అమెరికా ఎన్నికల్లో భారీగా ఓటింగ్
కిక్కిరిసిన పోలింగ్ బూత్‌లు
కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ
తొలి ఫలితంలో చెరి సగం.. డిక్స్‌విల్లేలో చెరో 3 ఓట్లు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన ప్రచార ఘట్టానికి తెర పడింది. అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంల్లో నిక్షిప్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30) నుంచే పోలింగ్ బూత్‌ల ముందు జనం భారీగా బారులు తీరారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయానికి పోలింగ్ మొదలవుతుంది.
కనెక్టికట్, వ్యోమింగ్, ఇండియానా, కెంటకీ, మైన్ వంటి రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి; అరిజోనా, అయోవా, లూసియానా, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. దాంతో ఎవరు గెలుస్తార్నది రాజకీయ పండితుల అంచనాలకు కూడా అందడం లేదు. ఈసారి స్వింగ్ స్టేట్స్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలుపోటముల మధ్య తేడా అతి స్వల్పంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులిద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే కానుండటం విశేషం. హారిస్ నెగ్గితే అమెరికాలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టిస్తారు. నల్లజాతి, ఆసియా, భారత మూలాలున్న తొలి అధ్యక్షురాలు కూడా అవుతారు.
అదే ట్రంప్ గెలిస్తే గత 132 ఏళ్లలో ఒకసారి అధ్యక్షునిగా చేశాక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. ప్రచారం పొడవునా వారి మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు సాగడం తెలిసిందే. 16 కోట్ల పై చిలుకు ఓటర్లలో సగానికి సగం, అంటే దాదాపు 8 కోట్ల మంది ఈసారి ముందస్తు, పోస్టల్ తదితర పద్ధతుల్లో ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మంగళవారం సాయంత్రం ఆరింటికి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30కు) పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టినా తుది ఫలితం తేలడానికి కొద్ది రోజులు పట్టవచ్చు. అయితే విజేత ఎవరన్న దానిపై ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. దాంతో ఇక అందరి కళ్లూ ఫలితాలను తేల్చడంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి. మహిళల ఓటు కూడా ఈసారి కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.
అమెరికా చరిత్రలోనే కీలకమైన రోజు: ట్రంప్
మంగళవారాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా ట్రంప్ అభివరి్ణంచారు. ‘‘పోలింగ్ రోజు వచ్చేసింది! భారీ సంఖ్యలో వచ్చి ఓటేయండి’’ అంటూ లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులకు మంగళవారం ఆయన ఈ మెయిళ్లు పంపారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మలచుకుందాం. మీరు ఓటేయకుండానే వెనుదిరగాలని రాడికల్ కమ్యూనిస్టు డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. మనమంతా కలిసి వారి ఆశలను వమ్ము చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు.
జీవనవ్యయం తగ్గిస్తా: హారిస్
ప్రెసిడెంట్‌గా తన విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని హారిస్ పేర్కొన్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, వెన్ను విరిగిన వలసల విధానాన్ని సరిచేయడం తన తొలి ప్రాథమ్యాలని ప్రకటించారు. మంగళవారం ఆమె పిట్స్‌బర్గ్‌లో న్యూస్‌రేడియో మారి్నంగ్ షోలో పాల్గొన్నారు. ధరాభారానికి ముకుతాడు వేసేందుకు తనవద్ద ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఫ్లోరిడాలో ఓటేసిన ట్రంప్
ట్రంప్ ఫ్లోరిడాలో ఓటేశారు. మంగళవారం ఉదయం భార్య మెలానియాతో కలిసి తన నివాసం సమీపంలోని పామ్‌బీచ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హారిస్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన స్వస్థలం డెలావెర్‌లో కొద్ది రోజుల ముందే ఓటేశారు.
డిక్స్‌విల్ నాచ్‌లో తొలి ఫలితం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ బుల్లి కౌంటీలో ‘తొలి ఫలితం’ వచ్చేసింది. పోలింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే అక్కడ కౌంటింగ్ కూడా పూర్తవమే ఇందుకు కారణం. న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్ నాచ్‌లో కేవలం ఆరుగురు ఓటర్లే ఉన్నారు. అక్కడ 60 ఏళ్లుగా అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయముంది. దాని ప్రకారం మంగళవారం మొదలవుతూనే (సోమవారం అర్ధరాత్రి దాటగానే) పోలింగ్ మొదలైంది. ఆరుగురు ఓటర్లే ఉండటంతో కాసేపటికే పోలింగ్, ఆ వెంటనే కౌంటింగ్ కూడా ముగిశాయి. హోరాహోరీ పోరుకు అద్దం పట్టేలా హారిస్, ట్రంప్‌కు చెరో మూడు ఓట్లు పడటం విశేషం. కెనడా సరిహద్దు సమీపంలో ఉండే డిక్స్‌విల్‌కు అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చే ప్రదేశంగా పేరుంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి, మరికొన్నింట్లో 7, 8, 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment