మరో నాలుగేళ్లు భరించలేం | USA Presidential Elections 2024: Former US President Barack Obama on Thursday criticized Donald Trump | Sakshi
Sakshi News home page

మరో నాలుగేళ్లు భరించలేం

Published Sat, Oct 12 2024 5:15 AM | Last Updated on Sat, Oct 12 2024 8:17 AM

USA Presidential Elections 2024: Former US President Barack Obama on Thursday criticized Donald Trump

ట్రంప్‌ అహంకారి, అసమర్థుడు, బడాయికోరు.. మనకు అవసరం లేదు 

మెరుగైన భవిష్యత్తు కావాలంటే కమలా హారిస్‌ను గెలిపించుకోవాలి 

పిట్స్‌బర్గ్‌ ఎన్నికల    ప్రచారంలో డెమొక్రటిక్‌ నేత బరాక్‌ ఒబామా పిలుపు 

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్‌ నాయకుడు బరాక్‌ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్‌ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్‌ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్‌ ఒబామా మాట్లాడారు. ట్రంప్‌ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్‌ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. 

జో బైడెన్‌ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్‌ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్‌ అభ్యర్థి కమలా హారిస్‌ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు.

 ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్‌ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు.

 ఒకవేళ డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్‌ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement