
కైరో: లిబియా నియంత, దివంగత గడాఫీ కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం వచ్చే నెల 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది. గఢాఫీ ప్రభుత్వంలో ఆయన 8 మంది కుమారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ముగ్గురు వివిధ ఘటనల్లో చనిపోయారు.