విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది.
లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది.
అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు.