సద్దాం హుస్సేన్ చాలా మంచోడు: ట్రంప్
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, టెర్రరిస్టులను చంపడంలో చాలా మంచివాడని అమెరికన్ అధ్యక్షబరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున ముందు వరుసలో ఉన్న ట్రంప్ వ్యాఖ్యనించారు. సద్దాం విషయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఓహియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మట్లాడుతూ... ఇరాక్, ఇరాన్ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడాయిల్ పై ఆధిపత్యం చెలాయించాలని ఒబామా యత్నించారని ట్రంప్ మండిపడ్డారు. అందులో భాగంగానే ఇరాక్ పైకి అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు.
2003లో ఇరాక్ పై అమెరికా పాల్పడిన చర్యలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నియంత్రణ కోసం ప్రయత్నించవద్దని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ కారణాల వల్లే ఐఎస్ఎస్ ఉద్భవించిందంటూ ఆరోపించారు. సద్దాం హుస్సేన్ గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు మంచివాడని ఎవరు చెప్పారు, కేవలం టెర్రరిస్టులను చంపడంలోనే ఆయన చాలా మంచివాడని తాను పేర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇరాక్ లో టెర్రరిజం రావడానికి గతంలో ఒబామా తీసుకున్న చర్యలే అని చెప్పాడు.