హైదరాబాద్: అనుమానం పెనుభూతమైంది. ప్రేమికుడు ఉన్మాదిలా మారాడు. ప్రేమికురాలిపై కక్ష గట్టాడు. నమ్మించి గొంతుకోశాడు. తానూ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రేమికురాలు ప్రాణాపాయస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేమూరి ఆనంద్‌బాబు, కమలకుమారి దంపతులు కొంతకాలంగా బడంగ్‌పేటలో నివసిస్తున్నారు. వీరి కూతురు మనస్వి(22) బీటెక్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పోటీ పరీక్షకు శిక్షణ పొందింది. నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేటకు చెందిన జానా జనార్దన్ కుమారుడు వెంకటేశ్(23)తో అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు.
ఉదయమే నగరానికి వచ్చి...
నెల్లూరు నుంచి ఉదయమే నగరానికి వచ్చిన వెంకటేశ్ ఓ యాప్ ద్వారా బృందావన్‌లో గది బుక్ చేశాడు. 10 గంటలకు రూంలో దిగి మనస్వికి ఫోన్ చేసి రప్పించాడు. 11.30 గంటల ప్రాంతంలో మనస్వి హోటల్‌కు చేరుకుంది. వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటూ కొంతకాలంగా తనను నిర్ల క్ష్యం చేస్తోందని మనస్విపై వెంకటేశ్ కోపం పెంచుకున్నాడు. హోటల్ గదిలో ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంట తెచ్చుకున్న కూరగాయల కత్తితో మనస్వి గొంతు కోసి, తన రెండు చేతులను కోసుకున్నాడు. హోటల్‌కు వచ్చిన కొద్దిసేపటికే మనస్వి తన సోదరుడు శ్రీతేజకు ఫోన్ చేసి బృందావన్ హోటలో ఉన్నానని, తనపై దాడి జరుగుతోందని చెప్పింది. ఫోన్‌లో ఆమె కేకలు కూడా వినిపించాయి. శ్రీతేజ, తల్లి కమలకుమారి హుటాహుటిన బైక్‌పై బయలుదేరారు. మొబైల్‌లో గూగుల్ నావిగేషన్(మ్యాప్) సహాయంతో హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ సిబ్బందితో కలసి రూంలోకి వెళ్లి చూడగా ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. బెడ్, గది అంతా రక్తసిక్తమైంది. మెడ కోసి ఉండటంతో తీవ్రంగా గాయపడ్డ మనస్విని వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. చేతిపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్‌ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పథకం ప్రకారమే...
సంఘటనాస్థలంలో దొరికిన చాకుతోపాటు వెంకటేశ్ బ్యాగ్‌లో మరో రెండు చాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి పథకం ప్రకారమే మనస్విపై దాడి చేసేందుకు వెంకటేశ్ వచ్చినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని ఎల్‌బీనగర్ ఏసీపీ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. ఆమె వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటూ తనను నిర్లక్ష్యం చేస్తోందని వెంకటేశ్ కక్ష గట్టి దాడికి పాల్పడి ఉండ వచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వెంటిలేటర్‌పై మనస్వి...
మనస్వి కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెడ గాయానికి ఆపరేషన్ చేసినట్లు ఆసుప్రతి వైద్యులు శ్రీకర్ తెలిపారు. మనస్వి చేతివేళ్లు కూడా తెగాయని, రక్తం ఎక్కువగా పోయిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మనస్వి పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.
ఆ రూమే కావాలి...
దిల్‌సుఖ్‌నగర్ వచ్చిన వెంకటేశ్ ముందుగా ఓయో యాప్‌లో బుక్ చేసిన రూం కాకుండా 501 రూం కావాలని బృందావన్ హోటల్ సిబ్బందిని అడిగినట్లు సమాచారం. కుదరదన్నా పట్టుపట్టి అదే రూం కావాలని కోరాడు. దీంతో సిబ్బంది తప్పని పరిస్థితిలో వెంకటేశ్‌కు ఆ రూం కేటాయించారు. ఫ్లోర్‌లో 501 రూం చివరిగా ఉండటం, గొడవ జరిగినా ఎవరూ పసిగట్టలేరని భావించి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని బట్టి మనస్విని అంతమొందించాలని పథకం ప్రకారమే రప్పించినట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment