- పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బాంబులు పేల్చేందుకు కావలసిన పేలుడు పదార్థాలను సమకూర్చిన ముగ్గురిని సోమవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో ఈ ముగ్గురికీ సంబంధం ఉందని పోలీసు ల విచారణలో తేలింది. ఇక్కడ బాంబులు పేల్చేందు కు కావాల్సిన పేలుడు సామగ్రిని ఈ ముగ్గురే సమకూర్చినట్లు కూడా గుర్తించారు.
2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతిచెందగా 131 మంది గాయపడిన సంగతి తెలి సిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఐదుగురు నిందితులను గుర్తించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హాది అలియాస్ తబ్రేజ్ అలియాస్ దానియాల్ అలియాస్ ఆసద్ (28), కర్ణాటకకు చెందిన మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప అలియాస్ యాసిన్ భక్తల్ అలియాస్ షుక్రూ(30)లను ఎన్‌ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఇక కర్ణాటకకు చెందిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ అలియాస్ ఇస్మాయిల్ షాబంద్రీ(38), పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అలియాస్ జావిద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నాబీల్ అహ్మద్(25), బిహార్‌కు చెందిన మహ్మద్ తహసీన్ అక్తర్ హసన్ అలియాస్ మోను(25) పరారీలో ఉన్నారు. వీరిపై ఎన్‌ఐఏ రివార్డు కూడా ప్రకటించింది.
తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బెంగళూరులో అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను విచారించేందుకు హైదరాబాద్ ఎన్‌ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఎన్‌ఐఏ బృందం.. పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.