'సద్దాం హుస్సేన్ ఉంటే ప్రపంచం బాగుండేది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ బతికుంటే ప్రస్తుత ప్రపంచం బాగుండేదన్నారు. సీఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' టాక్ షోలో ట్రంప్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్లపై ఘాటైన విమర్శలు చేశాడు. తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి ఒబామా, హిల్లరీ అనుసరించిన విధానాలే కారణమన్నారు.
ఇరాక్లో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పాలనలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాగే లిబియాలో ప్రస్తుతం ఉన్న అరాచకాలు గఢాఫీ పాలనా కాలంలో లేవని అన్నారు. ఇరాక్, లిబియా, సిరియా దేశాల్లో ప్రజల తలలను నరికేస్తున్నారనీ, ఇరాక్ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే స్థలంగా మారిందని అన్నారు. నియంతల పాలనలో కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలు జరగలేదన్నారు. ఈ దేశాలలో ప్రజలు ఒబామా, హిల్లరీల విధానాలకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారన్నారు.
అగ్రరాజ్యం చేతిలో 2003లో పదవీచ్యుతుడై, తన నియంతృత్వ పోకడలకు 2006లో ఉరిశిక్షకు గురైన సద్దాం హుస్సేన్, నాలుగు దశాబ్దాల పాటు నియంతృత్వ విధానాలతో లిబియాను పాలించి 2011లో హతమైన గఢాఫీల పాలన ఉంటే ప్రస్తుతం ప్రపంచం బాగుండేదన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు..తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి అగ్రరాజ్యమే కారణమనే సంకేతాలతో సంచలనం సృష్టిస్తున్నాయి.