Saddam Hussein
-
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది. -
‘రాహుల్ గాంధీ.. ఇరాక్ సద్దాం హుస్సేన్‌లా ఉన్నారు’
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేల పొలిటికల్ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అధికార బీజేపీ మరోసారి అధికారం కోసం సరికొత్త ప్రచారంతో ముందుకు సాగుతోంది. అటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు ప్లాన్స్ రచిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌తో పోల్చారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుల పద్ధతులు భారతీయ సంస్కృతికి దూరంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ ఇతరుల సంస్కృతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తారు అని వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరడానికి బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ డబ్బు చెల్లించిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక, అంతుకుముందు కూడా హిమంత.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌కు ఓటు వేసిన వ్యక్తులు త్వరలో బీజేపీలో చేరుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా గడ్డం పెంచుకున్నప్పుడు ఆయనపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే, మేము నిజమైన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాము. అసలు విషయాలను పక్కదారి పట్టించడం బీజేపీ నేతలకు మాములే అంటూ ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని అన్నారు. Rahul Gandhi looks like Saddam Hussein, says Assam CM Himanta Sarma#RahulGandhi #SaddamHussein #HimantaBiswaSarma #Congress #BJP #Gujarat #BharatJodoYatra https://t.co/u0Of4sOXXn — NewsDrum (@thenewsdrum) November 23, 2022 -
అమ్మకానికి సద్దాం హుస్సేన్ ఫోటో
వాషింగ్టన్: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇరాకీ నేత ఫోటోను ఓ అమెరికన్ ఈ కామర్స్ సైట్ అమ్మకానికి పెట్టింది. పైగా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. వివరాలు.. అమెరికాకు చెందిన ఈ కామర్స్ సైట్ ‘విష్’లో సద్దాం ఫోటోను అమ్మకానికి ఉంచింది. ధరను 20 డాలర్లుగా నిర్ణయించింది. పైగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. ‘అన్ని ప్రొడక్ట్స్‌పై 60-80శాతం డిస్కౌంట్ లభించనుంది’ అంటూ విష్ ప్రమోట్ చేసిన యాడ్‌లో సద్దాం హుస్సేన్ ఫోటో కూడా ఉంది. దానిపై రేటు 20 డాలర్లుగా నిర్ణయించబడింది. ఇది చూసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘సద్దాం హుస్సేన్‌ను ఎవరు కొనాలనుకుంటున్నారు.. అది కూడా కేవలం 20 డాలర్లకే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది సద్దాం ఫోటో కాపీ. అమెరికా సేనలకు పట్టుబడిన తర్వాత తీసిన సద్దాం ఫోటోను ప్రీమియం హెవీ స్టాక్ పేపర్లో రీప్రింట్ చేశారు. పైగా ‘దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్ కట్టించుకోవచ్చు’ అంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోది. Who wants to buy Saddam Hussein for $20? pic.twitter.com/4tTpgSRKLj — The State Of Selling (@StateOfSelling) August 27, 2020 1979 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడిన సంగతి తెలిసిందే. -
రెండున్నరేళ్ల తర్వాత చిక్కిన సద్దాం హుసైన్
సాక్షి, హైదరాబాద్: అస్సాం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్లో కీలక పాత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్ వాసి సద్దాం హుసైన్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2015లో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో రట్టు చేశారు. రూ.5,01,500 కరెన్సీతో వెళుతున్న హోసేన్‌ను పట్టుకున్నారు. అతని సహచరుడైన సద్దాం హుసైన్ అప్పటి నుంచీ వాంటెడ్‌గా మారాడు. ఈ కేసు డీఆర్ఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ ఎట్టకేలకు సద్దాం హుసైన్‌ను బుధవారం బెంగళూరులో పట్టుకుంది. నిందితుడిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై గురువారం విజయవాడకు తరలించింది. అస్సాం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుస్తుం ఈ రాకెట్ సూత్రధారి. కాగా హుసైన్ నుంచి రూ.26 వేల నకిలీ కరెన్సీ, రెండు రద్దైన రూ.1,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి తీసుకోవాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. -
ఇరాక్‌ను సద్దాంకే వదిలేయాల్సింది
ఆయన వల్లే ఇరాక్ ఐక్యత సాధ్యపడింది సీఐఏ అధికారి తాజా పుస్తకంలో సంచలన విషయాలు 2003లో ఇరాక్‌పై అమెరికా దండెత్తి ఉండాల్సింది కాదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇరాక్‌లో అమెరికా చేసిన యుద్ధం, ఆ తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణం. ఇది జాతుల సంఘర్షణకు దారితీసి ఇరాక్, సిరియాలను వెంటాడుతున్నదనే భావనతోనే అక్కడి విషయాల్లో తదుపరి జోక్యానికి ఒబామా సర్కారు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్‌ను విచారించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ అధికారి జాన్ నిక్సన్ ఈ నెలలో తీసుకొస్తున్న పుస్తకం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం వల్ల పదవీభ్రష్టుడైన సద్దాం హుస్సేన్ 2013 డిసెంబర్లో సంకీర్ణ సేనలకు చిక్కారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన సంవాదం, విచారణ విషయాలను తాజా పుస్తకంలో నిక్సన్ వివరించారు. ఇరాక్‌ను ఆక్రమించడం అప్పటి వాషింగ్టన్ నియోకన్జర్వేటివ్లు అనుకున్నంత సులభం కాదని సద్దాం అప్పుడే హెచ్చరించారని ఆయన తన పుస్తకంలో తెలిపారు. ఈ పుస్తకంలోని పలు వివరాలను టైమ్ మ్యాగజీన్ వెల్లడించింది. 'సద్దాంను నేను విచారించినప్పుడు.. 'మీరు విఫలం కాబోతున్నారు. ఇరాక్‌ను పాలించడం అంత సులభం కాదని మీరు తెలుసుకుంటారు' అని ఆయన అన్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అని నేను అడుగగా.. 'మీరు ఇరాక్‌లో ఎందుకు విఫలమవుతారంటే.. మీకు స్థానిక భాష, చరిత్ర తెలియదు. మీరు అరబ్ మనోగతాన్ని అర్థం చేసుకోలేరు' అని సద్దాం అన్నారు' అని నిక్సన్ వివరించారు. నిజానికి సద్దం చెప్పింది నిజమేనని, బహుళ జాతుల సమ్మేళనమైన ఇరాక్ మనుగడకు, సున్నీ ఉగ్రవాదం, షియాల ఆధిపత్యముండే బద్ధవిరోధి ఇరాన్‌ను ఎదుర్కోవడానికి ఆయనలాంటి నిరంకుశ శక్తిమంతుడు అవసరమని ఇప్పుడు అనిపిస్తోందని నిక్సన్ అభిప్రాయపడ్డారు. 'సద్దాం నాయకత్వ శైలి, క్రూరత్వం అతని పాలనలోని లోపాలుగా చెప్పవచ్చు. కానీ తన పరిపాలన పునాధికి ఎలాంటి ముప్పు వాటిల్లినా సద్దాం చాలా నిరంకుశంగా వ్యవహరించాడు. ప్రజాఉద్యమంతో, ప్రజాఅసంతృప్తితో తన ప్రభుత్వం కూలిపోతుందన్న భయమేలేని స్థితిలో ఆయన ప్రభుత్వాన్ని నడిపాడు' అని నిక్సన్ పేర్కొన్నాడు. సద్దాం హయాంలో క్రూరమైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విజయం సాధించే ప్రసక్తే లేదని, ప్రస్తుత షియా ప్రభుత్వ బలహీనత వల్లే ఇస్లామిక్ స్టేట్ ఇంత స్థాయికి రాగిలిందని అభిప్రాయపడ్డారు. సద్దాంలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. తాను ఉన్నంతకాలం ఇరాక్‌ను ఒక దేశంగా ఐక్యంగా కొనసాగించినందుకు ఆయనపై తనకు అపారమైన గౌరవం కలిగిందని నిక్సన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ విషయంలో ఎంత వాదన జరిగినా.. చివరకు తాను పేర్కొన్న విషయాన్ని అంగీకరించక తప్పదని, నిజానికి ఇరాక్‌ను నడిపించే బాధ్యతను సద్దాంకు వదిలేసి ఉంటే బాగుండేదని నిక్సన్ పేర్కొన్నారు. -
ఆయన రూపంలో సద్దాం బతికే ఉన్నాడా..!
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారన్నది ఎంత నిజమోగానీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు, ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్‌కు చాలా దగ్గరి పోలికలున్నాయి. రూపాలు వేరైనా ఇద్దరి అభిరుచులు, ఆలోచనా విధానాలు దాదాపు సేమ్ టు సేమ్ అంటే ఆశ్చర్యం కలగకమానదు. వయసు రీత్యా సద్దాంకు, ట్రంప్‌కు తొమ్మిదేళ్లు తేడా. అయితే చరిత్ర దృష్టికోణంలో ఈ ఇద్దరూ ఒకే తరం మనునషులు. వాళ్ల తరంలో డబ్బున్న మారాజులు ఎందరో ఉన్నా, కొత్తగా ఇంకొందరు కుబేరులు తయారవుతున్నా.. ఆడంబరాల విషయంలో మాత్రం ఈ ఇద్దరూ ఇద్దరే! ఉన్నది దాచుకోకుండా ‘షో మ్యాన్’ పోజు కొట్టడంలో ప్రసిద్ధులే! భూగోళంమీద విభిన్న ప్రాంతాల్లో పుట్టిన ఈ ఇద్దరికీ విలాసాలంటే మక్కువ ఎక్కువ. అతిథుల కోసం ఏర్పాటుచేసిన గెస్ట్ రూమ్‌ల నుంచి వ్యక్తిగత విశ్రాంతి పొందే బెడ్రూమ్ల దాకా, వారి రాజప్రసాదాల్లోని మెట్ల నిర్మాణం నుంచి తళుకులు విరజిమ్మే షాండ్లియార్ల ఏర్పాటుదాకా సద్దాం, ట్రంప్‌లు ఒకేలా ఆలోచించారు. న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, ఫ్లోరిడాల్లోని ట్రంప్ సౌధాలు.. బాగ్ధాద్, టిక్రిట్ల్లో సద్దాం నిర్మించి, నివసించిన భవంతులు చూడటానికి ఒకేలా ఉండటాన్ని గమనిస్తే.. ‘సై’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన‘నాలా ఇంకొకరు.. ఆలోచిస్తున్నారు.. ’ అనే పాట నిజమనిపిస్తుంది. దారుణ రీతిలో సద్దాం హుస్సేన్ శకం ముగిసిన తర్వాత, అంతవరకూ ఆయన బూటుకాలికింద నలిగిన ఉగ్రవాదం ఒక్కసారిగా జడలువిప్పింది. ప్రపంచానికి పెనుసవాళ్లు విసిరింది. అందుకే ‘సద్దాం బతికే ఉంటే ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లు కాకుండా మరోలా ఉండేది’అని చరిత్రకారులు అంటారు. ఆఖరికి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారంలో అదేమాట చెప్పాడు.. ‘ఇరాక్‌లో సద్దాం హుస్సేన్, లిబియాలో మొహమ్మద్ గడాఫీలు గనుక బతికే ఉంటే ఈ ప్రపంచం ఇకా బాగుండేది’అని! ‘నిజమే, సద్దాం చచ్చిపోయాడు. కానీ ఆయన అభిరుచులను, అలవాట్లను కొనసాగిస్తున్న డోనాల్డ్ ట్రంప్ రూపంలో సద్దాం ఇంకా బతికే ఉన్నాడు’ అని ఎవరైనా అంటే కాదనగలమా? 1. ఫ్లోరిడాలోని ట్రంప్ ‘మారాలొగో’ మ్యాన్షన్- ఇరాక్‌లోని సద్దాం వేసవి విడిది 2. ట్రంప్ ‘మారాలోగో’- టెక్రిట్లోని సద్దాం ప్యాలెస్ 3. న్యూజెన్సీలోని ‘ట్రంప్ తాజ్‌మహల్’ బెడ్రూమ్ - బాగ్ధాద్లోని ‘అల్ఫావ్ ప్యాలెస్’ పడకగది 4. ట్రంప్ తాజ్‌మహల్ క్యాసినో(న్యూజెర్సీ)- సద్దాం కీర్తికట్టడం అల్ షహీబ్(బగ్దాద్) 5. మారాలోగో భవంతిలో ‘అతిథి మర్యాద’ల ప్రదేశం- టెక్రిట్ ప్యాలెస్‌లో డైనింగ్ హాల్ 6. మారాలోగో, అల్ఫావ్ ప్యాలెస్‌లలో జిగేల్మంటోన్న షాండ్లియార్లు 7.అతిథుల కోసం.. 8.ఒకేలా ఆలోచించిన డోనాల్డ్ ట్రంప్- సద్దాం హుస్సేన్.. -
ఉగ్రవాదులకోసం సద్దాం కొంప కూల్చారు
బాగ్దాద్: మోసుల్ లోని సద్దాం హుస్సేన్ పాత నివాస విల్లాను బ్రిటన్ యుద్ధ విమానాలు కూల్చేశాయి. ఆ విల్లాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారని తెలుసుకొని జరిపిన వైమానిక దాడుల్లో అది పూర్తిగా ధ్వంసం అయినట్లు బ్రిటన్ రక్షణశాఖ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఉదయం రెండు రాయల్ ఎయిర్ ఫోర్స్ టైపూన్స్ మోసుల్ లోని ఈ ఉగ్రవాదులకు నిలయమైన సద్దాం ప్యాలెస్ ను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయని చెప్పారు. టైగ్రిస్ నదికి సమీపంలో ఈ ప్యాలెస్ ఉందని, ఇందులో విదేశాల నుంచి తీసుకొచ్చిన యువతకు ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నారని వారు వివరించారు. భారీ తీవ్రత ఉన్న బాంబులను యుద్ధ విమానాలు విజయవంతంగా జారవిడిచాయని వెల్లడించారు. -
సద్దాం హుసేన్ చేసిన మంచిపని తెలుసా?
వాషింగ్టన్: వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపుతున్న రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నకల ప్రచారంలో మరోసారి ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పేరును ప్రస్తావించారు. అమెరికాకు బద్దశత్రువైన సద్దాంను ట్రంప్ ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. సద్దాం తన పాలనలో ఉగ్రవాదులను ఏరివేశారని, ఇది మంచిపరిణామని అన్నారు. ‘సద్దాం హుసేన్ చెడు వ్యక్తి. నిజామా? ఆయన నిజంగా చెడు వ్యక్తే. అయితే ఆయన చేసిన మంచిపని గురించి మీకు తెలుసా? సద్దాం టెర్రరిస్టులను చంపించాడు. ఆయన అలా చేయడం చాలా మంచి పని. ఆ రోజు ఇరాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదానికి ఇరాక్ హార్వర్డ్ యూనివర్సిటీలాంటిది. ఎవరైనా ఉగ్రవాది కావాలనుకుంటే ఇరాక్ వెళ్లాలి. నిజమే కదా? ఇది చాలా బాధాకరం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ గతంలోనూ సద్దాం, ఇతర నియంతలను ప్రశంసించారు. సద్దాం, గడాపీ వంటి నియంతలు ఇప్పటికీ అధికారంలో ఉంటే వందం శాతంగా మెరుగ్గా ఉండేదని అన్నారు. కాగా ఇరాక్ అధ్యక్షుడిగా సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అమెరికా దళాలు దాడులు చేసి, పదవీచ్యుతుడిని చేశాయి. యుద్ధ కోర్టులో సద్దాంను విచారించి ఆయనకు ఉరిశిక్ష విధించారు. -
సద్దాం హుస్సేన్ చాలా మంచోడు: ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, టెర్రరిస్టులను చంపడంలో చాలా మంచివాడని అమెరికన్ అధ్యక్షబరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున ముందు వరుసలో ఉన్న ట్రంప్ వ్యాఖ్యనించారు. సద్దాం విషయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఓహియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మట్లాడుతూ... ఇరాక్, ఇరాన్ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడాయిల్ పై ఆధిపత్యం చెలాయించాలని ఒబామా యత్నించారని ట్రంప్ మండిపడ్డారు. అందులో భాగంగానే ఇరాక్ పైకి అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. 2003లో ఇరాక్ పై అమెరికా పాల్పడిన చర్యలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నియంత్రణ కోసం ప్రయత్నించవద్దని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ కారణాల వల్లే ఐఎస్ఎస్ ఉద్భవించిందంటూ ఆరోపించారు. సద్దాం హుస్సేన్ గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు మంచివాడని ఎవరు చెప్పారు, కేవలం టెర్రరిస్టులను చంపడంలోనే ఆయన చాలా మంచివాడని తాను పేర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇరాక్ లో టెర్రరిజం రావడానికి గతంలో ఒబామా తీసుకున్న చర్యలే అని చెప్పాడు. -
పన్నీరొకచోట... కన్నీరొకచోట!
ఆ నేడు 5 నవంబర్, 2006 ఇటు ఇరాక్, అటు అమెరికాలతో పాటు యావత్ ప్రపంచం సద్దాంపై వచ్చే తీర్పు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సద్దాంకు అనుకూలంగా ఒకవైపు, వ్యతిరేకంగా మరోవైపు ఎంతో చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో ‘తీర్పు’ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మానత్వాన్ని మంటగలిపాడు...’ అంటూ ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ సద్దాం హుసేన్‌కు 2006 నవంబర్ 5న మరణశిక్ష విధించింది. చీఫ్ జడ్జి రషీద్ అబ్దుల్ రెహమాన్ తన తీర్పును గట్టిగా చదివి వినిపించాడు. తీర్పునకు స్పందనగా... ‘‘లాంగ్ లివ్ ది పీపుల్. లాంగ్ లివ్ ది అరబ్ నేషన్’’ అంటూ గర్జించాడు సద్దాం. ‘‘గాడ్ ఈజ్ గ్రేట్’’ అనే వాక్యాన్ని పదే పదే వల్లెవేయసాగాడు. తీర్పును హర్షిస్తూ సద్దాం వ్యతిరేకులు ఇరాక్ వీధుల్లో పండగ చేసుకున్నారు. సద్దాం వీరాభిమానులు మాత్రం ‘వెన్నుముక లేని తీర్పు’, ‘సామ్రాజ్యవాద ప్రేరేపిత తీర్పు’ అని మండిపడ్డారు. భిన్నస్పందనల విషయం ఎలా ఉన్నప్పటికీ, ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చారిత్రక తీర్పుగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. తీర్పు వెలువడిన ముప్పై నాలుగు రోజులకు 2006 డిసెంబర్ 30న సద్దాంకు మరణశిక్ష విధించారు. -
'సద్దాం హుస్సేన్ ఉంటే ప్రపంచం బాగుండేది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ బతికుంటే ప్రస్తుత ప్రపంచం బాగుండేదన్నారు. సీఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' టాక్ షోలో ట్రంప్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్లపై ఘాటైన విమర్శలు చేశాడు. తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి ఒబామా, హిల్లరీ అనుసరించిన విధానాలే కారణమన్నారు. ఇరాక్‌లో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పాలనలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాగే లిబియాలో ప్రస్తుతం ఉన్న అరాచకాలు గఢాఫీ పాలనా కాలంలో లేవని అన్నారు. ఇరాక్, లిబియా, సిరియా దేశాల్లో ప్రజల తలలను నరికేస్తున్నారనీ, ఇరాక్ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే స్థలంగా మారిందని అన్నారు. నియంతల పాలనలో కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలు జరగలేదన్నారు. ఈ దేశాలలో ప్రజలు ఒబామా, హిల్లరీల విధానాలకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారన్నారు. అగ్రరాజ్యం చేతిలో 2003లో పదవీచ్యుతుడై, తన నియంతృత్వ పోకడలకు 2006లో ఉరిశిక్షకు గురైన సద్దాం హుస్సేన్, నాలుగు దశాబ్దాల పాటు నియంతృత్వ విధానాలతో లిబియాను పాలించి 2011లో హతమైన గఢాఫీల పాలన ఉంటే ప్రస్తుతం ప్రపంచం బాగుండేదన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు..తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి అగ్రరాజ్యమే కారణమనే సంకేతాలతో సంచలనం సృష్టిస్తున్నాయి. -
సద్దాం హుస్సేన్ సమాధిలో లేడా!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు, సైన్యానికి జరుగుతున్న పోరుతో ఇరాక్ అట్టుడికిపోతోంది. ఐఎస్ ఆక్రమిత టిక్రిట్ నగరంపై పట్టు సాధించేందుకు సైన్యం జరిపిన బాంబు దాడుల్లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సమాధి ధ్వంసమైంది. 2006లో ఉరితీత తర్వాత సద్దాం పార్థివదేహాన్ని ఆయన సొంత గ్రామం.. టిక్రిట్ నగరానికి దక్షిన ప్రాంతంలోఉన్న అల్ ఔజా గ్రామంలో ఖననం చేశారు. అనంతరం దానిని ఓ అద్భుత కట్టడంలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇది పూర్తిగా నేలమట్టమైంది. అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన వీడియో ఫుటేజిలో ఔజా గ్రామంలోని సద్దాం సమాధి ఫిల్లర్లు నేలకూలిన దృశ్యాలు పొందుపర్చారు. 48 గంటల్లో టిక్రిట్ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో నగరం రెండువైపుల నుంచి ఆదివారం ఇరాకీ సైన్యం చేసిన దాడులవల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కాగా సమాధి విధ్వంసం గత ఆగస్టులోనే జరిగిందని ఐఎస్ వాదిస్తోంది. ఈ వాదనలను సైన్యం తోసిపుచ్చింది. అయితే ఇలాంటి ఉపద్రవాన్ని ముందే ఊహించి టిక్రిట్లోని సమాధి నుంచి సద్దాం దేహాన్ని వేరొక ప్రాంతానికి తరలించినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన దేహం ఎక్కడన్నదనే విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకుతో ఇరాక్‌పై యుద్దం చేసిన ఆమెరికా.. 2003లో సద్దాం హుస్సేన్‌ను బందీగా పట్టుకుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు, కుర్దులను హత్యచేశారని ఆరోపిస్తూ ఇరాకీ ట్రిబ్యూనల్ 2006లో సద్దాంకు ఉరిశిక్షను ఖరారుచేసి, అమలుచేసింది. 2007 లో టిక్రిట్ పట్టణ శివార్లలోని ఓజా గ్రామంలోని సమాధిలో ఆయన దేహాన్ని ఖననం చేశారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో మలుపు
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ముగ్గురి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బాంబులు పేల్చేందుకు కావలసిన పేలుడు పదార్థాలను సమకూర్చిన ముగ్గురిని సోమవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో ఈ ముగ్గురికీ సంబంధం ఉందని పోలీసు ల విచారణలో తేలింది. ఇక్కడ బాంబులు పేల్చేందు కు కావాల్సిన పేలుడు సామగ్రిని ఈ ముగ్గురే సమకూర్చినట్లు కూడా గుర్తించారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతిచెందగా 131 మంది గాయపడిన సంగతి తెలి సిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదుగురు నిందితులను గుర్తించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హాది అలియాస్ తబ్రేజ్ అలియాస్ దానియాల్ అలియాస్ ఆసద్ (28), కర్ణాటకకు చెందిన మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప అలియాస్ యాసిన్ భక్తల్ అలియాస్ షుక్రూ(30)లను ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక కర్ణాటకకు చెందిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ అలియాస్ ఇస్మాయిల్ షాబంద్రీ(38), పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అలియాస్ జావిద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నాబీల్ అహ్మద్(25), బిహార్‌కు చెందిన మహ్మద్ తహసీన్ అక్తర్ హసన్ అలియాస్ మోను(25) పరారీలో ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బెంగళూరులో అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను విచారించేందుకు హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఎన్ఐఏ బృందం.. పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.