ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన! | Wife Extra Marital Affair Busted By Husband | Sakshi
Sakshi News home page

ఆమె-ఆయన.. మధ్యలో ఇంకో ఆయన!

Published Wed, Nov 27 2019 2:22 PM | Last Updated on Wed, Nov 27 2019 2:41 PM

Wife Extra Marital Affair Busted By Husband - Sakshi

భార్యా భర్తల బంధం.. నమ్మకం, విశ్వాసం అనే పునాదులపై ఆధారపడి కొనసాగుతుంది. ఆ పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు ఎవర్ని మోసం చేసినా.. సంసారం చెదిరిపోతుంది. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలతో అసలు బంధాలను దూరం చేసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్­లో ఫ్యామిలీ కోర్టులకు వచ్చే మెజారిటీ కేసుల వెనుక వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటన దిల్ సుఖ్ నగర్­లో వెలుగు చూసింది. భార్య చేస్తున్న మోసాన్ని బయటపెట్టేందుకు భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి అర్థరాత్రి సమయంలో పోలీసులతో సహా భార్య ముందు ఎంట్రీ ఇచ్చాడు. అలా ఎంట్రీ ఇచ్చిన అతనికి మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది.

తేదీ- నవంబర్ 22
సమయం- అర్థరాత్రి 12 గంటల తర్వాత
స్థలం- దిల్ సుఖ్ నగర్­లోని వాసవీ కాలనీ
పోలీసులు ఓ అపార్ట్­మెంట్­లోకి దూసుకెళ్లారు
ఓ ఫ్లాట్ ముందు నిలబడి తలుపులు కొట్టారు
చాలాసేపు తలుపులు తెరుచుకోలేదు
చివరికి ఓ మహిళ తలుపు తీసింది..
పోలీసుల్ని చూసి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూసింది..
ఆ ఖాకీల వెనుక నిలబడి తననే చూస్తున్న వ్యక్తి ఎవరా అని చూసి నిర్ఘాంతపోయింది
ఆ వ్యక్తి ఎవరో కాదు ఆమె భర్త
భర్తను చూసి ఆ భార్య ఎందుకు షాక్ తినాలి..?
ఎందుకంటే అతను హైదరాబాద్‌లో లేడు ఆస్ట్రేలియాలో ఉంటాడు
అక్కడి నుంచి ఎప్పుడొచ్చాడో ఆమెకు తెలియదు..
ఇంటికి ఎందుకు రాలేదో కూడా తెలియదు
నేరుగా పోలీసులతో వచ్చాక మాత్రమే ఆమెకు అతను ముందుగా ఇంటికి ఎందుకు రాలేదన్న విషయం అర్థమైంది.
తన విషయం భర్తకు పూర్తిగా తెలిసిపోయిన సంగతి కూడా ఆ క్షణంలోనే గ్రహింపులోకి వచ్చింది
ఆ తర్వాత ఆమె అదరలేదు. బెదరలేదు. తన గుమ్మం ముందు నిలబడ్డ పోలీసులు ఇంట్లోకి వెళ్తోంటే అలా చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ కాస్త ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పుకోవాలి.

పదేళ్ల క్రితం పెళ్లి.. హాయిగా కాపురం
పోలీసులతోపాటు వచ్చిన వ్యక్తి పేరు సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డికి పదేళ్ల క్రితం సూర్యాపేటకు చెందిన సమతతో పెళ్లైంది. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కాపురం కొన్నేళ్లపాటు హాయిగానే సాగింది. ఇంకా చెప్పాలంటే ఆమె.. పోలీసులతోపాటు తన భర్తను చూసిన ముందు క్షణందాకా కూడా బయటి ప్రపంచం దృష్టిలో వీళ్లది అన్యోన్య దాంపత్యమే. సంతోష్ రెడ్డి-సమత దంపతులకు ఇద్దరు చూడముచ్చటైన పిల్లలున్నారు. కొన్నేళ్ల క్రితం పైచదువుల కోసం సంతోష్‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. భార్యాపిల్లలకు తోడుగా తన తల్లిని ఇంట్లోనే ఉంచి.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లారు. ఏడాదికి ఓసారి వచ్చి నెల రోజులపాటు కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లేవారు. అయితే, భార్యను కూడా తనతోపాటు ఓసారి ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని సంతోష్ చాలా సార్లు అనుకున్నారు. ఇదే విషయం భార్యకు పదే పదే చెప్పారు కూడా.. నువ్వూ ఆస్ట్రేలియా రావచ్చు కదా.. కొన్నాళ్ల పాటు మొత్తం తిరిగి వద్దాం అంటూ ఎన్నో సార్లు చెప్పారు. ఎందుకో ఆమె ఒప్పుకునేది కాదు. పాస్ట్ పోర్టు సమస్యలున్నాయని చెప్పి తప్పించుకునేది. అప్పుడు కూడా సంతోష్ తన భార్యకు ఇల్లు వదిలి బయటికి రావడం ఇష్టం ఉండదనీ, తనను డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేకనే అలా చెప్తోందనీ అనుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చేవి. మీ అమ్మను ఎంతమాత్రం భరించలేనని తరచూ భార్య నుంచి కంప్లైంట్. ఏడుపులు. పెడబొబ్బలు.. ఆ గొడవలు పెరిగిపోయి.. చివరికి కోడలితో పడలేనంటూ సంతోష్ రెడ్డి తల్లి తన ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఆస్ట్రేలియా రమ్మన్నా రాకపోవడం... తల్లి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. సంతోష్ రెడ్డికి ఏదో జరుగుతోందన్న అనుమానం కలిగించాయి.. మొహమాటపడుతూనే తన స్నేహితులను వాకబు చేశాడు. వాళ్లకు తెలిసిన సమాచారం వాళ్లు షేర్ చేశారు. అంతే.. తన అనుమానమే నిజమయ్యింది.

ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కానీ, ఇంటికి వెళ్లలేదు
పదేళ్ల పాటు నిర్మించుకున్న నమ్మకం అనే గోడ తన కళ్లముందే కూలిపోయినట్లనిపించింది సంతోష్ రెడ్డికి. రోజూ భార్య ఫోన్లో తనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఎందుకో అతన్ని వెక్కిరిస్తున్నట్లే అనిపించాయి.. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. దూరంగా ఉంటూ రోజూ తన భార్య కదలికలు గమనించేవాడు. రాత్రివేళ తన అపార్ట్­మెంట్ ముందు రహస్యంగా గస్తీకాసేవాడు.. తన అనుమానాలే నిజమయ్యాయి. తన కళ్లతోనే చాలా విషయాలను చూసి నిర్ధారించుకున్నాడు. నీ భార్యను భరించలేనంటూ తన తల్లీ ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో అతనికి బోధపడింది. పదే పదే ఆస్ట్రేలియా రమ్మని పిలిచినా భార్య ఎందుకు ఒప్పుకోవడం లేదో సరైన కారణం అతనికి తెలిసింది.. కానీ తాను నేరుగా వెళ్లి తనకు తెలిసిన విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్తే వింటారన్న నమ్మకం అతనికి లేదు. ఎందుకంటే.. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటావ్ కాబట్టి అనవసరంగా అనుమానాలు పెంచుకున్నావ్ అంటారనుకున్నాడు. అందుకే... నవంబర్ 22 అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. తాను చూసినదీ.. తెలుసుకున్నదీ అన్నీ చెప్పాడు. పోలీసులు కూడా అతని వెంట రావడానికి ఒప్పుకున్నారు.. అంతా కలిసి వెళ్లి తన ఇంటి తలుపు కొట్టారు. అప్పటిదాకా తన భర్త ఆస్ట్రేలియాలోనే ఉన్నాడనుకున్న సమత.. పోలీసులతో కలిసి అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి నిర్ఘాంతపోయింది. సైలెంటుగా వాళ్లకు తన ఇంట్లోకి అనుమతిచ్చింది. అయితే.. అప్పటికే ఆ ఇంట్లో అలజడి మొదలైంది.. పోలీసులు నేరుగా బాత్­రూమ్­లోకి వెళ్లారు. అక్కడ నక్కి చూస్తున్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి సమత ప్రియుడు శివప్రసాద్.

బెడ్­రూమ్‌లోంచి మరో జంట.. షాక్‌
సంతోష్ రెడ్డి అనుకున్న విధంగానే పోలీసుల సమక్షంలో తన భార్య బండారాన్ని బయటపెట్టాడు. సరిగ్గా ఇక్కడే అతనికి ఇంకో కొత్త విషయం తెలిసింది. తన ఇంట్లో ఆ సమయంలో ఉన్నది భార్య.. ఆమె ప్రియుడు మాత్రమే కాదు.. మరో బెడ్­రూమ్‌లోంచి మరో జంట బయటికొచ్చింది. వాళ్లను చూసి షాక్ తినడం సంతోష్ రెడ్డి వంతైంది. వాళ్లెవరు..? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నట్టు..? నైటీలో ఉన్న ఆ మహిళ పేరు విశాల.. ఆమె సమత స్నేహితురాలు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి పేరు నరేష్.. సమతకు పెళ్లైనట్లే విశాలకూ పెళ్లై పిల్లలున్నారు. కానీ.. ప్రియుడితో కలిసి సమతలాగే విశాల కూడా రహస్య బంధాన్ని కొనసాగిస్తోంది. సమత భర్త పోలీసులతో రావడంవల్ల ఆమె వివాహేతర సంబంధం కూడా బయటపడింది. ఇదే ఇంట్లో నుంచే.. మహిళా కానిస్టేబుల్ విశాల భర్తకు ఫోన్ చేసి మీ భార్య తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు సమాచారం ఇచ్చింది.

సమత ప్రియుడు శివప్రసాద్.. ఓ డాక్టర్. అతనిదీ సూర్యాపేటే. సమత పుట్టింటికి దగ్గర్లోనే అతని ఇల్లు.. పెళ్లికి ముందు నుంచి ఉన్న పరిచయం.. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వివాహేతర సంబంధంగా కొనసాగుతోంది. శివప్రసాద్­తో సంబంధం వల్లే సమత.. తనతోపాటు ఆస్ట్రేలియా వచ్చేందుకు ససేమిరా అనేదని సంతోష్ రెడ్డి అంటున్నారు. శివప్రసాద్­తో ఇలా గడిపేందుకే తన తల్లితో తరచూ తగాదా పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేసిందంటున్నారు. అంతేకాదు.. తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె ఫోన్ బిజీగానే ఉండేదనీ.. తాను పిల్లలతో మాట్లాడాలని ప్రయత్నించినా.. మాట్లాడనిచ్చేది కాదంటున్నారు.

కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న స్మార్ట్ ఫోన్ కల్చర్
సంతోష్ రెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్న చైతన్యపురి పోలీసులు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో అర్థరాత్రి వేళ సమత ఇంటికి వెళ్లి సమతతోపాటు.. ఆ ఇంట్లో ఉన్న ఆమె ప్రియుడు శివప్రసాద్.. మరో జంట విశాల, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 408, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భార్య వివాహేతర సంబంధాన్ని భర్త బయటపెట్టే కేసులు.. భర్త రహస్య సంబంధాలను భార్య రెడ్ హ్యాండెడ్­గా పట్టుకునే ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ కల్చర్ కుటుంబాల్లో చిచ్చుపెడుతోందని నిపుణులంటున్నారు. దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు వాట్సప్­లో తరచూ టచ్­లో ఉండటం.. గంటలు గంటలు సోషల్ మీడియాల్లో గడపడం వివాహబంధాన్ని నిలువునా కోతకోస్తోందంటున్నారు. భార్యాభర్తల బంధం మధ్య వాళ్లిద్దరే కాకుండా పిల్లలు కూడా ఉన్నారన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement