అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు.
ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే.
హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట
భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి.
ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు
కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం.
చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది.
జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే..
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్‌బుక్‌లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment