ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి.
ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు.
ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment