‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు | Special chat with Producers K L Damodar Prasad | Sakshi
Sakshi News home page

‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు

Published Wed, Mar 2 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు

‘కళ్యాణ వైభోగమే’కి అది ఆయువుపట్టు

 కథే హీరో అని నమ్ముతూ సినిమాలు తీసే కొద్దిమంది నిర్మాతల్లో కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దామూ) ఒకరు. ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు- ఆ తర్వాత’తో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న ఆయన తాజా ఫిల్మ్ ‘కళ్యాణ వైభోగమే’. నందినీరెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 4న రిలీజ్. దామూతో స్పెషల్ ఛాట్.
 
  పోస్టర్ నిండుగా, నటీనటులతో కళకళలాడుతోంది. ఇంత మంది క్యాస్టింగ్‌తో కూడిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ 40 రోజులు చిత్రీకరణ చేశారట?
 సినిమా షెడ్యూల్ నటీనటుల డేట్స్, కాంబినేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మేం ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళుతుంటాం.  మా హీరోయిన్ చదువు వలన 40 రోజుల షెడ్యూల్ పెట్టాల్సి వచ్చింది.
 
  నందినీరెడ్డి గత చిత్రం ప్లాప్. మళ్లీ ఆమెతో సినిమా అంటే రిస్క్ అనిపించలేదా?
 మా కాంబినేషన్‌లో ‘అలా మొదలైంది’ ఎంత పెద్ద సక్సెస్సో అందరికీ తెలుసు. మా ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నందిని ‘అలా మొదలైంది’ లాంటి సక్సెస్‌తో ఎంత నేర్చుకుందో, ఆ తర్వాత వచ్చిన ఫెయిల్యూర్‌తోనూ అంతే నేర్చుకుంది. ‘కళ్యాణవైభోగమే’ కథను ఆమె రాసుకున్న విధానం, నాకు చెప్పిన విధానం బాగా నచ్చాయి. కథపై తనకెంత స్పష్టత ఉందో... ఆ కథ విన్నాక నాలోనూ అంతే స్పష్టత ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా చేసేశా.
 
  మీరు మిగతా దర్శకులతోనూ కలిసి పనిచేశారు. వాళ్లతో పోలిస్తే, నందినిరెడ్డిలో మీకు కనిపించే డిఫరెన్స్?
 నందిని కమిట్‌మెంట్ ఉన్న దర్శకురాలు. నిజాయతీగా నచ్చిందే చేస్తుంది. నిర్మాతగా నేనెప్పుడైనా ‘ఇది కరెక్టు కాదేమో’ అని చెబితే ఆలోచించి దానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తుంటుంది. ఒకవేళ తాను అనుకున్నదే కరెక్టనుకుంటే నన్ను కూడా కన్విన్స్ చేస్తుంటుంది. అందు కోసమని నాతో వాదించడానికి కూడా రెడీ అవుతుంది. కళ్యాణ్ కోడూరి అంతే. అందుకే వీరిద్దరితోనూ నా ప్రయాణం సాగుతోంది.
 
  చిత్రీకరణలో మీరు టెన్షన్‌కి గురైన సందర్భం ఉందా?
 ‘కళ్యాణ వైభోగమే’ ప్రీ క్లైమాక్స్‌లో ఓ సీన్ చిత్రానికి ఆయువుపట్టు లాంటిది. పేపర్‌పైనున్న డైలాగ్ వర్షన్, ఆ సీన్స్ నాకు బాగా నచ్చాయి. మరి అవి అలాగే తెరపైకి వస్తాయో, రావో అన్న భయం ఉండేది. అందుకే ఆ సన్నివేశాలు పూర్తయ్యేవరకు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నా. మేం అనుకున్నట్టుగానే ఆ సన్నివేశాలు బాగా వచ్చాయి. నాకున్న ఒకే ఒక్క టెన్షన్ ఆరోజే తీరిపోయింది. ఇందులోని ప్రతి సీన్ రియలిస్టిక్‌గా ఉంటుంది.
 
  మీ సంస్థ నుంచి కుటుంబ కథాచిత్రాలే వస్తుంటాయెందుకు?
 ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు నన్ను. నాకు కూడా ఇలా ఒకే జానర్‌కి పరిమితం కావాలని లేదు. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ తీయాలనుంది. తీస్తాను కూడా. అయితే కుటుంబ కథలు మాత్రం అనుకోకుండానే నా దగ్గరికి వస్తుంటాయి. సుమారు 80 కథలు విన్నాక ‘అలా మొదలైంది’ కుదిరింది. ఆ తర్వాత 50 కథలు విన్నాక ‘అంతకు ముందు-ఆ తర్వాత’ చేశా. మరో 50 కథలు విన్నాక  ‘కళ్యాణ వైభోగమే’ చేశా.
 
  చిన్న సినిమాలు తీస్తే విడుదల సమయంలో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా?
 పెట్టే బడ్జెట్‌లో తక్కువ ఎక్కువలు ఉంటాయి కానీ... కథ విషయంలో కాదు. కథ బాగుంటే చిన్నదైనా పెద్దగానే కనిపిస్తుంది. అదే కథలో దమ్ము లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా వృథానే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం కంటే దాన్ని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళామన్నదే ముఖ్యం. చాలామంది పబ్లిసిటీ విషయంలో వెనకబడుతున్నారు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరమనే ది నా భావన.
 
  మీకు డ్రీమ్ ప్రాజెక్టుల్లాంటివేమైనా ఉన్నాయా?
 తీసే ప్రతి సినిమా డ్రీమ్ ప్రాజెక్టే. ప్రతి సినిమానూ తొలి సినిమాలాగే భావిస్తుంటా. ప్రతిసారీ కొత్తవిషయాలు     నేర్చుకుంటుంటా. వాటిని తదుపరి చిత్రానికి ఉపయోగిస్తా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement