
సాక్షి, అమరావతి: పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామానే నడిచింది. పెద్దిరెడ్డిని, ఆయనతో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలను అధికారులు 2 గంటలపాటు ఎదురుచూసేలా చేశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. దీంతో నామినేషన్ పత్రాలతో వైఎస్సార్‌సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో ఎదురు చూడసాగారు. సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. నామినేషన్ ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో.. విషయం తెలిసి బొత్స అక్కడికి వచ్చారు.
‘‘సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా?’’ అంటూ అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్‌పై మండిపడ్డారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు.. అటువైపు రావడం బొత్స గమనించారు. అచ్చెన్నను ఆపి అధికారుల తీరు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్న.. అధికారులతో తాను మాట్లాడతానని చెప్పి వెళ్లిపోయారు.
కాసేపటికే అధికారులు వచ్చి.. పెద్దిరెడ్డి నామినేషన్ స్వీకరించారు. ఈ నామినేషన్‌ను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment