌లో మాళవిక ఎక్స్‌ప్రెషన్స్, ఫేస్‌లో అమాయకత్వం చూసి, ఎంచుకున్నా.
 
  మాళవికా! ఇదంతా మీరు నమ్ముతారా?
 మాళవిక: హాహాహా... దర్శకురాలు చెబుతున్నప్పుడు నమ్మాలి కదండీ. తనకి నేను నచ్చినా నేను ఈ సినిమా చేయకూడదనుకున్నా. ట్వల్త్ చదువు తున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వద్దనుకున్నా. కానీ నందిని కథ చెప్పాక నో చెప్పాలనిపించలేదు.
 
 నందినీగారూ! అందరూ మాళవికని చూసి నిత్యామీనన్‌లా ఉన్నారని చెబుతున్నారు?
 నందినీరెడ్డి: నిత్యకీ, మాళవికకీ మధ్య నాకైతే పోలికలేమీ కనిపించవు. మాళవికను చూసినప్పుడు నాకు శోభన గారు గుర్తుకొస్తారు. అయినా నిత్యలా ఉండాలనో, శోభనలా ఉందనో నేను మాళవికని ఎంపిక చేసుకోలేదండీ. ఒక యాక్టర్‌కి ముఖ్యమైనవి కళ్లు. తర్వాత నవ్వు చూస్తా. మాళవికలో ఆ రెండూ నచ్చాయి. అందుకే ఎంచుకున్నా.
 
 మాళవికగారూ! శోభనలాగా ఉన్నానని మీకెప్పుడైనా అనిపించిందా?
 మాళవిక: నన్నడిగితే నేనేం చెబుతానండీ(నవ్వుతూ). నేనైతే మా అమ్మానాన్నల పోలికలతో ఉంటాననుకుంటా.
 
 నందినీగారూ! ‘అలా మొదలైంది’ కీ,‘కళ్యాణ వైభోగమే’ కీ మధ్య పోలికలేమైనా? ఆ మేజిక్ మరోసారి రిపీటవుతుందా?
 నందినీరెడ్డి: స్టైల్ ఆఫ్ మేకింగ్ దగ్గరగానే ఉంటుంది. ‘కళ్యాణ వైభోగమే’లో అదనంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడవుతాయి. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి సీన్ మన ఇంట్లో జరుగుతున్న ఫీల్ కలిగిస్తుంటుంది.
 
 మాళవికా! మీరు ‘అలా మొదలైంది’ చూశారా?
 మాళవిక: ‘ఎవడే సుబ్రమణ్యం’ చేస్తున్నప్పుడే నాని చూడమని తన సినిమాలన్నీ ఇచ్చాడు. ‘అలా మొదలైంది’ అందులో ఉంది. మంచి సినిమా. కానీ ఆ సినిమా చూసినప్పుడైతే నేను నందినితో కలిసి పనిచేస్తానని అనుకోలేదు.
 
 నందినీగారూ! ‘జబర్‌దస్త్’ లాంటి ప్లాప్ తర్వాత తదుపరి మళ్లీ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనుకున్నారు?
 నందినీరెడ్డి: కొన్నాళ్లపాటు మైండ్ పనిచేయలేదు. బన్నీ ఒకరోజు ఫోన్ చేశాడు. ‘ఒకసారొచ్చి కలువు’ అన్నాడు. వెళ్లాక ‘ఏం చేస్తున్నావు’ అని అడిగాడు. ‘ఆర్నెల్లుగా ఇంట్లోనే ఉన్నా’ అన్నా. అప్పుడు క్లాస్ పీకాడు. అప్పుడే ‘జబర్ దస్త్’ ప్లేస్‌లో చేయాలనుకున్న కథ ఇదని ‘కళ్యాణ వైభోగమే’ కథ చెప్పా. బాగుందని ప్రోత్సహించాడు. స్వప్నాదత్‌కి కథ చెప్పా. నిర్మిస్తానంది. నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ గారు శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్‌లో చేద్దామన్నారు.
 
 మాళవికా! మీరు ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చూశారా?
 మాళవిక: చూశా. సినిమా చూస్తున్నప్పుడు కథ చెప్పినప్పటికంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఎక్జైట్ అయ్యా. బోలెడంత ప్రేమ, బోలెడంత ఫన్ కనిపిస్తుంది. ఇదివరకు నా కథలన్నీ మా నాన్నగారే వినేవారు, ఆయనే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇది నేను సెలక్ట్ చేసుకున్న తొలి కథ. ఇలాంటిది సెలెక్ట్ చేసుకున్నందుకు గర్విస్తున్నా.
 
 సినిమా షూటింగ్‌లోని సందడికి సంబంధించిన విషయాలేమైనా చెబుతారా?
 మాళవిక: షూటింగ్ కూడా వైభోగంగానే జరిగింది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంతమంది ఒకచోట కలిసేసరికి పెద్ద ఫ్యామిలీలాగా అయిపోయాం. పెళ్లి పాట సమయంలో బాగా ఎంజాయ్ చేశాం.
 
 ట్రైలర్లో నాగశౌర్య కోడికాళ్లు చూసి సెక్సీ లెగ్స్ అంటున్నాడు. ఏంటా కథ?
 మాళవిక: అది మీరు సినిమాలో చూస్తేనే తెలుస్తుంది.
 నందిని: మా సినిమాలో హీరోయిన్ మాళవిక మాత్రమే కాదండీ. కామాక్షి కూడా ఉంది. కామాక్షి ఓ కోడి పేరు. కామాక్షి, మాళవిక, నాగశౌర్యల మధ్య సాగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నమాట. అప్పటిదాకా వెజిటేరియన్ అయిన మాళవిక, కామాక్షిని చూసి ఏం చేసిందనేది సినిమాలోనే చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement