కళ్యాణ వైభోగమే కథ చెప్పినప్పుడే ఈ రేంజ్ హిట్ ఊహించాను
‘‘సినిమా హిట్ అయితే ఆనందంగా ఉండాలి. కానీ, నాకు ఆనందంతో పాటు చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఇలాంటి విజయాలతో నాపై ఇంకా బాధ్యత పెరిగిందనిపిస్తోంది’’ అని హీరో నాగశౌర్య అంటున్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కేఎల్ దామోదర్‌ప్రసాద్ నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ ఈ నెల 4న విడుదలైంది. తాము ఊహించిన విధంగానే ఈ సినిమా ఘనవిజయం సాధించిందని నాగశౌర్య సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన మరిన్ని విశేషాలు...
♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమా కథ చెప్పినప్పుడే నేను ఈ రేంజ్ హిట్ ఊహించాను. కథలో ఉన్న కంటెంట్ అలాంటిది. నందినీ రెడ్డిగారు నాకు ఎంత బాగా చెప్పారో, అంతకన్నా పదిరెట్లు బాగా తీశారు. పబ్లిక్ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూశాను. ఆడియన్స్ ఈ సినిమాలోనికామెడీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ల రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది.
♦ షూటింగ్ సమయంలో ఓ రోజు నందినిగారిని ఏ టైటిల్ పెడుతున్నారని అడిగితే ‘కళ్యాణ వైభోగమే’ అని చెప్పారు. టైటిల్ వింటేనే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఈ సినిమాలో మాళవిక లాంటి డెడికేటెడ్ ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఓ మంచి అనుభూతి.
♦ ప్రేమ , పెళ్లి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పెళ్లికొడుకు గెటప్‌లో నన్ను చూసి చాలామంది రియల్ లైఫ్‌లో పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. కానీ, నా దృష్టిలో పెళ్లి అనేది పూర్వజన్మ సుకృతం. అదో ముఖ్యమైన ఘట్టం. ఒక అబ్బాయి, అమ్మాయి జీవితాలకు పెళ్లితోనే నిజమైన అర్థం వస్తుంది. నాకు గనక ఈ సినిమాలోలాగే ఎవరైనా అమ్మాయి నిజంగా నా మనసుకు నచ్చితే మా అమ్మకు పరిచయం చేస్తాను. కానీ, పెళ్లి మాత్రం అప్పుడే కాదు. ఇంకా రెండు, మూడేళ్లు ఆగమని చెబుతా.
♦ జనరల్‌గా ఏ సినిమా చేసినా హిట్టవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమా హిట్టయినందుకు నాకు ఆనందంగా ఉంది. అమ్మానాన్నల ఆనందానికి హద్దే లేదు. వాళ్లు ఈ సినిమా రిజల్ట్ గురించి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం అమ్మానాన్న హైదరాబాద్‌లో లేరు. కానీ, ఇక్కడే ఉన్నట్లే ఉంది. ఎందుకంటే, సినిమా విజయాన్ని షేర్ చేసుకోవడానికి వాళ్లకి కనీసం పదిసార్లకు పైనే ఫోన్ చేసుంటా.
♦ ‘కళ్యాణ వైభోగమే’ సినిమాకు ముందు నా కెరీర్ కాస్త డౌన్ అయిన మాట నిజమే. అయినా ఒక్కోసారి మన లెక్కలు తప్పుతూ ఉంటాయి. అది సహజం. అంత మాత్రాన డీలా పడిపోతే ముందుకు సాగలేం. అందుకే, అలాంటివి ఎదురు కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
♦ ఏ సినిమా అయినా ముందు నాకు కనెక్ట్ కావాలి. దర్శకుడు కథ చెప్పేటప్పుడే నేను నవ్వాలి, ఏడవాలి. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడే కథకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తా. అందుకే నా గత సినిమాల్లో నన్ను చూస్తే నేను కనబడను, నా పాత్ర మాత్రమే కనబడుతుంది.
♦ నేను హీరోగా, నాగబాబుగారి అమ్మాయి నిహారిక కథానాయికగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘ఒక్క మనసు’ సినిమా షూటింగ్ పూర్తయింది. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జో అచ్యుతానంద’ సినిమా చేస్తున్నా. ఇంకా మరికొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి.