ఇంకా నిర్ణయం తీసుకోలేదు
పనామా: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ప్రాంతీయ అంశాల నేపథ్యంలో తనకు క్యూబా నాయకుడు రవుల్ క్యాస్ట్రోకు మధ్య జరిగిన సమావేశం సఫలీకృతం అయిందని చెప్పారు. అర్థమంతమైన చర్చలు తమ మధ్య జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ, క్యూబాను ఒక సమస్యగా తాము భావించడం లేదని తెలిపారు.
ఇరు దేశాలమధ్య ప్రస్తుతం ఎలాంటి వైరుధ్యం లేదని, ప్రచ్ఛన్న యుద్ధం ఇక ముగిసినట్లేనని తెలిపారు. క్యూబాకు ఇచ్చే హోదాపై ఇప్పటికే తాము సమీక్ష నిర్వహించామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే జాబితానుంచి దానిని తొలగించే అంశంపై పరిశీలనలు పూర్తయ్యాయని అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని చెప్పారు. ఆయా శాఖల నుంచి అనుమతి రాగానే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. క్యూబాను ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే దేశాల జాబితాలో 1982లో చేర్చారు.