నమీబియాకు తొలి అధ్యక్షురాలు  | Namibia elects first female president, Netumbo Nandi-Ndaitwah | Sakshi
Sakshi News home page

నమీబియాకు తొలి అధ్యక్షురాలు 

Published Thu, Dec 5 2024 4:55 AM | Last Updated on Thu, Dec 5 2024 4:55 AM

Namibia elects first female president, Netumbo Nandi-Ndaitwah

నెటుంబో నండీ ఎండైట్వా రికార్డు 

నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్‌ అసెంబ్లీకి విడిగా ఓటింగ్‌ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. 

శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్‌ పేట్రియాట్స్‌ ఫర్‌ ఛేంజ్‌ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. 

నిష్కళంక నేత 
ఎన్‌ఎన్‌ఎన్‌ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్‌ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. 

బలమైన గ్రామీణ మూలాలతో 
30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement