Muammar Gaddafi
-
లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు
కైరో: లిబియా నియంత, దివంగత గడాఫీ కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం వచ్చే నెల 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది. గఢాఫీ ప్రభుత్వంలో ఆయన 8 మంది కుమారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ముగ్గురు వివిధ ఘటనల్లో చనిపోయారు. -
'పుతిన్ కుమార్తెను కోడలు చేసుకోవాలనుకున్నారు'
ట్రిపోలి: లిబియా మాజీ నియంత ముమ్మార్ గడాఫీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఆయన మాజీ సలహాదారు మహ్మద్ అబ్దుల్ ఈల్ మొతలెబ్ ఆల్-హౌని వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో వియ్యం అందుకోవాలని గడాఫీ ప్రయత్నించారని తెలిపారు. 'పొలిటికల్ మ్యారేజీ'తో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని ఆయన యత్నించారని పేర్కొన్నారు. తన రెండో కుమారుడు సయీఫ్ అల్ ఇస్లామ్ కు పుతిన్ కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్లిచేయాలని భావించారు. తన కుమారుడితో పుతిన్ కుమార్తెతో వివాహం జరిపిస్తే రష్యా, లిబియా మధ్య సంబంధాలు పటిష్టమవుతాయన్న భావనతో పుతిన్ ను గడాఫీ సంప్రదింపులు జరిపారని చెప్పారు. 'తన కుమారుడిని అల్లుడిని చేసుకోవాలని పుతిన్ గడాఫీ కోరారు. ఆయనతో వియ్యం అందుకునేందుకు పుతిన్ వెనకడుగు వేశారు. సయీఫ్ అల్ ఇస్లామ్ గురించి తమ కుమార్తెలకు ఏమీ తెలియదని పుతిన్ తప్పించుకున్నారు' అని ఆల్-హౌని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలు లిబియాను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన గడాఫీ 2011, అక్టోబర్ లో తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యారు. ఆయన కుమారుడు సయీఫ్ అల్ ఇస్లామ్ కు ట్రిపోలి కోర్టు ఈ ఏడాది జూలైలో మరణదండన విధించింది. -
'సద్దాం హుస్సేన్ ఉంటే ప్రపంచం బాగుండేది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ బతికుంటే ప్రస్తుత ప్రపంచం బాగుండేదన్నారు. సీఎన్ఎన్ ఛానల్ నిర్వహించిన 'స్టేట్ ఆఫ్ ద యూనియన్' టాక్ షోలో ట్రంప్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్లపై ఘాటైన విమర్శలు చేశాడు. తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి ఒబామా, హిల్లరీ అనుసరించిన విధానాలే కారణమన్నారు. ఇరాక్లో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పాలనలో కంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అలాగే లిబియాలో ప్రస్తుతం ఉన్న అరాచకాలు గఢాఫీ పాలనా కాలంలో లేవని అన్నారు. ఇరాక్, లిబియా, సిరియా దేశాల్లో ప్రజల తలలను నరికేస్తున్నారనీ, ఇరాక్ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే స్థలంగా మారిందని అన్నారు. నియంతల పాలనలో కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలు జరగలేదన్నారు. ఈ దేశాలలో ప్రజలు ఒబామా, హిల్లరీల విధానాలకు వ్యతిరేకంగా రగిలిపోతున్నారన్నారు. అగ్రరాజ్యం చేతిలో 2003లో పదవీచ్యుతుడై, తన నియంతృత్వ పోకడలకు 2006లో ఉరిశిక్షకు గురైన సద్దాం హుస్సేన్, నాలుగు దశాబ్దాల పాటు నియంతృత్వ విధానాలతో లిబియాను పాలించి 2011లో హతమైన గఢాఫీల పాలన ఉంటే ప్రస్తుతం ప్రపంచం బాగుండేదన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు..తూర్పు మధ్య దేశాలలో ప్రస్తుత అశాంతికి అగ్రరాజ్యమే కారణమనే సంకేతాలతో సంచలనం సృష్టిస్తున్నాయి.