Gaddafi
-
ఈ లిబియాకు ఏమైంది? వెన్నాడుతున్న గడాఫీ అరాచకాలే కారణమా?
ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో ‘డేనియల్’ తుఫాను సంభవించిన తర్వాత ముంచెత్తిన వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. లిబియా ఒక చిన్న దేశం. అయితే అనునిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ దేశం అక్కడి గత నియంత ముఅమ్మర్ అల్ గడాఫీ కారణంగా చర్చల్లో నిలిచింది. అలాగే సమృద్ధిగా ఉన్న చమురు సంపద కారణంగానూ పేరొందింది. గడాఫీ హత్య తర్వాత అంతర్యుద్ధం 2011, అక్టోబర్ 20న గడాఫీ హత్య తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. దీని తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇక్కడకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు దర్నా నగరాన్ని తాకిన వరద సర్వం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. లిబియా విధ్వంసం కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మొదలైన గడాఫీ శకం గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పాలించాడు. ‘బ్రిటన్ రాణి 50 ఏళ్లు, థాయ్‌లాండ్ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను’ అని గడాఫీ తరచూ అంటుండేవాడు. గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని సిర్టే నగరంలో జన్మించాడు. 1961లో బెంఘాజీలోని మిలిటరీ కాలేజీలో చేరాడు. శిక్షణ పూర్తయిన తర్వాత లిబియా సైన్యంలో చేరాడు. అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. గడాఫీ సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతులేని గడాఫీ అరాచకాలు గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని గడాఫీ ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుండి బహిష్కరించాడు. లిబియా ఆర్థిక వ్యవస్థ పతనం ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణంగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతనిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది. సిర్టేలో గడాఫీ హతం అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్‌పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి, ట్రిపోలీలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యూఎన్ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011, జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011, అక్టోబరు 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు. చెలరేగిపోయిన లిబియా నేషనల్ ఆర్మీ గడాఫీ మరణానంతరం ఐక్యరాజ్యసమితి ‘నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టీఎన్సీ)’ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా ప్రకటించింది. టీఎన్సీ 2012లో జనరల్ నేషనల్ కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించింది. దీని తరువాత లిబియాలోని టోబ్రూక్ డిప్యూటీస్ కౌన్సిల్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. కాగా 2014 నుండి జనరల్ హఫ్తార్‌కు చెందిన ‘లిబియన్ నేషనల్ ఆర్మీ’ లిబియాలో తన ప్రభావాన్ని పెంచుకుంది. 2016లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో లిబియాలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొన్ని లిబియా గ్రూపులు దానిని అంగీకరించడానికి నిరాకరించాయి. ఇంతలోనే లిబియా రాజధాని ట్రిపోలీని స్వాధీనం చేసుకునేందుకు లిబియా నేషనల్ ఆర్మీ.. విమానాశ్రయంపై దాడి చేసింది. జనరల్ హఫ్తార్ తన సైన్యాన్ని ట్రిపోలీపై దాడి చేయాలని ఆదేశించాడు. ఈ విధంగా అతని సైన్యం..ఇతర సమూహాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతం గడాఫీ మరణానంతరం ప్రారంభమైన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఈ దేశంలోకి ప్రవేశించింది. రాజధాని ట్రిపోలీకి తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న సిర్టే నగరంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఊచకోతలకు పాల్పడింది. అయితే 2022లో అక్టోబర్‌లో ఖలీఫా హిఫ్తార్ దళాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించాయి. తాజా వరదల్లో వేలాదిమంది మృతి తాజాగా లిబియాలోని దర్నాను తాకిన సునామీ తరహా వరద నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ట్రిపోలీలో సంభవించిన వరదల్లో 2,300 మంది మరణించారని చెబుతున్నారు. దర్నాతో సహా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంబంధిత అధికారులు 5,300కు మించిన మృతదేహాలను వెలికితీశాని సమాచారం. కాగా వరదల్లో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? -
లిబియా అధ్యక్ష బరిలో గడాఫీ కుమారుడు
కైరో: లిబియా నియంత, దివంగత గడాఫీ కుమారుడు సయీఫ్ అల్ ఇస్లాం అదేశ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సయీఫ్ అల్ ఇస్లాం వచ్చే నెల 24న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసినట్లు లిబియా ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దాదాపు 40 ఏళ్లపాటు లిబియాను పాలించిన గడాఫీ 2011లో తలెత్తిన తిరుగుబాటులో హతమైన విషయం తెలిసిందే. అనంతరం ఆ దేశం ప్రత్యర్థి వర్గాల హింసాత్మక చర్యలతో అట్టుడుకుతోంది. రాజధాని ట్రిపోలీలో ఒక ప్రభుత్వం, తూర్పు ప్రాంతంలో మరో ప్రభుత్వం కొనసాగుతోంది. గఢాఫీ ప్రభుత్వంలో ఆయన 8 మంది కుమారులు కీలకంగా వ్యవహరించారు. వారిలో ముగ్గురు వివిధ ఘటనల్లో చనిపోయారు. -
వైరల్: ఆ నియంతతో టాప్ హీరోయిన్ ఫొటో!
ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. కానీ, ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టకముందు మోడలింగ్ రంగంలో కొనసాగారు. మోడల్‌గా ఆమె గతంలో దిగిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వెలుగులోకి రావడం పరిపాటే. కానీ ఆమె గతంలో దిగిన ఓ ఫొటో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తున్నది. కారణం ఆమెతోపాటు ఆ ఫొటోలో ఉన్నది ఒక కరుడుగట్టిన నియంత. లిబియాకు చెందిన నియంతృత్వ పాలకుడు మౌమ్మర్ గడాఫీతో కత్రినా కైఫ్ గతంలో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫొటోలో కత్రినతోపాటు సినీ నటులు నేహా ధూపియా, ఆదితి గొవిత్రికర్, అంచల్ కుమార్ తదితరులు ఉన్నారు. గతంలో లిబియాలో ఫ్యాషన్ షోలో పాల్గొన్న సందర్భంగా తీసిన ఈ ఫొటోను మోడల్ షమితా సింఘా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'లిబియాలో మనం ఫాషన్ షోలో పాల్గొని దాదాపు 15 ఏళ్లు పూర్తవుతున్నది. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం దక్కింది. ఈ పర్యటన గుర్తున్నాదా' అంటూ ఆమె కామెంట్ చేసింది. -
నయీమ్ చుట్టూ ‘గడాఫీ’ సైన్యం!
* ఆడవాళ్లే రక్షణ కవచాలు.. డెన్ల రక్షణ బాధ్యతలూ వారికే * ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో లిబియాకు నియంత గడాఫీని మించిపోయాడు. గడాఫీ తరహాలో తనకు రక్షణ కవచంగా మహిళలను, యువతులను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆయుధాల వినియోగంలోనూ శిక్షణ ఇప్పించాడు. అవసరమైన సందర్భాల్లో వారిని ‘ఎర’లుగానూ వినియోగించుకున్నాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు మహిళల విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నయీమ్ ఇంట్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఫర్హానా వంట మనిషిగా పనిచేస్తోంది. అదే పట్టణానికి చెందిన అమీర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య అఫ్సానా అలియాస్ ఇన్షియాద్ నయీమ్ ఇంట్లోనే ఉండేది. వారిద్దరూ నయీమ్‌కు నమ్మినబంట్లు కావడంతో సెల్ఫ్ డిఫెన్స్, తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చాడు. వారికి అత్యాధునిక పిస్టళ్లు, తూటాలు అందజేసి.. భార్య, పిల్లలతో పాటు ఇంటి వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించాడు. ఆయుధాలతో పాటు స్థలాల డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, నగదును కూడా వారి సమక్షంలోనే ఇంట్లోనే దాచేవాడు. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు దాడి చేసిన సమయంలో ఫర్హానా, అఫ్సానా పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. హ్యాండ్ బ్యాగుల్లో పిస్టళ్లు, తూటాలు దొరికాయి. ఆశ్రయం కల్పిస్తామని తీసుకువచ్చి.. నయీమ్ నల్లగొండ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి ఆడపిల్లల్ని డబ్బు చెల్లించి తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితో పాటు చిన్న వయసులోనే భర్త చనిపోయిన, అనాథలుగా మారిన వారిని కూడా ఆశ్రయం కల్పిస్తామంటూ తీసుకువచ్చి కొందరు బంధువులు నయీమ్‌కు అప్పగిస్తున్నారని తెలిసింది. సోమవారం నయీమ్ ఇంట్లో పట్టుబడిన ఐదుగురు ఆడపిల్లలూ ఇలానే అక్కడికి చేరి ఉంటారని భావిస్తున్నారు. సెటిల్మెంట్ల కోసంగానీ, మరెక్కడికైనాగానీ వెళ్లేటపుడు మహిళలు, యువతులను తీసుకెళ్లేవాడు. అలాగైతే ఎవరో కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్నట్లు పోలీసులు భావిస్తారని.. తనిఖీలు చేయడానికి వెనకడుగు వేస్తారనే నయీం వ్యూహం. అంతేగాకుండా టార్గెట్ చేసిన వారిని ఆకర్షించడం కోసం యువతుల్ని ఎరగా వేస్తాడని పోలీసులు చెబుతున్నారు. ఇక అల్కాపురిలోని ఇంట్లో ఉన్న వంట గదుల్లో వంట చేసిన ఆనవాళ్లేమీ లేవని పోలీసులు చెబుతున్నారు. నిత్యం హోటళ్ళ నుంచి తెచ్చుకుని తినేవారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను రక్షణ కోసమే వినియోగించారని పేర్కొంటున్నారు. -
అది నా అతిపెద్ద తప్పిదం: ఒబామా
వాషింగ్టన్: లిబియా నియంత పాలకుడు గడాఫీని 2011లో గద్దె దించాక ఆ దేశంలో తలెత్తిన అనిశ్చితిని అంచనా వేయడంలో విఫలమవడం తన అతిపెద్ద తప్పిదమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈ పరిణామాలను ముందే ఊహించి అందుకు తగిన చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు. గడాఫీ హత్యానంతరం లిబియాలో మిలీషియా దళాలు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఐసిస్ ఉగ్రవాద సంస్థ పట్టుబిగించిన నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. వార్తాచానల్ ఫాక్స్‌న్యూస్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. -
విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది. లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది. అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు.